Special Story of Valentines Day and Love: ముందుగా ప్రేముకులందరికీ.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ప్రేమ (Love).. ఇది వినడానికి రెండక్షరాలే అయినా, సమస్తం ఇందులోనే దాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే చూపులతో మొదలై.. విశ్వాన్ని సైతం మరిపించే శక్తి బహుశా ప్రేమకే ఉందేమో. ప్రేమ కోసం ఖండాలు దాటిన వ్యక్తులను ఎందోమందిని చూశాము, చూస్తున్నాము, అంత పవిత్రమైన బంధం ప్రేమ. ఈ రోజు ప్రేమకు అర్థాలు మారిపోతున్నాయి. ఈ రోజు ప్రేమించుకుని.. రేపటికే విడిపోతున్నారు. దీన్నే నేడు ప్రేమ అంటున్నారు.
చరిత్రలో ప్రేమ..
ప్రేమంటే నమ్మకం, బాధ్యత, భరోసా.. ఇలా ఎన్ని చెప్పినా, ప్రేమను వర్ణించడం కష్టమే. ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించబడటం గొప్ప. ఒక అమ్మాయి లేదా అబ్బాయి నిజాయితీగా ప్రేమించుకుంటే.. ఎన్ని కష్టాలు వచ్చినా విడిపోకూడదు. దీనికి మన చరిత్రే సాక్ష్యం. ఎన్నో దశాబ్దాల క్రితం ప్రేమించుకున్న ఆంటోని – క్లియోపాత్ర, ముంతాజ్ – షాజహాన్, రోమియో – జూలియట్, షిరిన్ – ఫర్హాద్, లైలా – మజ్ను వంటివారి ప్రేమ కథలు ఈ రోజుకి మనకు వినిపిస్తున్నాయంటే.. వారి ప్రేమలోని నిజాయితీనే కారణం. అందుకే వీరి ప్రేమను చరిత్రకారులు సువర్ణాక్షరాలతో లిఖించారు. ఈ విశ్వం ఉన్నంతకాలం.. తప్పకుండా వీరి ప్రేమ కథలు వినిపిస్తూనే ఉంటాయి.
ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ పేరుతో వంచించడం తప్పు. ఒక మూర్ఖుడిని మార్చాలన్నా?.. ఒక వ్యక్తిని సరైన దారిలో నడిచేలా చేయాలన్నా.. అది తప్పకుండా ప్రేమతోనే సాధ్యమవుతుంది. ఎందోమంది యువకులు తాము ప్రేమించిన అమ్మాయికి నచ్చినట్లు ఉండాలని.. అహర్నిశలు పరితపిస్తుంటారు. అమ్మాయిలు సైతం.. తమకు నచ్చిన అబ్బాయి దగ్గర చంటిపిల్లలైపోతారు. అందుకే ”ప్రేమను ప్రేమతో.. ప్రేమగా ప్రేమిస్తే.. ప్రేమించబడిన ప్రేమ ప్రేమించబడిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది”.
ప్రేమ ఎలా పుడుతుందంటే?
సినిమాల్లో చూపించినట్లు.. ప్రేమ పుట్టునప్పుడు లేదా ప్రేమించాల్సిన వ్యక్తి కనిపించినప్పుడు.. గుండెల్లో గంటలు మోగడం, మెరుపులు మెరవడం, వర్షం పడటం లాంటి సంఘటనలు జరగవు. అసలు ప్రేమ అనేది.. ఎవరి మీద ఎప్పుడు, ఎలా పుడుతుందో తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ అసలు ఎందుకు పుడుతుందో కూడా తెలియదు. అందుకే లవ్ ఈస్ బ్లైండ్ అంటారు.
లేటెస్ట్ ప్రేమలు ఎలా ఉన్నాయంటే?
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో.. ప్రేమించుకోవడానికి కూడా టెక్నాలజీలనే వాడేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమై.. ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసుకునే.. ఎక్స్(ట్విటర్)లో పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. ఇలా జరిగిన పెళ్లిళ్లు కొన్ని రోజులకు పెటాకులవుతున్నాయి. ఆ తరువాత ఎవరిదారి వారిదే. ఇలా అందరి జీవితాల్లో జరుగుతాయని చెప్పలేము కానీ.. కొంతమంది టెక్నాలజీలను నమ్మి నట్టేట మునిగిపోతున్నారు. మరికొందరు.. తెలియనివారని నమ్మి మోసపోయి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే.. ప్రేమ పేరుతో మోసం చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో.. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Also Read: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్.. స్పందించిన రష్మిక – ఏమందో తెలుసా?
ప్రేమించుకోవడం బాగానే ఉంటుంది.. ఆ తరువాత పెద్దలను కాదని పెళ్లి చేసుకుని జీవితం మొదలు పెడితే.. ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అమ్మాయి తరపున వాళ్ళు, అబ్బాయి తరపున వాళ్ళు దూరం పెట్టేస్తే.. అప్పుడప్పుడే ఊహల ప్రపంచం వీడి జీవితంలో అడుగుపెట్టిన పసి మొగ్గలు.. ఓ పెను తుఫాన్ లాంటి కష్టాలను దాటాల్సి ఉంటుంది. బహుశా ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆ కష్టాల కడలి దాటితేనే అసలైన అందమైన జీవితం మొదలవుతుంది. ఆ కష్టాలను తట్టుకోలేక కన్ను మూసిన హృదయాలు ఎన్నో ఉన్నాయి.
ప్రేమ తప్పు కాదు!
రెండు మనసులు ప్రేమించుకోవడం తప్పేమీ కాదు. అయితే ప్రేమించాల్సిన వ్యక్తిని సెలక్ట్ చేసుకోవడంలో తప్పటడుగు వేసినా.. తప్పుడు వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినా.. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నట్లే. అయితే పిల్లల ప్రేమ విషయంలో పెద్దలు కూడా జాగ్రత్త వహించాలి. వారు ఎలాంటి వ్యక్తిని ప్రేమిస్తున్నారు? ఎలాంటి వ్యక్తిని ఎంచుకుంటున్నారు? అనే విషయాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వారిని దూరం చేసుకోకూడదు. పిల్లలు చేసిన తప్పును కొంత పెద్ద మనసుతో క్షమించి.. వారిని దగ్గర పెట్టుకుని కొంత ఎదగటానికి సహాయం చేయాలి. ప్రేమించడం తప్పని.. వారిని దూరం పెడితే, కష్టాలు తట్టుకోలేక కన్ను మూసే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే.. కన్నబిడ్డలకు తల్లిదండ్రులే కడసారి వీడ్కోలు చెప్పాల్సి ఉంటుంది.