BMW CE 02 Electric Scooter First Unit Delivery: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) యొక్క టూ-వీలర్ విభాగం ‘బీఎండబ్ల్యూ మోటొరాడ్’ (BMW Motorrad) ఇటీవలే ఖరీదైన సీఈ-02 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కాగా ఎట్టకేలకు కంపెనీ డెలివరీలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో స్కూటర్ డెలివరీకి సంబంధించిన సన్నివేశాలను చూడవచ్చు.
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త సీఈ-02 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.4.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ స్కూటర్ యొక్క మొదటి యూనిట్ను కేరళకు చెందిన వ్యక్తికి డెలివరీ చేసినట్లు సమాచారం. షోరూమ్ సిబ్బంది మొదటి కస్టమర్‌కు ఘానా స్వాగతం పలికి డెలివరీ చేశారు. కస్టమర్ కేక్ కట్ చేసిన తరువాత స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి స్కూటర్ సొంతం చేసుకుంటారు.
బీఎండబ్ల్యూ సీఈ-02 ఎలక్ట్రిక్ స్కూటర్
దేశీయ మార్కెట్లో ఇప్పటికే బీఎండబ్ల్యూ మోటోరాడ్ రూ. 14.90 లక్షల ఖరీదైన స్కూటర్ లాంచ్ చేసింది. దీని తరువాత కొంత తక్కువ ధరలో ఓ స్కూటర్ లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో సీఈ-02 పేరుతో మరో స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 4.5 లక్షలు. ఇది బ్రాండ్ యొక్క తక్కువ ధర కలిగిన స్కూటర్ అయినప్పటికీ.. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఇది చాలా ఖరీదైన స్కూటర్ అని తెలుస్తోంది.
రూ. 1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లు కావలసినన్ని ఉన్న సమయంలో బీఎండబ్ల్యూ సీఈ-02 విక్రయాలు మన దేశంలో కష్టమనే చెప్పాలి. ధర ఎక్కువే.. కానీ ఇది ఇప్పటికి మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని స్కూటర్ల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది అటు స్కూటర్ / బైక్ మాదిరిగా ఉంటుంది.
చూడటానికి భిన్నంగా ఉండే ఈ బీఎండబ్ల్యూ సీఈ-02 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముందు భాగంలో విండ్‌స్క్రీన్‌తో కూడిన దీర్ఘచతురస్రాకార ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది. హ్యాండిల్ బార్ కూడా కొంత పెరిగి ఉండటం చూడవచ్చు. ఇది రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
కొత్త బీఎండబ్ల్యూ సీఈ-02 ఉక్కుతో తయారైన డబుల్ లూప్ ప్రేమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్కూటర్ బరువు 142 కేజీలు. ఇది భారతదేశంలోనే తయారైనట్లు సమాచారం. కాబట్టి భారతీయ రోడ్లకు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేయబడింది. చూడటానికి సింపుల్ డిజైన్ పొందినప్పటికీ.. రైడర్లకు కావలసినన్ని ఫీచర్స్ పొందింది.
బీఎండబ్ల్యూ సీఈ-02 ఎలక్ట్రిక్ బైక్ 3.5 ఇంచెస్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ పొందుతుంది. అంతే కాకుండా ఇది బ్లూటూత్ ఇంటర్‌ఫేస్, ఎస్పీ కనెక్ట్ స్మార్ట్‌ఫోన్ హోల్డర్ వంటివి పొందుతుంది. యూఎస్‌బీ సీ ఛార్జర్ సాకేట్, కీలెస్ రైడ్, రివర్స్ మోడ్ మరియు పవర్ సేవింగ్ మోడ్ వంటివి కూడా ఇందులో పొందవచ్చు. ఈ స్కూటర్ మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఇందులో ఏబీఎస్, స్టెబిలిటీ కంట్రోల్ మరియు స్టెబిలిటీ కంట్రోల్ వంటివి కూడా ఉన్నాయి.
సీఈ-02 ఎలక్ట్రిక్ స్కూటర్ 11 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది. ఇది 3 సెకన్లలో గంటకు 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 95 కిమీ కావడం గమనార్హం. ఇందులో 3.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 108 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది.
Don’t Miss: ఈ కారు కావాలంటే సంవత్సరం ఆగాల్సిందే!.. ఫస్ట్ ఎవరు కొన్నారో తెలుసా?
బీఎండబ్ల్యూ సీఈ-04
ఇక బీఎండబ్ల్యూ-సీఈ02 విషయం పక్కన పెడితే.. ఇంతకంటే ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ బీఎండబ్ల్యూ సీఈ-04. ప్రారంభంలో చెప్పుకున్నట్లు దీని ధర రూ. 14.90 లక్షలు. ఇది 31 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటరుతో 41 Bhp పవర్ మరియు 61 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ కావడం గమనార్హం. ఇది కూడా భిన్నమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది.