నవంబర్ 25న లాంచ్ అయ్యే టాటా కొత్త కారు ఇదే: దీని గురించి తెలుసా?

టాటా మోటార్స్.. మరో కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయననున్న కారు పేరు టాటా సియెర్రా. దీనిని సంస్థ దేశీయ విఫణిలో 2025 నవంబర్ 25న అధికారికంగా లాంచ్ చేయనుంది. కాగా అంతంకంటే ముందు.. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి.

ఐకానిక్ మోడల్ డిజైన్!

చూడగానే ఆకట్టుకునే డిజైన్, విలాసవంతమైన బాడీ కలిగిన టాటా సియెర్రా.. 2000ల నాటి ఐకానికి మోడల్స్ నుంచి ప్రేరణ పొందినట్లు సమాచారం. సొగసైన హెడ్‌ల్యాంప్‌లు, పూర్తి వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్‌బార్ వంటివాటిని ఇక్కడ చూడవచ్చు. బ్లాక్ అవుట్ ఓఆర్వీఎం, సీ పిల్లర్స్, ఫ్లష్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటివి ఈ కారులో కనిపిస్తాయి. ఇవన్నీ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి.

ఇప్పటికి విడుదలైన సమాచారం

ఇప్పటికే కంపెనీ టాటా సియెర్రా కారులో పెడా పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుందని వెల్లడించింది. అంతే కాకుండా ఇందులో ఇన్ఫినిట్ విండో సెటప్ కూడా ఉంటుందని నిర్దారించింది. ఇది ప్రయాణికులకు మరింత గాలిని అందిస్తుంది. క్యాబిన్‌లో ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటి వాటితో పాటు.. ప్రయాణికులకు కోసం అదనపు స్క్రీన్స్ కూడా ఉండనున్నాయి. ఇలాంటి సెటప్ ఇప్పటి వరకు కంపెనీ కారులోని అందించడలేదు. మహీంద్రా కంపెనీ మాత్రం ఈ ఫీచర్ తన ఎక్స్ఈవీ 9ఈ కారులో అందించింది.

స్టీరింగ్ వీల్ మీద ప్రకాశవంతమైన.. బ్రాండ్ లోగో ఉన్నట్లు ఇప్పటికి విడుదలైన టీజర్లలో వెల్లడైంది. కాగా కంపెనీ ఈ కారును పసుపు, ఎరుపు రంగుల్లో అందించనున్నట్లు సమాచారం. బహుశా మరిన్ని రంగుల్లో కూడా లభించే అవకాశం ఉందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

మూడు ఇంజిన్స్!

ఇంజిన్ విషయానికి వస్తే.. టాటా సియెర్రా కారు 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉండనుంది. ఈ ఇంజిన్ ఆప్షన్స్ ఇప్పటికే టాటా హారియర్ కారులో ఉన్నాయి. కంపెనీ బహుశా టాటా సియెర్రా కారును భవిష్యత్తులో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై స్పష్టమైన సమాచారం వెల్లడికాలేదు.

దేశీయ విఫణిలో టాటా కార్లకున్న ఆదరణ

భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే బ్రాండ్ టాటా మోటార్స్. కాబట్టి చాలా మంది ఈ బ్రాండ్ కార్లనే ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన కార్ల జాబితాలో టాటా కార్లు చాలానే ఉన్నాయి. అంటే టాటా కార్లు అత్యంత సురక్షితమైన కారుగా కూడా ఆదరణ పొందాయి. కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను, డీజిల్, పెట్రోల్ కార్లను విక్రయిస్తోంది. ఈ జాబితాలోకి సియెర్రా చేరనుంది. ఇది కూడా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఈ కారు ప్రారంభ ధర రూ. 15 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ఉండే అవకాశం ఉంది. ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.