భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతూ ఉంది. దీనికి కారణం ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ పెరగడమే. నగర ప్రయాణం చేయడానికి, మెయింటెనెన్స్ తగ్గించుకోవడానికి.. చాలామంది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లోని ఐదు ఉత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి తెలుసుకుందాం.
ఏథర్ 450ఎస్
దేశీయ విఫణిలో చాలామందికి నచ్చిన.. ఎంతోమంది మెచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఏథర్ 450ఎస్ ఒకటి. దీని ధర రూ. 1.43 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి ఆకర్షణీయంగా ఉండే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. కాబట్టి ఇది ఒక ఫుల్ ఛార్జితో 122 కిమీ దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. కాగా ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 90 కిమీ / గం కాగా.. ఇది 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం 3.9 సెకన్లు మాత్రమే.
ఈ స్కూటర్ యొక్క డీప్ వ్యూ డిస్‌ప్లే రియల్ టైమ్ న్యావిగేషన్, రైడింగ్ మోడ్స్, కనెక్టెడ్ ఫీచర్స్ వంటివన్నీ ఉన్నాయి. ధర కొంత తక్కువగా ఉండటమే కాకుండా.. లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం కూడా ఎక్కువమంది ఈ స్కూటర్ కొనుగోలు చేయడానికి కారణం అవుతోంది.
టీవీఎస్ ఆర్బిటర్
రూ. 99,900 ఎక్స్ షోరూమ్ ధర వద్ద లభించే టీవీఎస్ కంపెనీకి చెందిన ఆర్బిటర్ మన జాబితాలో.. 5 ఉత్తమమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇందులోని 3.1 కిలోవాట్ బ్యాటరీ 115 కిమీ దూరం ప్రయాణించడానికి అనుమతిస్తుంది. 68 కిమీ స్పీడ్ కలిగిన ఈ స్కూటర్.. 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజిని పొందుతుంది. కొంత ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వాటికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, యూఎస్బీ ఛార్జింగ్, డ్యూయల్ రైడింగ్ మోడ్స్ వంటివి ఉన్న ఈ టీవీఎస్ ఆర్బిటర్ రోజువారీ వినియోగానికి ఉత్తమమైన ఎంపిక. ఇది భిన్నమైన డిజైన్ పొందుతుంది. తద్వారా.. ఎక్కువమందిని ఆకట్టుకుంటుంది.
హీరో విడా వీ2 ప్రో
మన జాబితాలో అత్యుత్తమమైన ఐదు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో.. హీరో విడా వీ2 ప్రో కూడా ఒకటి. దీని ధర రూ. 1.20 లక్షలు. ఇది కూడా 115 కిమీ రేంజ్ పరిధిని అందిస్తుంది. దీనికోసం కంపెనీ 3.94 కిలోవాట్ బ్యాటరీని ఫిక్స్ చేసింది. ఇందులోని 6 వాట్స్ ఎలక్ట్రిక్ మోటారు 25 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 90 కిమీ/గం. ఇది రిమూవబుల్ బ్యాటరీ పొందుతుంది. నాలుగు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఉంటుంది. మొత్తం మీద మంచి పనితీరును అందిస్తుంది.
టీవీఎస్ ఐక్యూబ్
ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటరుకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దేశీయ విఫణిలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఇది ఒకటి కావడం గమనార్హం. దీని ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 3.5 కిలోవాట్ బ్యాటరీ 145 కిమీ దూరం ప్రయాణించడానికి సహకరిస్తుంది. దీని గరిష్ట వేగం 78 కిమీ. అండర్ సీట్ స్టోరేజ్, కనెక్టెడ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. నగర ప్రయాణానికి అనుకూలంగా ఉండే ఈ స్కూటర్.. నమ్మికైన రైడింగ్ అనుభూతిని ఇస్తుంది.
బజాజ్ చేతక్ 3501
రూ. 1.22 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ బజాజ్ చేతక్ 3501 ఎలక్ట్రిక్ స్కూటర్.. 3.5 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 153 కిమీ పరిధిని అందిస్తుంది. మెటల్ బాడీ కలిగి ఉండటం వల్ల.. ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 73 కిమీ కాగా.. బ్యాటరీ ప్యాక్ ఐపీ67 రేటింగ్ పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. పనితీరు పరంగా ఇది ఉత్తమంగా ఉంటుంది.