కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్.. పాన్ మాసాలపై విధించిన సెస్సు ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఆరోగ్య సంబంధిత కార్యకలాపాల కోసం వినియోగిస్తామని, దీనిని రాష్ట్రాలతో కూడా పంచుకుంటామని వెల్లడించారు. లోక్‌సభలో జరిగిన ఆరోగ్య భద్రతా జాతీయ భద్రతా సెస్ బిల్లు 2025పై చర్చ సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
వచ్చే ఆదాయం.. రాష్ట్రాలకు కూడా!
సెస్సు ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని.. ఆరోగ్య అవగాహన లేదా ఇతర ఆరోగ్య సంబంధిత పథకాలు / కార్యకలాపాల ద్వారా రాష్ట్రాలకు అందిస్తామని.. నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రకటనపై రాయ్ స్పందిస్తూ.. దీనిని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. అంతే కాకుండా ఆరోగ్య భద్రతను.. జాతీయ భద్రతతో కలపడం అస్పష్టంగా ఉందని ఆయన అన్నారు.
పొగాకు ఉత్పత్తుల ప్రమాదాలను గురించి కూడా బిల్లులో స్పష్టత లేదని రాయ అన్నారు. పాన్ మసాలా ఆరోగ్యానికి హానికరం, నోటి క్యాన్సర్ కారకం కూడా. అలాంటి వాటిపై హెచ్చరిక ముద్రించడానికి సంబంధించిన విషయాలు బిల్లులో లేవని అన్నారు. ఈ బిల్లు కొన్ని వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే యంత్రాలపై నెలవారీ సెస్ విధించాలని లక్యంగా పెట్టుకుంది. దీనిద్వారా వచ్చిన ఆదాయం ఆరోగ్య మరియు జాతీయ భద్రతా పథకాల కోసం పార్లమెంట్ కేటాయించిన భారత సంఘటిత నిధికి వెళ్తుంది.
ఇప్పటివరకు ఈ సెస్ ఎలా పనిచేసిందంటే?
2017 జులై నుంచి పొగాకు వంటి ఉత్పత్తులపై కేంద్రం సెస్సు విధించడం ప్రారంభించింది. దీనిని జీఎస్టీ అమలు నుంచి వచ్చే ఆదాయ నష్టాలను భర్తీ చేయడానికి రాష్ట్రాలతో పంచుకుంది. అయితే 2022లో రాష్ట్రాలకు పారిహారం ఇవ్వడం ఆపేసింది. కానీ జీఎస్టీ ఆదయ కొరతను తీర్చడానికి కోవిడ్ సమయంలో.. అదనపు రుణాలను చెల్లించడానికి పరిహార సెస్సు ప్రారంభించింది.
పాన్ మసాలాపై సెస్సు ఎందుకంటే?
బిల్లును గురించి నిర్మలా సీతారామన్ వివరిస్తూ.. పాన్ మసాలాను అరికట్టడానికి ఈ సెస్ పనిచేస్తుందని అన్నారు. జీఎస్టీ కింద ఇప్పటికే ఈ పాన్ మసాలాపై 40 శాతం పన్ను విధించడం జరిగింది. సెస్ అదనపు భారమైతే.. దీని వినియోగం క్రమంగా తగ్గుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సెస్ జీఎస్టీపై ఎటువంటి ప్రభావం చూపదని వివరించారు. పాన్ మసాలాపై ఎక్సైజ్ ట్యాక్స్ విధించలేదు. కాబట్టి దీని ఉత్పత్తికి పన్ను విధించేలా కేంద్రం ప్రత్యేక సెస్ ప్రవేశపెట్టింది. జీఎస్టీతో పాటు ఈ సెస్ కూడా ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
పొగాకు రైతులకు ప్రత్యామ్నాయం!
కేంద్రం తీసుకున్న నిర్ణయం పొగాకు రైతులపై ప్రభావం చూపుతుందని కొందరు వాదించారు. దీనిపై వివరణ ఇస్తూ.. పొగాకు రైతుల సంక్షేమాలను చూసుకోవడానికి అనేక పథకాలు ఉన్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద పంట వైవిధ్యీకరణ కార్యక్రమం 2015-16 నుంచి అమలులో ఉంది. దీనికింద పొగాకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం జరుగుతుందని కేంద్రమంత్రి అన్నారు.
భారతదేశంలో ప్రధానంగా 10 రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, గుజరాత్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్) ఉన్నాయి. 2017-18 మరియు 2021-22 మధ్య సుమారు 1.12 లక్షల ఎకరాల్లో పొగాకు ప్రత్యామ్నాయం పండించారు. రాబోయే రోజుల్లో పొగాకు ఉత్పత్తి మరింత తగ్గుతుందని ఆమె అన్నారు. మొత్తం మీద పొగాకు ఉత్పత్తిని వీలైనంత వరకు తగ్గించడానికి కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోంది.