TVS Radeon Base Edition All Black Colour Option Launched: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) తన ‘రేడియన్’ కమ్యూటర్ బైక్ యొక్క ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను సరికొత్త కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. ఈ బైక్ ఇప్పుడు మొత్తం ఐదు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ బైక్ డిజైన్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా? ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇంజిన్ వివరాలు ఏంటి? అనే మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.
టీవీఎస్ రేడియన్ ఇప్పుడు మొత్తం నలుపు రంగులో అందుబాటులో ఉంది. ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న రేడియన్ రంగుల కంటే కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు. ఈ బైక్ ధర రూ. 59880 (ఎక్స్ షోరూమ్) కావడం గమనార్హం.
ఈ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తోంది. అవి బేస్ వేరియంట్ (రూ. 59880), డిజి డిస్క్ (రూ. 81394) మరియు డిజి డ్రమ్ (రూ. 84869). బైక్ మొత్తం నలుపు రంగులో ఉన్నప్పటికీ.. బ్యాడ్జింగ్ తెలుపు రంగులో ఉంది. ఇంజిన్ కేసింగ్ బ్రాంజ్ కలర్‌లో ఉండటం చూడవచ్చు.
డిజైన్ మరియు ఫీచర్స్
బ్లాక్ కలర్ టీవీఎస్ రేడియన్ బైక్ మార్కెట్లో హీరో స్ప్లెండర్ బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది పొడవైన సింగిల్ పీస్ సీటు, క్రోమ్ బెజెల్ హెడ్‌ల్యాంప్, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్, రివర్స్ ఎల్‌సీడీ క్లస్టర్, సెల్ఫ్ స్టార్ట్, పిలియన్ గ్రాబ్ రైల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటివి పొందుతుంది.
పరిమాణం పరంగా ఈ బైకులో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ బైక్ ఎత్తు 1080 మిమీ, వీల్‌బేస్ 1265 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ వరకు ఉంది. అయితే రేడియన్ బ్లాక్ కలర్ డ్రమ్ వేరియంట్ బరువు 113 కేజీలు, డిస్క్ వేరియంట్ బరువు 115 కేజీల వరకు ఉంటుంది.
ఇంజిన్ వివరాలు
టీవీఎస్ రేడియన్ కొత్త రంగులో అందుబాటులో ఉన్నప్పటికీ.. అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7350 rpm వద్ద 8.08 Bhp పవర్ మరియు 4500 rpm వద్ద 8.7 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. 10 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ ఒక లీటరుకు 69.3 కిమీ మైలేజ్ అందిస్తుంది.
సింగిల్ క్రెడిల్ ట్యూబులర్ ఫ్రేమ్ కలిగిన టీవీఎస్ రేడియం టెలిస్కోపిక్ పోర్క్, ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్ వంటివి పొందుతుంది. రేడియన్ బేస్ ఎడిషన్ మరియు డిజి డ్రమ్ వేరియంట్ 130 మిమీ డ్రమ్ బ్రేక్ (ముందు భాగంలో), వెనుకవైపు 110 మిమీ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. అయితే టాప్ ఎండ్ మోడల్ డిజి డిస్క్ వెర్షన్ యొక్క ముందువైపు 240 మిమీ డిస్క్, వెనుకవైపు 110 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇవి సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ పొందుతాయి. ఈ బైక్ 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి. కాబట్టి మొత్తం మీద ఇది ఉత్తమ పనితీరును అందిస్తాయని తెలుస్తోంది.
Don’t Miss: హీరో ‘అజిత్ కుమార్’ రేసింగ్ టీమ్.. అంతర్జాతీయ పోటీలకు సిద్ధం! – ఫోటోలు చూడండి
రేడియన్ కొత్త కలర్ ఆప్షన్ పొందటానికి కారణం
టీవీఎస్ మోటార్ తన రేడియన్ బైకును కొత్త రంగులో ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం వాహన ప్రేమికులను ఆకర్శించడం కోసమే. నిజానికి చాలామంది వాహన ప్రియులు కొత్త బైకులను కొనాలనుకుంటారు లేదా అప్డేటెడ్ బైకులను కొనాలనుకుంటారు. కొత్త రంగులో లభించే బైకులను కొనుగోలు చేయడానికి కూడా పలువురు ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ కంపెనీ తన రేడియన్ బైకును కొత్త రంగులో ప్రవేశపెట్టింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ బైక్ దేశీయ మార్కెట్లో దాని విభాగంలో అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉండనుంది.