2025 ఆగస్టు నెల పూర్తి కావడంతో.. వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల డేటాను విడుదల చేశాయి. ఈ నివేదికలో గత నెలలో అత్యధిక అమ్మకాలు పొందిన కారుగా ”మారుతి సుజుకి ఎర్టిగా” తన ఆధిపత్యం చెలాయించింది. దీంతో హ్యుందాయ్ క్రెటా, మారుతి డిజైర్ వంటి కార్లు సైతం అమ్మకాల్లో వెనుకబడ్డాయి.
తాజా నివేదికల ప్రకారం.. మారుతి సుజుకి ఇండియా 2025 ఆగస్టులో 18,445 యూనిట్ల ఎర్టిగా కార్లను విక్రయించింది. దీంతో ఎర్టిగా నెలవారీ అమ్మకాల్లో అగ్రస్థానములో నిలిచింది. కాగా డిజైర్ 16,509 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలువగా.. మూడో స్థానంలో హ్యుందాయ్ క్రెటా 15,924 యూనిట్ల అమ్మకాలను సొంతం చేసుకుంది. ఆ తరువాత టాప్ 10 జాబితాలో వరుసగా వ్యాగన్ ఆర్, టాటా నెక్సాన్, బ్రెజ్జా, బాలెనొ, ఫ్రాంక్స్, స్విఫ్ట్, ఈకో వంటి కార్లు ఉన్నాయి.
మారుతి ఎర్టిగా గురించి
ఎర్టిగా 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 103 బీహెచ్పీ పవర్, 137 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇది ప్రస్తుతం సీఎన్జీ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇది 88 బీహెచ్పీ పవర్, 121 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే పొందింది. ఎర్టిగా సీఎన్జీ వేరియంట్.. 26 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. దీంతో ఇది ప్రస్తుతం దేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎంపీవీగా నిలిచింది.
మారుతి ఎర్టిగా (ధర రూ. 9.11 లక్షలు, ఎక్స్ షోరూమ్).. హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఇది 7 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, రెండో వరుసలో రూఫ్ మౌంటెడ్ ఏసీ, కలర్ టీఎఫ్టీ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే మొదలైన ఫీచర్స్ ఇందులో చూడవచ్చు.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే మారుతి ఎర్టిగాలో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న చాలా కార్లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతాయి. ఎర్టిగా మాత్రం రెండు ఎయిర్‌బ్యాగ్‌లతోనే సరిపెట్టుకుంటోంది.
ఆగస్టులో ఎక్కువ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్లు
➤మారుతి ఎర్టిగా: 18,445 యూనిట్లు
➤మారుతి డిజైర్: 16,509 యూనిట్లు
➤హ్యుందాయ్ క్రెటా: 15,924 యూనిట్లు
➤మారుతి వ్యాగన్ ఆర్: 14,552 యూనిట్లు
➤టాటా నెక్సాన్: 14,004 యూనిట్లు
➤మారుతి బ్రెజ్జా: 13,620 యూనిట్లు
➤మారుతి బాలెనొ: 12,549 యూనిట్లు
➤మారుతి ఫ్రాంక్స్: 12,422 యూనిట్లు
➤మారుతి స్విఫ్ట్: 12,385 యూనిట్లు
➤మారుతి ఈకో: 10,785 యూనిట్లు
స్పీడుమీదున్న ఆటోమొబైల్ రంగం
భారతదేశ ఆటోమొబైల్ రంగం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. లెక్కకు మించిన కంపెనీలు దేశీయ విఫణిలో కొత్త కార్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో జర్మనీ, జపాన్, అమెరికా, చైనా, స్వీడన్, ఫ్రెంచ్, వియాత్నం మొదలైన దేశాలకు చెందిన బ్రాండ్స్ ఉన్నాయి. దేశ ఆర్ధిక రంగం అభివృద్ధి చెందడానికి కూడా ఆటోమొబైల్ రంగంలో చాలా దోహదపడుతోంది. అంతే కాకుండా వాహన ప్రేమికులు కూడా ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగానే దేశంలో కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది.