చెల్లికి నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన రింకూ సింగ్: ధర ఎంతో తెలుసా?

అయినవాళ్లకు గిఫ్ట్స్ ఇవ్వడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఇందులో భాగంగానే 2025 ఆసియా కప్ విజేత భారత్ జట్టులో భాగమైన ఇండియన్ బ్యాటర్ రింకూ సింగ్ తన చెల్లెలికి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

చెల్లికి నచ్చిన గిఫ్ట్

2025 ఆసియా కప్ గెలిచినా తరువాత.. మార్క్యూ టోర్నమెంట్ తరువాత.. ఆస్ట్రేలియా పర్యటన కోసం తిరిగి జట్టులోకి చేరడానికి ముందు క్రికెటర్ రింకూ సింగ్ తన కుటుంబంతో గడిపారు. ఈ సమయంలో తన చెల్లి నేహా సింగ్‌కు.. హీరో విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివన్నీ నేహా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

రింకూ సింగ్ తన చెల్లికి కొనిచ్చిన హీరో విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ. 1లక్ష. ఇది ఎరుపు రంగులో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. అన్న గిఫ్ట్ ఇచ్చిన సందర్భంగా నేహా.. ఇన్‌స్టాలో కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ చేసింది.

హీరో విడా వీఎక్స్2 ప్లస్

విభిన్న రంగులలో లభించే హీరో విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 142 కిమీ రేంజ్ అందిస్తుంది (రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది). దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం కాగా.. ఇది ఎకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. డిస్క్ బ్రేక్ ఆప్షన్ కలిగిన ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ 27.2 లీటర్స్ కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి 5 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది. మొత్తం మీద ఇది సిటీ రైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

రింకూ సింగ్ విషయానికి వస్తే..

క్రికెటర్ రింకూ సింగ్ విషయానికి వస్తే.. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన ఆసియాకు ఫైనల్‌లో విన్నింగ్ షాట్ కొట్టి వార్తల్లో నిలిచారు. అలీఘర్‌లో జన్మించిన రింకూ.. అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల ఆసియాకు కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఒక బంతి మాత్రమే బ్యాటింగ్ చేయడానికి అవకాశం లభించింది. ఆ అవకాశం కీలకంగా మారడంతో.. నాలుగు పరుగులు చేసి ఆటను గెలిపించాడు. నిజానికి ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యకు గాయం కావడంతో.. రింకు జట్టులోకి వచ్చాడు. ఆలా ఫైనల్ మ్యాచ్ గెలవడానికి కారణమయ్యాడు.

ఇదిలా ఉండగా.. రింకూ సింగ్ గత ఏడాది తన స్వస్థలమైన అలీఘర్‌లో రూ. 3.5 కోట్ల విలువైన మూడు అంతస్థుల బంగ్లా కొనుగోలు చేశారు. ఈ బంగ్లాకు తన తల్లి గౌరవార్థం ‘వీణ ప్యాలెస్’ అని పేరు పెట్టారు. కాగా ఇతడు ఇప్పటి వరకు 34 టీ20 మ్యాచ్‌లు ఆడారు. 161.75 స్ట్రైక్ రేటుతో 550 పరుగులు చేసాడు. అంతే కాకుండా జాతీయ జట్టు తరపున రెండు వన్ డే మ్యాచ్‌లు ఆడారు.