ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపాచీ ఆర్‌టీఎక్స్ 300 బైకును దేశీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్.. ఇప్పటి వరకు ఉన్న ఇతర బైకుల కంటే కూడా ఇది కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు. ఈ సరికొత్త బైక్ గురించి పూర్తి వివరాలు.. ఇక్కడ తెలుసుకుందాం.
ఈ బైక్ రేటు ఎంతంటే?
టీవీఎస్ లాంచ్ చేసిన కొత్త అపాచీ ఆర్‌టీఎక్స్ 300 ప్రారంభ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనిని కంపెనీ అడ్వెంచర్ టూరర్ విభాగంలో లాంచ్ చేసింది. అయితే ఇది కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడి.. కేటీఎమ్ 250 అడ్వెంచర్, యెజ్డీ అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
ఇంజిన్ వివరాలు ఇవే
2025 అపాచీ ఆర్‌టీఎక్స్ 300 బైక్.. 299 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 9000 ఆర్పీఎమ్ వద్ద 35.5 హార్స్ పవర్, 7000 ఆర్పీఎమ్ వద్ద 28.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా పొందుతుంది. కాగా స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ కూడా ఇందులో ఉంటుంది. ఇవన్నీ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుందని స్పష్టమవుతోంది.
కొత్త డిజైన్ ఇలా..
సరికొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300 బైక్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అండ్ అల్యూమినియం డైకాస్ట్ స్వింగార్మ్‌పై ఆధారపడి ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ పరిమాణంలో కొంత పెద్దదిగా ఉండటం చూడవచ్చు. సైడ్ ఫెండర్‌లు.. విండ్‌స్క్రీన్ వరకు విస్తరించి అనుసంధానించబడి ఉండటం చూడవచ్చు. బైక్ ముందు భాగంలో కన్ను ఆకారంలో ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ కనిపిస్తాయి. ఇషీ స్ప్లిట్ రియర్ సీటును పొందటమే కాకుండా అదనపు లగేజ్ కోసం లగేజ్ ర్యాక్ కూడా పొందుతుంది.
కలర్ ఆప్షన్స్ & ఫీచర్లు
వైపర్ గ్రీన్, టార్న్ బ్రాంజ్, మెటాలిక్ బ్లూ, లైట్నింగ్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే ఐదు రంగులలో లభించే ఈ బైక్.. ఫుల్లీ కలర్ టీఎఫ్‌టీ డిస్ప్లే కలిగి స్పీడ్, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్, సెగ్మెంట్ ఫస్ట్ మ్యాప్ మిర్రరింగ్, గోప్రో కంట్రోల్ వంటి వివరాలను చూపిస్తుంది. ఈ బైక్ టూర్, ర్యాలీ, అర్బన్, రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి.
టీవీఎస్ కొత్త అడ్వెంచర్ బైక్ లాంచ్‌పై మా అభిప్రాయం
నిజానికి టీవీఎస్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులు లాంచ్ చేస్తూనే ఉంది. దేశం మొత్తం మీద ఎక్కువమంది టీవీఎస్ బైకులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు లాంచ్ చేసిన టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300 ఇప్పుడున్న బ్రాండ్ బైకుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంది. ఇది తప్పకుండా బైక్ కొనుగోలుదారులను లేదా అడ్వెంచర్ చేయడానికి ఇష్టపడే వారిని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాము. అయితే ఇది మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవాలంటే.. ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే.