తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డ్స్: పూర్తి వివరాలు

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఊరూ, వాడల్లో బతుకమ్మలు నిలిపి సంబరాలు చేసుకుంటారు. ఈ సారి బతుకమ్మ సంబరాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దీనికోసం సరూర్ నగర్ మున్సిపల్ స్టేడియంలో జీహెచ్ఎంసీ, రాష్ట్ర పర్యాటక శాఖ కలిసి తగిన ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా సుమారు 63 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేశారు.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్

తెలంగాణాలో ఏర్పాటైన 63 అడుగుల బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు అధికారికంగా వెల్లడించారు. అంతే కాకుండా ఈ భారీ బతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు ఒకేసారి ఆడిపాడారు. దీనికిగానూ మరో గిన్నిస్ రికార్డ్ లభించింది. మొత్తం మీద తెలంగాణ ప్రభత్వం శ్రీకారం చుట్టిన ఈ భారీ బతుకమ్మ కార్యక్రమాన్ని రెండు గిన్నిస్ బుక్ ఆర్ రికార్డులు వచ్చాయి. ఇది బతుకమ్మకు, తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం అనే చెప్పాలి.

ప్రత్యేక ఏర్పాట్లు & సౌకర్యాలు

ప్రభుత్వం నిర్వహించిన ఈ భారీ బతుకమ్మ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు సౌకర్యాలను కల్పించారు. ఉచిత తాగునీరు, భోజన సదుపాయాలతో పాటు.. మహిళల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో సంబరాలు జరుపుకోవడానికి కావలసిన లైటింగ్ సదుపాయం, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్య రాకుండా ఉండటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది.

ఒకప్పుడు బతుకమ్మ సంబరాలు.. పల్లెల్లో మాత్రమే నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం ఈ ఆచార, సంప్రదాయాలను నగరవాసులు కూడా గౌరవిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఈ కారణంగానే నగరంలోని దాదాపు అన్ని సందుల్లోనూ బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత.. ఈ పండుగకు మరింత ఆదరణ పెరిగింది. కాబట్టి ప్రభుత్వాలు మారినా.. ఈ పండుగను ఆడంబరంగా నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో ఆడపడుచులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో ఒకటి బతుకమ్మ. ఒకప్పటి నుంచి.. ఇప్పటి వరకు బతుకమ్మ ఆడే పద్దతిలో కావచ్చు, పాడే పాటల్లో కావచ్చు ఎంతో వ్యాత్యాసం కనిపిస్తున్నప్పటికీ.. ఆనవాయితీని మాత్రం అలాగే కొనసాగిస్తున్నానందుకు ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ బతుకమ్మ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఇతర శాఖల క్యాబినెట్ మంత్రులు, కమిషనర్లు, ఐఏఎస్ & ఐపిఎస్ అధికారులు మొదలైనవారు పాల్గొన్నారు.

గల్లీ నుంచి గ్లోబల్ వరకు..

బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న సందర్భంగా.. మంత్రి సీతక్క మాట్లాడుతూ, బతుకమ్మ ప్రముఖ్యతను ఈ రోజు ప్రపంచానికి చాటి చెప్పాము. గల్లీ నుంచి గ్లోబల్ వరకు మహిళలు ఏ రంగంలో అయినా రాణిస్తారు అని చెప్పడానికి ఇది నిదర్శనం అని అన్నారు. బతుకమ్మ గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకోవడానికి కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు చెబుతూనే.. ఆడబిడ్డల జీవితాలు వెలుగులతో నిండాలని ఆకాంక్షించారు. మొత్తం మీద తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రపంచ రికార్డ్ సాధించడం గొప్ప విషయం, దీనికి సహకరించిన ప్రభుత్వం ప్రసంశనీయం.