అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50 శాతం సుంకాలను ప్రకటించిన సంగతి అందరికి తెలుసు. మిత్ర దేశంగా ఉన్న యూఎస్ఏ.. ప్రస్తుతం ఇండియాపై ప్రతీకార సుంకాలను విధించి చోద్యం చూస్తోంది. ఈ తరుణంలో భారత్ ఏ మాత్రం తలదించకుండా.. అమెరికాకు గట్టి సమాధానం ఇస్తోంది. జపాన్, చైనా దేశాలతో సత్సంబంధాలను కలుపుకోవడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కదిలి వెళ్లారు.
మోదీ జపాన్ పర్యటన
అమెరికా ప్రతీకార సుంకాలను ప్రవేశపెట్టిన తరువాత.. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 29, 30వ తేదీలలో జపాన్ పర్యటన చేశారు. రెండు రోజుల ఈ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సమయంలో మోదీ.. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాకు ప్రత్యేకమైన రాతితో తయారు చేసిన బౌల్ గిఫ్ట్ ఇచ్చారు. చిన్న బౌల్ మాత్రమే కాకుండా నాలుగు చిన్న బౌల్స్.. జపాన్ సంప్రదాయంతో తినడానికి ఉపయోగించే రెండు చిన్న స్టిక్స్ ఉన్నాయి. ఈ స్టిక్స్ చివర వెండి కవచం ఉంది.
జపాన్ ప్రధాని భార్య ‘యోషికో ఇషిబా‘కు కాశ్మిరీ శాలువను బహూకరించారు. నాణ్యమైన ఉన్నితో తయారు చేసిన ఈ శాలువాను ఒకప్పుడు కాశ్మీరీ రాజులూ చాలా ఇష్టంగా ఉపయోగించేవారు. దీనిని కాశ్మిరీలు ప్రత్యేకంగా రూపొందించారు. తెల్లని అంచు కలిగిన ఈ శాలువా గులాబీ.. ఎరుపు రంగులతో చాలా సుందరంగా ఉంది.
నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి పదవిని స్వీకరించిన తరువాత.. జపాన్ సందర్శించడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే మోదీ.. ప్రపంచంలోని చాలా దేశాలను చుట్టి వస్తుంటారు. ఈ సారి పర్యటన మాత్రం.. చాలా ప్రత్యేకం అని నిపుణులు చెబుతున్నారు.
చైనా పర్యటనలో మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనను ముగించుకుని.. చైనా పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 30న తియాంజిన్‌కు చేరుకున్న మోదీ.. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న అక్కడ జరిగే శిఖరాగ్ర సమావేశాలకు హాజరుకానున్నారు. సుమారు ఏడేళ్ల తరువాత మోదీ చైనాలో కాలుపెట్టారు. చైనా పర్యటన.. భారత ఆర్ధిక వృద్ధికి దోహదపడుతుందని పలువురు ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు.
ఊహకందని రీతిలో జీడీపీ వృద్ధి
2026 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ ఊహకందని రీతిలో ఏకంగా 7.8 శాతానికి ఎగబాకింది. ఇది దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. భారత ఆర్ధిక వ్యవస్థ నిర్జీవమైపోయింది అని.. మన దేశాన్ని కించపరిచిన ‘డొనాల్డ్ ట్రంప్’కు ఇది సరైన సమాధానం అని నిపుణులు చెబుతున్నారు.
2047 వికసిత భారత్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే అనేక ఆర్ధిక సంస్కరణలు చేస్తున్నారు. పరిశ్రమలకు కూడా చేయూతనిస్తున్నారు. ఇటీవల వెల్లడైన జీడీపీ.. అంతకుముందు జీడీపీ కంటే చాలా ఎక్కువ అని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. అనుకున్న సమయానికి వికసిత భారత్ తప్పకుండా సాధ్యమవుతుంది. దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి వ్యవసాయ పరిశ్రమ, ఆటోమొబైల్ పరిశ్రమలు చాలా దోహదపడ్డాయని తెలుస్తోంది.