ఒక నెల ముగిసిందంటే.. వాహన తయారీ సంస్థలు తమ సేల్స్ రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే 2025 సెప్టెంబర్ ముగియగానే దిగ్గజ సంస్థలు గత నెలలో ఎన్ని కార్లను విక్రయించాయని వివరాలు వెల్లడించాయి. ఈ కథనంలో సెప్టెంబర్ 2025లో ఎక్కువ అమ్మకాలు పొందిన లేదా ఎక్కువమంది కొనుగోలు చేసిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.
సెప్టెంబర్ 2025లో ఎక్కువమంది కొన్న టాప్ 5 కార్లు
టాటా నెక్సాన్: దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ గత నెలలో తన నెక్సాన్ కారును ఏకంగా 22,573 యూనిట్లను విక్రయించింది. అంటే ఒక్క సెప్టెంబర్ నెలలోనే 22,573 మంది నెక్సాన్ కార్లను కొనుగోలు చేశారన్నమాట. గత ఏడాది ఇదే నెలలో (2024 సెప్టెంబర్) నెక్సాన్ సేల్స్ 11,470 యూనిట్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే.. 2025 సెప్టెంబర్ నెలలో నెక్సాన్ అమ్మకాలు 97 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో నెక్సాన్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ రూపంలో అందుబాటులో ఉంది.
మారుతి డిజైర్: సెప్టెంబర్ 2025లో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా మారుతి డిజైన్ స్థానం సంపాదించుకుంది. ఈ కారు సేల్స్ 2024 సెప్టెంబర్‌లో 10853 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. కాగా ఈ ఏడాది (2025 సెప్టెంబర్) ఈ మోడల్ అమ్మకాలు 20,038 యూనిట్లుగా నమోదయ్యాయి. దీంతో అమ్మకాల వృద్ధి 85 శాతం పెరిగింది. కొంత సరసమైన ధర వద్ద లభించే ఈ డిజైర్ కారు.. మంచి డిజైన్, వాహన వినియోగదారులకు కావలసిన ఫీచర్స్ పొందుతుంది. దీంతో ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
హ్యుందాయ్ క్రెటా: ఎక్కువ అమ్మకాలు పొందిన కార్ల జాబితాలో హ్యుండయ్ క్రెటా ముచ్చటగా మూడో స్థానంలో నిలిచింది. ఇది సెప్టెంబర్ 2025లో 18,861 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. సెప్టెంబర్ 2024లో ఈ అమ్మకాలు 15,902 యూనిట్లు. అంటే క్రెటా అమ్మకాలు ఈ ఏడాది 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ కారు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కువ అమ్మకాలు పొందిన కారుగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ కారు ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉంది.
మహీంద్రా స్కార్పియో: ఇండియన్ మార్కెట్లో ఎక్కువమందికి చాలాకాలం నుంచి ఇష్టమైన కార్లలో ఒకటిగా ఉన్న మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో గత నెలలో (2025 సెప్టెంబర్) మంచి అమ్మకాలు పొందగలిగింది. ఈ కారు 18372 యూనిట్ల అమ్మకాలతో జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. 2025 సెప్టెంబర్ నెలలో ఈ మోడల్ సేల్స్ 14438 యూనిట్లు మాత్రమే. అంటే సంస్థ వార్షిక వృద్ధి 27 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ కారు స్కార్పియో, స్కార్పియో నియో పేర్లతో అమ్మకానికి అందుబాటులో ఉంది.
టాటా పంచ్: లాస్ట్ పంచ్ మనదైతే.. ఆ కిక్కే వేరప్పా అన్నట్లు, మన జాబితాలో ఎక్కువ అమ్మకాలు పొందిన కారుగా ఐదవ స్థానంలో టాటా పంచ్ స్థానం ఆక్రమించుకుంది. ఈ కారు మొత్తం సేల్స్ సెప్టెంబర్ 2025లో 15891 యూనిట్లు. గత ఏడాది ఇదే నెలలో.. అంటే సెప్టెంబర్ 2024లో ఈ కారు అమ్మకాలు 13711 యూనిట్లు. వార్షిక వృద్ధి పరంగా ఇది 16 శాతం ముందుకు సాగింది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ కారు.. అత్యధిక భద్రతా ఫీచర్స్ పొందింది. ధర కూడా కొంత తక్కువే కావడంతో ఈ కారును ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
కార్ల అమ్మకాలు పెరగడానికి కారణాలు
సెప్టెంబర్ 2025లో జరిగిన వాహన అమ్మకాలు ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇంత భారీ అమ్మకాలు జరగడానికి ప్రధాన కారణం.. పండుగ సీజన్, తగ్గిన జీఎస్టీ (కొత్త జీఎస్టీ సంస్కరణలు) అని తెలుస్తోంది. ఇండియన్ ఆటోమొబైల్ సెక్టార్ సెప్టెంబర్ 2025లో 3,78,457 యూనిట్ల వాహనాలను డీలర్లను పంపించింది. 2024 సెప్టెంబర్ నెలలో ఈ సంఖ్య 3,58,879 యూనిట్లు. దీన్నిబట్టి చూస్తే.. అమ్మకాలలో వార్షిక వృద్ధి 5.5 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది.