భూలోకవైకుంఠం.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన ప్రదేశం తిరుమల. వెంకటేశ్వర స్వామికి ప్రతి ఏటా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే.. టీటీడీ యాజమాన్యం సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?, అందరూ ఎంతగానో ఎదురుచూసే గరుడ సేవ ఎప్పుడు అని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.
సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీనివాసుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమై.. అక్టోబర్ 02 వరకు జరుగుతాయి. 23వ తేదీ అంకురార్పణతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు.. చక్ర స్నానంతో ముగుస్తాయి. అంతే కంటే ముందు 16వ తేదీ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో.. ఉత్సవ మూర్తుల ఊరేగింపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య జరుగుతాయి. అంటే రోజుకు రెండు వాహనాల మీద ఆ పరమ పురుషుడు ఊరేగింపుగా దర్శమిస్తాడన్నమాట.
వాహన సేవల తేదీలు
➤2025 సెప్టెంబర్ 24: సాయంత్రం 5:43 గంటల నుంచి 6:15 వరకు ధ్వజారోహణం, రాత్రి 9:00 గంటలకు పెద్ద శేష వాహనంపై ఊరేగింపు.
➤2025 సెప్టెంబర్ 25: ఉదయం 8:00 గంటలకు చిన్న శేష వాహనంపై ఊరేగింపు.. రాత్రి 7:00 గంటలకు హంస వాహనం.
➤2025 సెప్టెంబర్ 26: ఉదయం 8:00 గంటలకు సింహ వాహనసేవ, రాత్రి 7:00 గంటలకు ముత్యపు పందిరిపై ఊరేగింపు.
➤2025 సెప్టెంబర్ 27: ఉదయం 8:00 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7:00 గంటలకు సర్వ భూపాల వాహనంపై ఊరేగింపు.
➤2025 సెప్టెంబర్ 28: ఉదయం 8:00 గంటలకు మోహినీ అవతారం.. సాయంత్రం 6:30 గంటల నుంచి గరుడ సేవ.
➤2025 సెప్టెంబర్ 29: ఉదయం 8:00 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4:00 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7:00 గంటలకు గజవాహనంపై ఊరేగింపు.
➤2025 సెప్టెంబర్ 30: ఉదయం 8:00 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7:00 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగింపు.
➤2025 అక్టోబర్ 1: ఉదయం 7:00 గంటలకు రథోత్సవం, రాత్రి 7:00 గంటలకు అశ్వ వాహనంపై ఊరేగింపు.
➤2025 అక్టోబర్ 2: ఉదయం 6:00 గంటల నుంచి 9:00 గంటల వరకు చక్ర స్నానం, రాత్రి 8:30 గంటల నుంచి 10:00 గంటల వరకు ధ్వజారోహణం.
బ్రేక్ దర్శనాలు
శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల వేళ.. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు విచ్చేస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ యాజమాన్యం బ్రహ్మోత్సవాల సమయంలో.. బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అయితే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే ఈ బ్రేక్ దర్శన సౌకర్యం లభిస్తుంది. మిగిలిన వారికి బ్రేక్ దర్శనాలు ఉండవు. భక్తులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి.
తిరుమలలో పటిష్టమైన భద్రత కోసం.. విజిలెన్స్ అధికారులు, పోలీసుల సంఖ్యను పెంచారు. అంతే కాకుండా కొండపై పార్కింగ్ వంటి వాటికోసం కూడా సంబంధిత యాజమాన్యం ఏర్పాట్లను చేసింది. ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి టీటీడీ బోర్డు ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది.
వాహనాలకు అనుమతి ఇలా..
బ్రహ్మోత్సవాల సమయంలో కొండపై భక్తుల రద్దీ అధికం అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి 9:00 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు. ఈ విషయాన్ని భక్తులు తప్పకుండా గమనించాలి. శ్రీవారి భక్తులు కొండపై ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా.. మాడవీధుల్లో క్యూలైన్స్, అన్న ప్రసాదాల పంపిణీ అన్నీ కూడా సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.