డీజే టిల్లు సినిమాతో ఫేమస్ అయిన హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమాకంటే ముందు ఇతడు నటించిన సినిమాల విషయానికి వస్తే.. గుంటూరు టాకీస్, జోష్, కృష్ణ అండ్ హిస్ లీలా, మా వింత గాధ వినుమా, భీమిలి కబడ్డీ జట్టు, ఆరెంజ్, కల్కి లాంటి అనేక చిత్రాలు ఉన్నాయి. వీటన్నింటిలో కొద్దిగా మెయిన్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది మాత్రం గుంటూరు టాకీస్ అనే చెప్పుకోవాలి. ఇందులో నరేశ్‌కి, సిద్దుకి మధ్యలో నడిచే క్రైమ్ కామెడీ డ్రామా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. మాస్ ఇమేజ్‌తో సినీ ప్రేక్షకులకు సిద్దు చాలా దగ్గరయ్యాడు. ఆ తరువాత సినిమాలు చేస్తున్న కూడా అంత బజ్‌ను తీసుకురాలేకపోయాయి అనే చెప్పాలి. అటువంటి పరిస్థితిలో వచ్చిందే డీజే టిల్లు.
టిల్లు ఇచ్చిన ఉత్సహం అసాధారణం
మా వింత గాధ వినుమా.. తరువాత సిద్దునే విమల్ కృష్ణతో కలిసి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అన్నీ సిద్ధం చేసుకొని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై.. సూర్య దేవర నాగవంశీ నిర్మించిన చిత్రం డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డకి ఈ సినిమా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సుస్థిరమైన నటుడుగా నిలబెట్టింది. కనీవిననీ రీతిలో అఖండ విజయాన్ని అందజేసింది. అదే ఊపులో డానికి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ తీశారు. అది కూడా అంతే రెస్పాన్స్ తీసుకొచ్చింది. ఇప్పటికీ ఎక్కడ చూసిన టిల్లు పాటలు, ఆ డైలాగ్స్ అందరిని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాయి. పూర్తిస్థాయి హీరోని చేసిన చిత్రం టిల్లు అనే చెప్పాలి.
జాక్ సినిమాతో నష్టాలు
డీజే టిల్లు సీక్వెల్ తరువాత భారీ అంచనాలతో వచ్చిన సినిమా జాక్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ తీసిన చిత్రం జాక్. ప్రకాష్ రాజ్, వైష్ణవి చైతన్య, నరేష్ ,బ్రహ్మజీ, సుబ్బరాజు, రవి ప్రకాష్, రాహుల్ దేవ్, శబీర్ కలరక్కల్ వంటి మంచి పాపులర్ నటులు అందరూ కూడా ఇందులో నటించారు. ఈ మూవీని శ్రీవేంకటేశ్వర సినీ చిత్రాలు బ్యానర్‌పై శ్రీకాంత్, మణికాంత్ నిర్మించారు. అందరూ తెలిసిన మంచి మంచి నటులు, అనుభవమున్న దర్శకుడు, ఆల్రెడీ అందరికి పరిచయం ఉన్న హీరో, హీరోయిన్ అందరూ కూడా ఈ చిత్రంలో భాగం అయ్యారు. అయినప్పటికీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తాను నిరూపించుకోలేక పోయింది.
అక్టోబర్ 17న తెలుసు కదా
సిద్దు జొన్నలగడ్డ కెరీర్‌లో అతి పెద్ద పరాభవాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనితో జాక్ సినిమా నిర్మాతలు నష్టాల్లో కూరుకుపోయారు. ఆ సమయంలో హీరోగా చేసిన సిద్దు నిర్మాతల ఇబ్బందిని చూడలేక తన దగ్గర డబ్బులు లేకపోయినా బయట నుంచి వడ్డీలకు అప్పు తెచ్చి నిర్మాతలకు రూ. 4.75 కోట్లు ఇచ్చారు. దీంతో ఇండస్ట్రీలో అప్పట్లో.. ఇదొక చర్చనీయాంశం అయింది. సిద్దు వయసులో చిన్నవాడు అయినప్పటికీ తాను ఈ చేసిన మంచి పనికి గొప్ప ప్రసంశలు పొందాడు. ఎదుటి వ్యక్తుల బాధను అర్థం చేసుకోవడంలో ఉన్నతంగా ఆలోచించాడని కొనియాడారు. కాగా ఈ నెల అక్టోబర్ 17న దీపావళి రోజున సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా అనే కొత్త సినిమాతో.. మళ్ళీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి బయలుదేరి వస్తున్నాడు.