Top 5 Best Electric Motorcycles in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో.. కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ విఫణిలో లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో ఉన్న అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.
దేశీయ మార్కెట్లో ఇప్పటి వరకు లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైకులు లాంచ్ అయ్యాయి. డిజైన్, ఫీచర్స్, ఛార్జింగ్ మరియు రేంజ్ వంటి విషయాల్లో అద్భుతమైన బైకులుగా ఆల్ట్రావయొలెట్ ఎఫ్77, రివోల్ట్ ఆర్‌వీ400, మ్యాటర్ ఎరా 5000, టార్క్ క్రటోస్ ఆర్ మరియు ఓబెన్ రోర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ బైక్ రైడర్లకు అద్భుతమైన రైడింగ్ అనుభూతిని తప్పకుండా అందిస్తాయి.
ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 (Ultraviolette F77)
ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న ‘ఆల్ట్రావయొలెట్ ఎఫ్77’ మన జాబితాలో చెప్పుకోదగ్గ సూపర్.. స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్. ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 యొక్క టాప్ ఎండ్ మోడల్ ‘రీకాన్’ 10.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 27 kW మోటరుతో వస్తుంది. ఇది 36.2 Bhp పవర్ మరియు 95 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టాప్ స్పీడ్ 147 కిమీ/గం కావడం గమనార్హం.
ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 యొక్క పరిధి 307 కిమీ వరకు ఉంటుందని ధ్రువీకరించారు. ఈ బైక్ చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగి ఉంటుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండటం వల్ల ఎక్కువ రేంజ్ అందిస్తుంది. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బైక్ విదేశీ మార్కెట్లో కూడా అడుగుపెట్టడానికి సిద్ధమైంది. దీన్నిబట్టి చూస్తే ఈ ఎలక్ట్రిక్ బైకుకి మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందనేది ఇట్టే అర్థమవుతుంది.
రివోల్ట్ ఆర్‌వీ400 (Revolt RV400)
రివోల్ట్ కంపెనీ యొక్క ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్ కూడా అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైకులలో ఒకటి. ఇది రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగపడుతుంది. 3.24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ బైక్ 150 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. కానీ వాస్తవ ప్రపంచంలో.. వివిధ వాతావరణ పరిస్థితుల మధ్య ఈ బైక్ ఒక సింగిల్ చార్జితో 100కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.
మ్యాటర్ ఎరా 5000 (Matter Aera 5000)
మనజాబితాలో చెప్పుకోదగ్గ మరో స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్ మ్యాటర్ ఎరా 5000. ఇది చాలా సింపుల్ డిజైన్ కలిగి, ఒక్క చూపుతోనే ఆకర్షిస్తుంది. ఈ బైక్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన శక్తివంతమైన 10 kW మోటరుతో వస్తుంది. ఇది 13.4 Bhp పవర్ మరియు 520 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్స్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటివి పొందుతుంది.
టార్క్ క్రటోస్ ఆర్ (Tork Kratos R)
టార్క్ క్రటోస్ ఆర్ విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ 4 kW ఎలక్ట్రిక్ మోటరుతో నడిచే రీజనరేటివ్ బ్రేకింగ్ మరియు వివిధ రైడింగ్ మోడ్స్ వంటివి పొందుతుంది. క్రటోస్ ఆర్ బైక్ ఒక సింగిల్ చార్జితో గంటకు 70 కిమీ వేగంతో.. 180 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ బైక్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఎక్కువ మంది బైక్ ప్రేమికులు ఈ బైకుని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.
ఒబెన్ రోర్ (Oben Rorr)
ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 10kW మోటరుతో వస్తుంది. ఈ బైక్ 13.4 Bhp పవర్ మరియు 62 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 200 కిమీ పరిధిని అందిస్తుంది IDC ద్వారా ధృవీకరించబడింది. వాస్తవ ప్రపంచంలో రేంజ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ బైక్ ఎల్ఈడీ లైట్స్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్స్ ఉంటాయి.
Don’t Miss: భారత్‌లో అడుగెట్టిన BMW కొత్త కారు – ధర తెలిస్తే షాకవుతారు!
పెట్రోల్ బైకులకు ప్రత్యామ్నాయంగా మాత్రమే కాకుండా.. వాతావరణంలో కాలుష్య కారకాలను తగ్గించడంలో కూడా ఎలక్ట్రిక్ బైకులు ఉపయోగపడతాయి. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించడానికి సబ్సిడీలు కూడా అందిస్తున్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ బైకుల వినియోగాన్ని పెంచడంలో సహాయపడ్డాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాయి.