డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతిల కాంబినేషన్‌లో ఒక సరికొత్త సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతున్నాయి. పూరీ కనెక్ట్స్ – జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పైన పూరీ జగన్నాథ్ & ఛార్మీ కౌర్ ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. విజయ్ సేతుపతి రాబోయే సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో..
హిట్ కోసం పూరీ జగన్నాథ్!
పూరీ జగన్నాథ్.. రాబోయే సినిమా మంచి హిట్ సాధిస్తుందని గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ఇదివరకు వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు అంతంత మంత్రంగానే ఉన్నాయి. కాబట్టి ఈసారి వచ్చే సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించాలన్న కసితో పనిచేస్తున్నారు. దీనికోసం నటుడు విజయ్ సేతుపతిని ఒప్పించారు. ఈ సినిమా అయినా పూరీ జగన్నాథ్ ఆశలను నెరవేర్చాలని కోరుకుందాం.
వరుస విజయాలతో విజయ్ సేతుపతి
ప్రస్తుతం విజయ్ సేతుపతి వరుస విజయాలతో దూసుకుపోతున్న పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ వెర్సటైల్ యాక్టర్. ఇటు తెలుగు.. అటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో పాత్రతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఏ క్యారెక్టర్‌కైనా ఇట్టే ఇమిడిపోయి న్యాయం చేస్తున్నారు. నిత్యామీనన్ కాంబినేషన్‌లో తమిళంలో తలైవా తలైవి.. తెలుగులో సార్ అండ్ మేడమ్ సినిమా ఇటీవలే మంచి విజయం సాధించింది.
టైటిల్ & టీజర్ ఎప్పుడంటే?
వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ సేతుపతి.. పూరీ జగన్నాథ్ సినిమా కోసం సిద్దపడటం అనేది ఆసక్తి కలిగించే అంశం. అయితే వీరి కాంబినేషన్ ఎలా వుంటుందో చూడాలంటే మనం ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు బెగ్గర్ అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇంకో రెండు రోజుల్లో.. సినిమా టైటిల్ మరియు టీజర్ రెండింటిని కూడా ఒకేసారి విడుదలచేయనున్నారు. అంటే సెప్టెంబర్ 28న (పూరి జగన్నాథ్ బర్త్‌డే సందర్భంగా) పూరీ – విజయ్ సేతుపతిల అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వినిపించబోతున్నారు. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
సినిమాలో ఇతర ప్రముఖులు
పూరీ – విజయ్ సేతుపతిల సినిమా.. తెలుగులో మాత్రమే కాకుండా, తమిళం మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సంయుక్తా మీనన్, టబు, నీవేదా థామస్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్, దునియా విజయ్ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమా తెరకెక్కలేదు. మొదటిసారి పూరీ సినిమా కోసం విజయ్ సేతుపతి సిద్ధమయ్యారు. దీంతో అభిమానుల అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. సినిమా ఎలా ఉండబోతుంది?, దీనికోసం ఎంత బడ్జెట్ కేటాయించనున్నారు, రిలీజ్ డేట్ వంటి వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి. ఈ సారి పూరీ జగన్నాథ్ ఖాతాలో ఒక బ్లాక్ బస్టర్ ఖాయమని చాలామంది అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే!.