తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది: పోలింగ్ ఎప్పుడంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సుమారు 1.67 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఓటర్లు.. కఠినమైన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మార్గదర్శకాల ప్రకారం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయితీలకు ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురించి ఈ కథనంలో చూసేద్దాం..

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు

తెలంగాణ స్టేట్ ఎన్నికల కమీషన్ (ఎస్ఈసీ).. మొత్తం జిల్లాలలోని 5749 ఎంపీటీసీ స్థానాలకు, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ చేస్తుంది. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్వత్రా సిద్ధమవుతోంది. రాష్ట్రంలో 81.65 లక్షల పురుషులు, 85.36 లక్షల మంది మహిళలు, 504 మంది ఇతరులు.. ఇలా మొత్తం కలిపి 1.67 కోట్ల మంది తెలంగాణాలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాడానికి అర్హులు.

ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఖరారు చేయడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కీలక విభాగాల అధిపతులతో.. సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు చేశారు. షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. అధికారులు ఎస్ఈసీ (స్టేట్ ఎలక్షన్ కమిషన్)కి వెల్లడించారు.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు

  • తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం.. ఎన్నికల కమిషన్ అక్టోబర్ 9, 13వ తేదీల్లో నోటికికేషన్ జారీ చేయనుంది.
  • గ్రామ పంచాయితీ ఎన్నికలకు అక్టోబర్ 17, 21, 25 తేదీల్లో నోటిఫికేషన్ విడుదలవుతుంది.
  • 2025 అక్టోబర్ 23న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ జరుగుతుంది.
  • 2025 అక్టోబర్ 27న.. రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తారు.
  • 2025 అక్టోబర్ 31 & 2025 నవంబర్ 4, 5 తేదీల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతాయి. ఈ రోజే గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.
  • 2025 నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కౌంటింగ్/ఫలితాలు
  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు.. మొదటి దశ నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 2025 అక్టోబర్ 11.
  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో దశ నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 2025 అక్టోబర్ 15.

హైకోర్టు ఆదేశాలతో, రాష్ట్ర ప్రభుత్వం సమ్మతితో.. ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ 45 రోజుల గడువు కోరింది. ఈ సమయంలో ఎన్నికలు పూర్తి చేయనుంది. అంతే కాకుండా.. మండలాలు, జిల్లా ప్రజా పరిషత్, గ్రామ పంచాయితీల రిజర్వేషన్లపై సమగ్ర మార్గదర్శకాలను ఎన్నికల కమిషన్ జారీ చేసింది.

31 జిల్లాలు.. 15302 పోలింగ్ కేంద్రాలు

తెలంగాణ స్థానిక ఎన్నికల కోసం.. ఎలక్షన్ కమిషన్ 31 జిల్లాలలో మొత్తం 15302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 12733 గ్రామ పంచాయితీలలో 1,12,288 వార్డులు ఉన్నాయి. కాగా 5749 ఎంపీటీసీ స్థానాలకు, 656 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లు, అభ్యర్థులు మోడల్ ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, న్యాయంగా ఓటు హక్కును వినియోగించాలని ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసింది. అయితే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది.. అనే విషయం తెలుసుకోవడానికి ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే.