Top Five Highlights Of Volkswagen Tiguan R Line in India: ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ కారును కంపెనీ ఆర్-లైన్ అనే కొత్త కారుగా లాంచ్ చేసింది. సంస్థ లాంచ్ చేసిన ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ (Volkswagen Tiguan R-Line) కారును కొనుగోలు చేయాలనుకునే వారు.. తప్పకుండా ఐదు విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఈ కథనంలో చూసేద్దాం..
ధర, బుకింగ్స్ మరియు డెలివరీ
దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ కారు ధర రూ. 49 లక్షలు (ఎక్స్ షోరూమ్). 2023లో గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసిన ఈ కొత్త కారు ఇప్పటికి.. భారతీయ తీరాలను తాకింది. ఈ కారు CBU (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా భారతదేశంలోకి దిగుమతి అవుతుంది. ఈ కారణంగానే దీని ధర కొంత ఎక్కువగా ఉంది. రూ. 25000 టోకెన్ మొత్తంతో కంపెనీ ఈ కార్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2025 ఏప్రిల్ 23 నుంచి మొదలవుతాయని సమాచారం.
డిజైన్ & కలర్ ఆప్షన్స్
కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ కారు మొత్తం ఆరు రంగులలో లభిస్తుంది. అవి పెర్సిమోన్ రెడ్, నైట్ షేడ్ బ్లూ, గ్రెనడిల్లా బ్లాక్, ఒనిక్స్ వైట్ మదర్ ఆఫ్ పెర్ల్, సిప్రెస్సినో గ్రీన్ మరియు ఓయిస్టర్ సిల్వర్ కలర్స్. ఈ కారు మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుండటం వల్ల.. వాహన ప్రేమికులు లేదా కొనుగోలుదారులు తమకు కలర్ కారును ఎంచుకోవచ్చు.
2025 టిగువాన్ ఆర్-లైన్ మార్కెట్లో లాంచ్ అయిందని తెలిసిన తరువాత కొనుగోలుదారుడు సెర్చ్ చేసే విషయాలలో ఒకటి డిజైన్ అప్డేట్ ఏమైనా ఉందా? అని. అయితే ఈ లేటెస్ట్ మోడల్ సొగసైన డిజైన్ పొందుతుంది. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, క్లోజ్డ్ గ్రిల్, బంపర్ మీద ఎయిర్ డ్యామ్ మరియు షార్ప్ అల్లాయ్ వీల్స్ వంటివి మాత్రమే కాకుండా.. కనెక్టెడ్ టెయిల్ లాంప్ కూడా ఉన్నాయి.
ఫీచర్స్
కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ కారు యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో 15.1 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా.. 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీజోనే క్లైమేట్ కంట్రోల్, హీటింగ్ అండ్ మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన పవర్ ఫ్రంట్ సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, పార్క్ అసిస్ట్ వంటివివన్నీ కూడా ఈ లేటెస్ట్ కారులో ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో పటిష్టంగా ఉన్నాయి. 9 ఎయిర్‌బ్యాగ్‌లు, 25 సేఫ్టీ ఫంక్షన్‌లతో కూడిన లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS), అడాప్టివ్ డంపర్‌లతో కూడిన డైనమిక్ చాసిస్ కంట్రోల్ కూడా ఉంది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.
ఇంజిన్ డీటెయిల్స్
కారు ఏదైనా.. తప్పకుండా ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఇంజిన్ డీటైల్స్. ఇందులో 2.0 లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి.. 201 Bhp పవర్ మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 12.58 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
Also Read: రూ. 59900లకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు
ప్రత్యర్థులు
కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ కారు.. ధర పరంగా ఆడి క్యూ3, బీఎండబ్ల్యూ ఎక్స్1 మరియు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. వీటితో పాటు ఈ వారం చివరలో మార్కెట్లో లాంచ్ కానున్న స్కోడా కొడియాక్ కారుకు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. దీన్నిబట్టి చూస్తే.. టిగువాన్ ఆర్-లైన్ అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది.