కాలం మారిపోయింది.. ప్రకృతి కూడా కలుషితం అయిపోతోంది. జీవితమనే పరుగుపందెంలో పడి మనిషి చాలా బిజీ అయిపోయాడు. కుటుంబానికి కూడా సమయం కేటాయించని స్థితిలో ఉన్నవారి సంఖ్య చాలానే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎప్పుడో ఒకసారి.. ఎదో ఒక సందర్భంలో కాస్త సమయం చేసుకుని.. అలా విహారయాత్రకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది.
పొగమంచుతో కూడిన ఉదయాలు, సరస్సు ఒడ్డును తిరగడం, వంకర రోడ్లమీద మధురానుభూతి ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎవరికైనా ఇప్పుడే విహారయాత్రకు బయలుదేరాలి తప్పకుండా అనిపిస్తుంది. ప్రస్తుతం మనం 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ.. 90లలోకి తీసుకెల్లో కొన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు నేటికీ మనదేశంలో ఉన్నాయి. వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ మీకోసం..
సిమ్లా (హిమాచల్ ప్రదేశ్)
భారతదేశంలో విహారయాత్రకు వెళ్లాలంటే.. సరైన ప్రదేశం లేదని ఎవరిని అడిగా.. ముక్తకంఠంతో చెప్పేమాట సిమ్లా. ఈ ప్రాంతం మిమ్మల్ని 90లలోకి తీసుకెళ్తుంది. మే నెలలో కూడా మంకీ క్యాప్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఈ ప్రాంతంలో ఉంటుంది. కల్కా-సిమ్లా బొమ్మ రైలు కేవలం రవాణాకు మాత్రమే కాదు.. అది మిమ్మల్ని ఎంతో ఆనందింపచేస్తుంది. ఇక్కడ బేకరీలలో ఇప్పటికి కూడా క్రీమ్ రోల్స్ అమ్ముతారు. పాత కుటీరాలలో మీరు ప్రశాంతంగా సేద తీర్చుకోవచ్చు. ఈ ప్రాంతం మిమ్మంల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది.
ఊటీ (తమిళనాడు)
ఉత్తర భారతదేశానికి సిమ్లా అయితే.. దక్షిణ భారతదేశానికి ఊటీ. దీన్నిబట్టి చూస్తే ఊటీ ప్రాముఖ్యత ఇట్టే అర్థమైపోతుంది. దట్టమైన పొగమంచు, ప్రకృతి వినిపించే సంగీతం.. ఊటీ సరస్సులో పడవ ప్రయాణం.. అందమైన పువ్వులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. టీ, తేయాకు వంటివి కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. నిశ్శబ్ద, చల్లని వాతావరణం కావాలంటే జీవితంలో ఒక్కసారైనా ఊటీకి వెళ్లాల్సిందే. సాయంత్రం పూట స్వెటర్లు ధరించి.. అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
డార్జిలింగ్ (పశ్చిమ బెంగాల్)
భారతదేశం నుంచి మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల సందర్శకులు డార్జిలింగ్ సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. సూర్యోదయం కోసం ఉదయమే టైగర్ హిల్స్ సందర్శించడం, అక్కడ గులాబీ రంగులో కనిపించే కాంచన గంగ చాలా ఆకట్టుకుంటాయి. టీ ఆకుల వాసన.. అక్కడ వీధుల్లో గుబాళిస్తూ ఉంటుంది. ఇక్కడి రైలు ప్రయాణం మీకు తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోతుంది. అంతే కాకుండా కెవెంటర్స్లో అల్పాహారం, గ్లెనరీస్లో పేస్ట్రీలు, టీ తోటలలో జీవితం.. ఇవన్నీ మిమ్మల్ని ఎంతో ఆకట్టుకుంటాయి.
నైనిటాల్ (ఉత్తరాఖండ్)
దేవభూమి అయిన ఉత్తరాఖండ్, పర్యాటక ప్రదేశం కూడా. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ సినిమాటిక్ జీవితాన్ని చూపిస్తే.. ఉత్తరాఖండ్ నైనిటాల్ వ్యక్తిగత జీవితాన్నే పరిచయం చేస్తుంది. అందమైన ప్రకృతి.. నైని సరస్సుపై ప్రయాణం చాలా ఆకట్టుకుంటాయి. సరస్సు దగ్గర సుదీర్ఘమైన నడక, ప్రకృతి చేసే మధురమైన శబ్దం మిమ్మల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. టిబెట్ మార్కెట్ కూడా ఎంతో ఆకట్టుకుంటుంది.
మాథెరన్ (మహారాష్ట్ర)
ఇప్పటికి కూడా మాథెరన్ ప్రాంతం లోపలికి కార్లను అనుమతించరు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ పర్యావరణం, ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక కొండ ప్రాంతం. కుటుంబాలు టాయ్ ట్రైన్లో ప్రయాణం చేసి.. చెక్క నేలలతో ఉన్న బంగ్లాలలో బసచేసేవారు. మేఘాలు కమ్ముకుంటుండగా.. వరండాలలో టీ తాగేవారు. ఇదే విధానం ఇప్పటికీ అవలంబిస్తున్నారు. భారతదేశంలో అత్యంత ప్రశాంతమైన కొండప్రాంతం ఏదైనా ఉందంటే.. అది ఖచ్చితంగా మాథెరన్ అని చెప్పాల్సిందే. ఇక్కడా నిశ్శబ్దం చాలా గొప్ప అనుభూతిని అందిస్తుంది.
మౌంట్ అబూ (రాజస్థాన్)
రాజస్థాన్ అంటే ఎడారి ప్రాంతమే కాదు.. హిల్ స్టేషన్ మౌంట్ అబూ కూడా. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇప్పటికీ చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. నక్కీ సరస్సులో పడవ ప్రయాణం, దిల్వారా దేవాలయ సౌందర్యం, అద్భుతమైన సూర్యాస్తమయ అనుభూతి.. మార్కెట్ వీధుల్లో సందర్శనం, ఇవన్నీ మీకు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇక్కడ మీరు ఒక ప్రత్యేకమైన వాతావరణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.