మొదలైన టెస్లా డెలివెరీలు: ఆనందంలో కస్టమర్లు

భారతదేశంలో టెస్లా కార్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఎన్నాళ్ళ నుంచో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టాలని, ఇక్కడ కార్ల విక్రయాలు జరపాలని ఎదురు చూస్తున్న టెస్లా కల నెరవేరింది. ఇప్పటికే దేశంలో షోరూమ్స్ ప్రారంభించి, తన కార్యక్రమాలను ముందుకు నెడుతున్న సంస్థ.. ఇప్పుడు మోడల్ వై కారు డెలివరీలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చైనా నుంచి దిగుమతి

నిజానికి ఇండియన్ మార్కెట్లో టెస్లా కంపెనీ.. తన కార్యకలాపాలను మోడల్ వై కారుతోనే ప్రారంభించింది. ఈ కారును మార్కెట్లో లాంచ్ చేయడానికి ముందే.. దీనిని సంస్థ భారతీయ రోడ్లపై మోడల్ 3 కారును టెస్ట్ చేసింది. ఆ తరువాత మోడల్ వై కారును లాంచ్ చేయడం జరిగింది. కాగా ఇప్పుడు ఈ కారు డెలివరీలు మొదలయ్యాయి. ఈ కారును కంపెనీ భారతదేశంలో తయారు చేయడం లేదు, అంతే కాకుండా దీనిని జర్మనీ నుంచి కాకుండా.. చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది.

టెస్లా కంపెనీ తన మోడల్ వై కారును డెలివరీ చేసిన ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. టెస్లా ఫ్యామిలీకి స్వాగతం అని వెల్లడించింది. ప్రస్తుతం టెస్లా కంపెనీ ముంబై, ఢిల్లీలో రెండు షోరూమ్స్ కలిగి ఉంది. కాగా దేశ వ్యాప్తంగా తన ఉనికిని విస్తరించడానికి కావలసిన సన్నాహాలు కూడా సిద్ధం చేస్తోంది.

మోడల్ వై గురించి

టెస్లా లాంచ్ చేసిన మోడల్ వై ప్రారంభ ధర భారతదేశంలో రూ. 59.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). ప్రస్తుతం ఇది ప్రీమియం ఉత్పత్తిగా అమ్మకానికి ఉంది.

మోడల్ వై 299 పీఎస్ పవర్, 420 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఒకే ఎలక్ట్రిక్ మోటరుతో.. రియర్ వీల్ డ్రైవ్ కారుగా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది 60.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా.. 500 కిమీ రేంజ్ అందిస్తుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ 75 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 622 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 340 పీఎస్ పవర్, 450 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి ఇది లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

ఇండియన్ మార్కెట్లో టెస్లా కార్లు అనుకున్నంత ఆదరణ పొందలేదు. దీనికి కారణం ధర కావొచ్చు, ఇతరత్రా కారణాలు కావొచ్చు. ప్రధాన కారణం ధర అనే తెలుస్తోంది. టెస్లా మోడల్ వై.. కోసం వెచ్చించే డబ్బుతో ఇండియన్ మార్కెట్లో ఓ మంచి కారును కొనుగోలు చేయొచ్చని చాలామంది భావిస్తున్నారు. అంతే కాకుండా.. టెస్లా ఎలక్ట్రిక్ కారు కావడం వల్ల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కావలసినన్ని అందుబాటులో లేదు. దీనికి తోడు దేశంలో కంపెనీ సర్వీస్ సెంటర్లు కూడా పెద్ద సంఖ్యలో లేదు. ఇవన్నీ టెస్లా ఆదరణ పొందకపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

దేశంలో అధిక ఆధరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లు

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో.. టాటా నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ వంటివి మాత్రమే కాకుండా.. మహీంద్రా ఆధునిక మోడల్స్ అయిన బీఈ6, ఎక్స్ఈవీ 9ఈ మొదలైనవి ఉన్నాయి. వీటి ధరలు కూడా టెస్లా మోడల్ వై కంటే తక్కువే. వీటికి కావలసిన సర్వీస్ సెంటర్లు, ఇతర మౌలిక సదుపాయాలు దేశంలో విరివిగా అందుబాటులో ఉన్నాయి.