భారతదేశంలోని 5 బెస్ట్ 7-సీటర్ కార్లు: ధర & వివరాలు

ఇండియన్ మార్కెట్లో చిన్నకార్లకు (5 సీటర్స్) మాత్రమే కాకుండా.. పెద్ద కార్లకు (7 సీటర్స్) కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు దేశీయ విఫణిలో 7 సీటర్ కార్లను లాంచ్ చేశాయి. అయితే కొన్ని సంస్థలు లాంచ్ చేసిన ఈ కార్ల ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. ధర ఎక్కువైతే కొనుగోలుదారుల సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ కథనంలో దేశంలోని సరసమైన 7 సీటర్ కార్లు ఏవి?, వాటి వివరాలు ఏమిటనేది చూసేద్దాం.

రెనాల్ట్ ట్రైబర్

సరసమైన 7 సీటర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది.. రెనాల్ట్ ట్రైబర్. దీని ధర రూ. 5.76 లక్షల నుంచి రూ. 8.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. మూడు వరుసల సీటింగ్ ఆప్షన్ పొందిన ఈ కారు.. ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 72 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ కారులోని మద్యవరుస బెంచ్ సీట్లను 60:40 నిష్పత్తిలో మడచవచ్చు, ముందుకు & వెనుకకు జరుపవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం.. కంపెనీ ఈ కారులోని మద్యవరుస, చివరి వరుస సీట్లకు ఏవెంట్స్ ఏర్పాటు చేసింది.

మహీంద్రా బొలెరో

దేశీయ విఫణిలో రూ. 7.99 లక్షల నుంచి రూ. 9.69 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభించే మహీంద్రా కంపెనీకి చెందిన బొలెరో కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇది 7 సీటర్ కారు అయినప్పటికీ.. వెనుక సీట్లు కొంత భిన్నంగా.. మోకాలికి తగినంత స్పేస్ ఉండదు. దీనివల్ల లాంగ్ జర్నీ చేసేటప్పుడు, ప్రయాణికులు ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అయితే ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, లెథరెట్ అపోల్స్ట్రే, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 76 హార్స్ పవర్ అందిస్తుంది. మూడవ వరుసలో సైడ్ ఫేసింగ్ సీట్లు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో నియో

దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన బొలెరో నియో కూడా సరసమైన 7 సీటర్ కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 8. 49 లక్షల నుంచి రూ. 10.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). సాధారణ బొలెరో కంటే కూడా బొలెరో నియో లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ప్రయాణికుల సౌలబ్యార్థం సీటింగ్ పొజిషన్ ఉంటుంది. కుర్చీలాంటి ఫ్రంట్ సీట్లు, మధ్యవరుసలో ముగ్గురు కూర్చోవడానికి అనువైన సీటింగ్ ఉంటుంది. కొంత ఇరుకుగా ఉంటుందని సమాచారం. ఈ కారులోని 1.5 లీటర్ 3 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 100 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి ఎర్టిగా

భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన 7 సీటర్ మోడల్ ఈ మారుతి ఎర్టిగా. దీని ధర రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). బెస్ట్ సెల్లింగ్ కారుగా రికార్డ్ క్రియేట్ చేసిన ఈ కారు.. ప్రయాణికులకు చాలా అనుకూలమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. విశాలమైన క్యాబిన్, మూడు వరుసల సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ ఉండటం వల్ల దీనిని ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఇందులో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 103 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది సీఎన్‌జీ రూపంలో కూడా అమ్మకానికి ఉంది. ఇది సాధారణ పెట్రోల్ కారు కంటే కూడా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.

కియా కారెన్స్

సౌత్ కొరియా బ్రాండ్ అయినప్పటికీ.. ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఈ కియా కారెన్స్. రూ. 10.99 లక్షల నుంచి రూ. 12.77 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభిస్తున్న ఈ మోడల్ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (115 హార్స్ పవర్), 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ (116 హార్స్ పవర్) ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండూ కూడా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మూడు వరుసలలో ఉన్న సీట్లు ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. డిజైన మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.