సుడిగాలి సుధీర్ కొత్త సినిమా: హైలెస్సో గురించి ఆసక్తికర విషయాలు

బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎదిగిన సుడిగాలి సుధీర్ గురించి అందరికీ తెలుసు. జబర్దస్త్ షోల ద్వారా పాపులర్ అయిన యితడు ప్రస్తుతం ఇంకా టీవీ షోలలో కూడా కనిపిస్తున్నారు. తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ సుధీర్ పేరుతో తీసిన సినిమాలో హీరోగా తెరకెక్కారు. ఇప్పుడు తాజాగా సుధీర్ ఐదవ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్, టీజర్ వంటి వాటిని అధికారికంగా రిలీజ్ చేశారు.

సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమా పేరు హైలెస్సో. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. కుమార్ కోట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శివచెర్రీ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాలో నటుడు శివాజీ, అక్షర గౌడ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. గంగాలమ్మా తల్లి.. సల్లగ సూడే తల్లి అనే ఓ చిన్న లిరిక్స్‌తో టీజర్ లాంచ్ చేశారు.

సుధీర్ పాన్ ఇండియా సినిమా?

హైలెస్సో టీజర్ ఒక రకంగా.. పుష్ప సినిమాను తలిపించినట్లు ఉందని చాలామంది చెబుతున్నారు. అంటే సుడిగాలి సుధీర్ కూడా పాన్ ఇండియా లెవెల్ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా అనగానే.. సుధీర్ అభిమానులు సంబరపడుతున్నారు. అయితే కొందరు మాత్రం పాన్ ఇండియా సినిమా అంటే.. కొన్ని విమర్శలు కురిపిస్తున్నారు. ముందు సుధీర్ హీరోగా నిలదొక్కుకున్న తరువాత పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఏదైతే ఏం.. కష్టపడి స్వయంకృషితో పైకొచ్చిన వారిలో సుధీర్ కూడా ఒకరు కాబట్టి.. అతడు మంచు సక్సెస్ సాధించాలని అందరూ అనుకుంటున్నారు.

సుధీర్ ఐదవ సినిమా..

ఎస్ఎస్5 హ్యాష్‌ట్యాగ్‌తో రిలీజ్ అయిన హైలెస్సో సినిమా.. సుడిగాలి సుధీర్ నటిస్తున్న ఐదవ సినిమా. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు, 3 మంకీస్, గోట్ సినిమాల్లో కనిపించిన సుధీర్ ఇప్పుడు హైలెస్సో సినిమాలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు తెలియాల్సి ఉంది. బహుశా ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

సుడిగాలి సుధీర్ గురించి

1987 మే 19న కృష్ణ జిల్లాలోని విజయవాడలో జన్మించిన సుడిగాలి సుధీర్.. మ్యాజిక్ షోలు చేసుకుంటూ.. చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. జబర్దస్త్ షో కారణంగా మంచి ఆదరణ పొందాడు. ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శీను, సన్నీతో కలిసి చేసిన స్కిట్స్ బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ఇతనికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ రెడీ అయింది. ఇప్పటికి కూడా సుడిగాలి సుధీర్ అంటే అభిమానించేవారు చాలామందే ఉన్నారు.

జబర్దస్త్ షోలు మాత్రమే కాకుండా.. ఢీ జోడి, పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ, సూపర్ సింగర్ జూనియర్స్ షోలకు యాంకర్‌గా కూడా సుధీర్ పనిచేశారు. ఇతడు హీరోగా సినిమాలు తీయడానికి ముందు చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. కాగా ఇప్పుడు తెరకెక్కనున్న హైలెస్సో సినిమా ఎలా ఉండబోతుంది?, ఇండస్ట్రీ హిట్ సాధిస్తుందా?, సుధీర్‌కి మంచి సక్సెస్ ఇస్తుందా? అనే చాలా విషయాలు తెలియాల్సి ఉంది.