Remembering Interesting Facts About Ratan Tata: ఒక రాజు తన జీవితాన్ని రాజ్య క్షేమం కోసం త్యాగం చేస్తారు. దేశం నాది.. దేశం కోసం నేను ఉన్నాను అని చెప్పే మహానుభావులు క్రీస్తు పూర్వం నుంచి ఇప్పటివరకు కూడా చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు. ఎలాంటి లాభాన్ని ఆశించకుండా.. వేలకోట్లు ధారాదత్తం చేసిన గొప్ప యుగపురుషుడు మన ‘రతన్ టాటా’. ఎనిమిది పదుల వయసుదాటినా.. సమాజ శ్రేయస్సుకోసమే పరితపించిన అభినవ భీష్మ పితామహుడు (రతన్ టాటా) ఇటీవలే కన్నుమూశారు.
ఒక వ్యక్తి మరణిస్తే.. దేశమే కన్నీరు కారుస్తుందంటే.. అతి తప్పకుండా రతన్ టాటా కోసమే అయి ఉండాలి. కలియుగంలో కూడా ముందు వెనుక ఆలోచించకుండా.. విద్య, వైద్యం వంటి వాటికోసం లెక్కకు మించి ఖర్చు చేశారు. ఆయన మరణం దేశానికీ తీరని లోటు. అయితే రతన్ టాటా అంటే గుర్తొచ్చే కొన్ని విషయాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూసేద్దాం..
రతన్ టాటా తన కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ చాలా సార్లు కనిపించారు. వేలకోట్ల రూపాయలకు అధినేత అయినప్పటికీ ఎక్కువగా టాటా నానో కారులోనే ప్రయాణిస్తారు. ఈయన తనకోసమే ఎలక్ట్రిక్ నానో కారును రూపొందించుకున్నారు. రతన్ టాటాతో ఎప్పుడు ఓ యువకుడు (శంతను నాయుడు) కనిపిస్తారు.
జేఆర్‌డీ టాటాతో ఉన్న సన్నివేశాలు చాలా ప్రత్యేకమైనవి. 1992కు ముందు టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల విభాగంపై ఎక్కువ ద్రుష్టి సారించారు. అప్పట్లో టాటా మోటార్స్ తన మొదటి ప్యాసింజర్ వాహనం విడుదల చేశారు. అప్పట్లో జేఆర్‌డీ టాటాతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ అరుదైన చిత్రం రతన్ టాటాకు ఎంతో ఇష్టమైనది చెబుతారు.
రతన్ టాటా 1998లో టాటా ఇండికా కారును విడుదల చేశారు. డీజిల్ ఇంజిన్‌తో భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి కారు ఇదే కావడం గమనార్హం. ఇదే తరువాత ఇతర దేశాలకు కూడా ఎగుమతి అయింది. కొన్ని దేశాల్లో ఇదే రివర్ సిటీ సిటీరోవర్‌గా విక్రయించబడింది. టాటా గ్రూప్ ఉనికిని దేశ సరిహద్దులు దాటేలా చేసిన ఘనత రతన్ టాటాకు దక్కింది.
భారతదేశంలో అతి తక్కువ ధరకు కారు లాంచ్ చేసిన ఘనత కూడా రతన్ టాటాకు దక్కింది. 2008లో రతన్ టాటా తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఎంచుకుని విజయవంతంగా నానో కారును లాంచ్ చేశారు. ప్రతి కుటుంబం సొంతంగా కారు కలిగి ఉండాలనే సదుద్దేశ్యంతో రతన్ టాటా దీనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికి కూడా ఈ కారు భారతీయ రోడ్ల మీద అక్కడక్కగా కనిపిస్తుంది.
రతన్ టాటా అంటే గుర్తొచ్చే మరో విషయం ఏమిటంటే.. ఫ్యాక్టరీని మార్చడం. నానో కారు విడుదలకు సమీపిస్తున్న సమయంలో టాటా మోటార్స్ వివాదంలో చిక్కుకుంది. 2006లో సింగూరులో తమ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 997 ఎకరాల వ్యవసాయ భూమిని తయారుదారునికి కేటాయించారు. ఆ తరువాత రైతుల నుంచి కొన్ని వివాదాలు తలెత్తాయి. ఆ తరువాత 2008 మధ్యలో ఈ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించడానికి సిద్ధమయ్యారు. 2008లో ఈ ప్రక్రియ పూర్తయింది. ఇదంతా రతన్ టాటా నాయకత్వంలో జరిగింది.
ప్రముఖ కంపెనీలను రతన్ టాటా కొనుగోలు చేశారు. రతన్ స్టీవార్డ్‌షిప్ కింద.. టాటా సన్స్ టెట్లీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ మరియు కోరస్ స్టీల్ వంటి మరెన్నో అంతర్జాతీయ బ్రాండ్‌లను కొనుగోలు చేశారు. ఇందులో జాగ్వార్ చెప్పుకోదగ్గ బ్రాండ్. ఆ తరువాత కంపెనీ నలుదిశలా వ్యాపించింది.
రతన్ టాటా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చదివి ఉంటారని చాలామంది భావించవచ్చు. కానీ ఈయన ఆర్కిటెక్చర్ చదివారంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. చదువు పూర్తయిన తరువాత 1962లో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో ఆపరేషన్స్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1975లో రతన్ టాటా హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు. 1991లో ఈయన టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు.
ఎయిరిండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. 1932లో టాటా సన్స్ ద్వారా ప్రారంభమైన ఎయిరిండియాను కొన్ని సంవత్సరాల తరువాత ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. ఆ తరువాత నష్టాలను భరించలేక ప్రభుత్వం మళ్ళీ దీనిని టాటా గ్రూపుకు విక్రయించింది. ప్రస్తుతం ఈ సంస్థ టాటా గ్రూప్ అధీనంలో ఉంది.
రతన్ టాటా జెట్స్, హెలికాఫ్టర్లను నడపడానికి కావలసిన లైసెన్స్ కూడా పొంది ఉన్నారు. కాబట్టి 2007లో ఈయన లాక్‌హీడ్ మార్టిన్ ఎఫ్16 ఫ్లయింగ్ ఫాల్కన్ ఫైటర్ జెట్‌కు కో-పైలట్‌గా పనిచేశారు. అంతే కాకుండా తన 69వ ఏట బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో అరగంటపాటు జెట్ నడిపేందుకు యూఎస్ డిఫెన్స్ కాంట్రాక్టర్ ఆహ్వానం లభించింది.
జంతువుల పట్ల అమితమైన ప్రేమ కలిగిన రతన్ టాటా.. జంతువుల కోసం ముంబైలో ఓ ప్రత్యేకమైన హాస్పిటల్ నిర్మించారు. రతన్ టాటాకు చిన్నప్పటి నుంచే కుక్కలంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే వాటి కోసం ప్రత్యేకమైన శ్రద్ద వహిస్తారు. జంతువుల పట్ల ప్రేమతో తన నివాసంలో కుక్కలను పెంచుకునేవారు.
రతన్ టాటా పెళ్లి చేసుకోలేదని అందరికి తెలుసు. ఈయన చదువుకునే రోజుల్లో అమెరికాలో ఒక యువతిని ప్రేమిస్తారు. ఇండియాకు తిరిగి వచ్చి.. మళ్ళీ ఆమెను తీసుకురావాలనుకున్నారు. అయితే అప్పట్లో ఇండో – చైనా యుద్ధం కారణంగా తల్లిదండ్రులు రతన్ టాటాను అమెరికా పంపించడానికి ఒప్పుకోలేదు. ఆ తరువాత ఈయన ప్రేమ విఫలమైంది. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు.
Don’t Miss: అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. ప్రజలకోసం ఓ అడుగు ముందుకేసి: ఇది కదా ‘రతన్ టాటా’
దేశానికి చేసిన సేవను గుర్తించి భారత ప్రభుత్వం రతన్ టాటాకు పద్మభూషణ్ అందించింది. అంతే కాకుండా గౌరవ డాక్టరేట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే మోడల్, గౌరవ డాక్టర్ ఆఫ్ టెక్నాలజీ, రెస్పాన్సిబుల్ క్యాపిటలిజం అవార్డు, అస్సాం బైభవ్ వంటి మరెన్నో ప్రశంసలు రతన్ టాటాను వరించాయి.