చదువు పూర్తయ్యి ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే అందరూ ఎదురుచూసేది.. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని. అలాంటి వాటికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవతరగతి, ఐటీఐ పూర్తి చేసినవారికి ఏకంగా 1743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.
టీజీఎస్ఆర్టీసీ (తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్రంలోని వివిధ జోన్లలలో మొత్తం 1743 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 1000 డ్రైవర్ పోస్టులు కాగా.. మిగిలినవి 743 శ్రామిక్ పోస్టులు. నిర్దేశించిన అర్హత కలిగిన ఉద్యోగులు ఈ నెల 8 నుంచి (2025 అక్టోబర్ 8) ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 2025 అక్టోబర్ 28.
వయో పరిమితి & వేతన వివరాలు
డ్రైవర్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే వారి వయసు 22 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. అదే విధంగా శ్రామిక్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే వారి వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు వయోపరిమితి ఐదేళ్లు సడలింపు ఉంటుంది. ఈఎస్ఎం అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం విషయానికి వస్తే.. డ్రైవర్ ఉద్యోగానికి ఎంపికైనవారికి వేతనం రూ. 20,960 నుంచి రూ. 60,080 వరకు ఉంటుంది. కాగా శ్రామిక్ ఉద్యోగానికి ఎంపికైన వారికి జీతం రూ. 16,500 నుంచి రూ. 45,030 వరకు ఉంటుంది. అయితే ఉద్యోగంలో చేరిన తరువాత అనుభవం, సీనియారిటీని బట్టి పెరుగుతుంది.
అప్లై విధానం & అప్లికేషన్ ఫీజు
అక్టోబర్ 8 నుంచి టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేసికోవడానికి అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 300 కాగా.. ఇతరులకు రూ. 600. అదే విధంగా శ్రామిక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి, ఇతరులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం ఇలా..
టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తరువాత ఎంపిక విధానం ఎలా ఉండబోతోందంటే?.. డ్రైవింగ్ టెస్ట్ మాత్రమే కాకుండా.. మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ వంటివి కూడా ఉండనున్నాయి. అయితే ఎలాంటి రాత పరీక్ష ఉండదని తెలుస్తోంది. కాబట్టి ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు కొంత గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. అయితే డ్రైవింగ్‌కు సంబంధించిన లైసెన్స్, ఇందులో కొంత అనుభవం కూడా అవసరమని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడానికి ఎప్పటికప్పుడు కావలసిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల పోలీస్ నియమాలు చేపట్టింది. ఇది మాత్రమే కాకుండా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ వంటి వాటిలో కూడా ఉద్యోగాలను కల్పించింది. ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీలో కూడా ఉద్యోగాలను కల్పించడానికి సిద్ధమైంది. రాబోయే రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్స్ జారీ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్దమవుతున్నవారు.. మరింత గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. లేకుంటే పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమైపోతుంది.