చెప్పినట్లే చేసిన స్కోడా: భారత్‌లో ఖరీదైన కారు లాంచ్

స్కోడా ఆటో చెప్పినట్లుగానే.. దేశీయ విఫణిలో సరికొత్త ఆక్టావియా ఆర్ఎస్ కారును అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ కారు గురించి చాలా విషయాలు లాంచ్ కావడానికి ముందే తెలిసిపోయినప్పటికీ.. ధరలు మాత్రమే ఈ రోజు వెల్లడయ్యాయి. ఈ కారు ధర ఎంత, బుకింగ్స్, డిజైన్, డెలివరీ వంటి అన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆక్టావియా ఆర్ఎస్ ధర & బుకింగ్స్

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ ధర రూ. 49.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కారు కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే భారతదేశానికి కేటాయించబడిన అన్ని యూనిట్లు అమ్ముడైపోయాయి. దీన్ని బట్టి చూస్తే ధర ఎక్కువైనా.. ఈ కారుకు మంచి డిమాండ్ ఉందని అవగతం అవుతోంది. కాగా స్కోడా 100 యూనిట్ల ఆక్టావియా ఆర్ఎస్ కార్లను మాత్రమే కేటాయించి. ఇప్పుడు అన్ని యూనిట్లను విక్రయించేయడంతో.. ఇక డెలివరీలు చేయడమే ఆలస్యం. ఈ పనిని సంస్థ 2025 నవంబర్ 6 నుంచి ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే నవంబర్ 6 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయన్నమాట.

పవర్‌ట్రెయిన్ వివరాలు

2025 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారు 2.0 లీటర్ టీఎస్ఐ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 245 బీహెచ్‌పీ పవర్, 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు 6.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. పవర్‌ట్రెయిన్ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ (వీఏక్యూ)తో కూడిన ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేఅవుట్‌తో అనుసంధానించబడి.. అసాధారణమైన ట్రాక్షన్ కంట్రోల్ మరియు కార్నరింగ్ స్టెబిలిటీ అందిస్తుంది. కాబట్టి పనితీరు అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.

ఎక్స్‌టీరియర్ డిజైన్

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్.. సిగ్నేచర్ ఆర్ఎస్ బ్యాడ్జింగ్, గ్లా బ్లాక్ గ్రిల్, ఏరోడైనమిక్ బాడీ కిట్‌తో.. బ్లాక్ ఎక్స్‌టీరియర్ పొందుతుంది. ఎల్ఈడీ మ్యాట్రిక్డ్ హెడ్‌ల్యాంప్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, డౌన్‌ఫోర్స్‌ను పెంచే రియర్ స్పాయిలర్ వంటివన్నీ ఈ కారులో ఉన్నాయి. సిగ్నేచర్ కూపే మాదిరిగా ఉండే రూఫ్‌లైన్ కూడా ఇందులో చూడవచ్చు.

ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది స్పోర్ట్ సీట్లు, అల్యుమియం పెడల్స్, త్రీ స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. ఇవి కాకుండా 10.25 ఇంచెస్ వర్చువల్ కాక్‌పిట్, వైర్‌లెస్ స్మార్ట్‌లింక్‌తో కూడిన 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం కూడా ఈ కారులో ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్

ఆధునిక కాలంలో కార్లు కొనుగోలు చేసేవారు డిజైన్, మైలేజ్, ధర వంటి విషయాలతో పాటు సేఫ్టీ కూడా చూస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కూడా వాహన వినియోగదారులకు కావలసిన సేఫ్టీ అందిస్తోంది. స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారులో.. 10 ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎలామర్జెన్సీ బ్రేక్, పార్క్ అసిస్ట్ వంటివన్నీ అందించింది.

స్కోడా కొత్త కారు లాంచ్‌పై మా అభిప్రాయం

ఇండియన్ మార్కెట్లో స్కోడా కంపెనీకి మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ స్లావియా, కుషాక్ వంటి మోడల్స్ విక్రయిస్తోంది. అయితే ఇప్పుడు లాంచ్ చేసిన ఆక్టావియా ఆర్ఎస్ కారు ధర.. బ్రాండ్ యొక్క ఇతర మోడల్స్ కంటే కూడా చాలా ఎక్కువ. ధర ఎక్కువ అయినప్పటికీ.. ఇప్పటికే అన్నింటినీ కొనేశారంటే, దీనికున్న డిమాండ్ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం కంపెనీ దీనిని 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను పెంచుతుందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.