Ratan Tata Dream Car Nano For Indians: అది శీతాకాలం.. 2008 జనవరి 10వ తేదీ ఆటో ఎక్స్‌పోలో వందలాది కంపెనీలు, వేలాది జర్నలిస్టులు, దిగ్గజ వ్యాపారవేత్తలు, మంత్రులు ఇలా ఎంతోమంది నిండి ఉన్న వాతావరణం. అయితే ఏ హాల్ వద్ద లేనంతమంది జనం నెంబర్ 11 హాల్ దగ్గర కిక్కిరిసి ఉన్నారు. నిలబడటానికి స్థలం కూడా లేదు. వీరందరూ నిలబడి ఉన్నది.. ఏ పెద్ద లగ్జరీ కారు కోసమో కాదు. కేవలం ఓ చిన్న కారు కోసం. దాని ధర కేవలం రూ. లక్ష రూపాయలు మాత్రమే.
లక్ష రూపాయలకు కారు సాధ్యమేనా అని ఎంతోమంది కుతూహలంతో వేచి చూస్తున్నారు. హాల్ నెంబర్ 11 వద్ద కోలాహలం రెట్టింపు అయింది. లక్ష రూపాయల కారును చూపించడానికి అందరూ వచ్చేసారు. అదే సమయంలో రతన్ టాటా (Ratan Tata) చిన్న తెల్లటి కారును వేదికమీదకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసారు. కారును చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటికే లక్ష రూపాయలకు కారును తయారు చేయడం అసాధ్యం అనుకున్నవారు సైతం నోటికి తాళం వేసుకున్నారు.
కారు చూడటానికి చిన్నాదిగా ఉన్నప్పటికీ.. ప్రయాణికులకు కావాల్సిన సకల సౌకర్యాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి. లోపల క్యాబిన్ చాలా విశాలంగా ఉంది. నాలుగు చక్రాలు, స్టీరింగ్ వీల్, నలుగురు వ్యక్తులకు లేదా చిన్న కుటుంబానికి సరిపోయే విశాలమైన క్యాబిన్ ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. చిన్న కారుకు నాలుగు డోర్స్ ఉండటం ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. 22 కిమీ నుంచి 24 కిమీ మైలేజ్ ఇచ్చే ఈ కారు ఎంతోమందిని ఒక్క చూపుతోనే ఆకర్శించింది.
కారును పరిచయం చేసిన కార్యక్రమం పూర్తయింది. విలేఖరుల సమావేశం ప్రారంభమైంది కొందరు ఆ చిన్న కారును ‘బుద్దు కార్’ అని పిలిచారు. కానీ టాటా మోటార్స్ కారును ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన కారణంగా దాన్ని.. నానో కారుగా అభివర్ణించింది. ఇలా టాటా నానో కారు భారతదేశంలో అడుగుపెట్టింది.
నానో కారు ఎందుకు లాంచ్ చేశారు?
ప్రతి ఒక్కరికి సొంత కారు ఉండాలనేది ఒక కల. ఆ నిల నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడతారు. అయితే రోజు రోజుకి ధరలు భారీగా పెరుగుతుండటంతో.. కొందరికి ఆ కల కలగానే మిగిలిపోతుంది. అయితే అలాంటి కలను నిజం చేయడానికి రతన్ టాటా ఓ అడుగు ముందుకు వేశారు.
ఒక కారు కొనాలంటే కనీసం రూ.10 లక్షలు ఉండాల్సిందే.. కానీ రతన్ టాటా ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో ఒక కారును సృష్టించాలని కలలు కన్నారు. అనుకున్న విధంగానే కేవలం రూ.1 లక్షకే కారును అందించాలనే ఉద్దేశ్యంతో ‘నానో’ కారుకు శ్రీకారం చుట్టారు. టాటా నానో దేశీయ విఫణిలో లాంచ్ చేశారు. ఈ కారు ఒకప్పుడు మార్కెట్లో గొప్ప సంచలనం సృష్టించింది. కేవలం లక్ష రూపాయలకే కారు అనేది అసాధ్యమైన పని. ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇంత తక్కువ ధరకు కారును అందించలేదు.
రతన్ టాటా ఏం చెప్పారంటే?
భారతదేశంలో చాలా కుటుంబాలు స్కూటర్ మీద వెళ్లడం నేను చూసాను. తల్లి, తండ్రి మధ్యలో ఒక పిల్లవాడు. ఇలాంటి సన్నివేశాలను నేను చాలా సందర్భాల్లో చూసాను. వారికి రక్షణ కాల్పించాలనే ఉద్దేశ్యంతో.. నానో కారును రూపొందించడం జరిగిందని రతన్ టాటా వెల్లడించారు. మనదేశంలో మారుతి ఆల్టో 800 కారును కొనుగోలు చేయలేనివారు కూడా టాటా నానో కారును కొనుగోలు చేయగలిగారు.
ప్రారంభంలో విపరీతమైన అమ్మకాలు పొందిన టాటా నానో (Tata Nano) కారు 2018 వరకు కూడా మంచి అమ్మకాలను పొందుతూ.. ముందుకు సాగింది. అయితే అమ్మకాలు మందగించడం వల్ల 2018లో కంపెనీ ఈ కారు యొక్క ఉత్పత్తిని నిలిపివేసింది. టాటా నానో కారు ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా లేకపోవడం కూడా దీని ఉత్పత్తి నిలిచిపోవడానికి ప్రధాన కారణం కావడం గమనార్హం.
Don’t Miss: రతన్ టాటా మీద చెయ్యేసి మాట్లాడేంత చనువుందా! ఎవరితడు?
టాటా నానో ఎలక్ట్రిక్ (Tata Nano Electric)
నానో కారు ఉత్పత్తి నిలిచిపోయిన తరువాత రతన్ టాటా దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సంకల్పించారు. ఇప్పటికే రతన్ టాటా ఎలక్ట్రిక్ నానో కారును ఉపయోగిస్తున్నారు. అయితే ఈ కారును సాధారణ ప్రజల కోసం లాంచ్ చేయాల్సి ఉంది. కానీ అంతలోనే భరతమాత ముద్దుబిడ్డ రతన్ టాటా కన్ను మూసారు. దీంతో దేశం ఒక్కసారిగా మూగబోయింది.