సరికొత్త ఆల్ట్రావయొలెట్ బైక్: సూపర్ టెక్నాలజీ & అంతకు మించిన ఫీచర్స్

బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ ఆల్ట్రావయొలెట్ ఆటోమోటివ్.. దేశీయ విఫణిలో సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు ‘ఎక్స్-47 క్రాస్ఓవర్‘. దీని ప్రారంభ ధర రూ. 2.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఇంటిగ్రేటెడ్ రాడార్. కెమెరా సేఫ్టీ సిస్టం వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

బుకింగ్స్ & డెలివరీ

ఆల్ట్రావయొలెట్ లాంచ్ చేసిన ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ. 999 చెల్లించి అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. భారతదేశంలో డెలివరీలు అక్టోబర్ 2025లో ప్రారంభమవుతాయి. గ్లోబల్ మార్కెట్లో డెలివరీలు 2026లో జరిగే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ప్రారంభ ధర అనేది మొదటి 1000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఎంత పెరుగుతుంది అనే విషయం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

డిజైన్ అండ్ ఫీచర్స్

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన సరికొత్త ఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్.. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్ యొక్క అన్ని బైకులకంటే భిన్నంగా ఉంది. కాబట్టి చూడగానే ఇది కొత్తదిగా అనిపిస్తుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ 5 ఇంచెస్ టీఎఫ్‌టీ కన్సోల్ పొందుతుంది. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, టైప్ సీ పోర్ట్స్, గ్రాబ్ హ్యాండిల్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, డైనమిక్ రీజెనరేటివ్ బ్రేకింగ్, క్రాష్ అలర్ట్స్, టోయింగ్ నోటిఫికేషన్స్, మూవ్‌మెంట్ డిటెక్షన్, రిమోట్ లాక్‌డౌన్ అందించే ఆల్ట్రావయొలెట్ యొక్క యాజమాన్య వైలెట్ ఏఐ కనెక్ట్ చేయబడిన సూట్ వంటివి ఉన్నాయి.

గ్లైడ్, కంబాట్, బాలిస్టిక్ వంటి మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఈ బైక్ రేడియల్ ఆల్ టెర్రైన్ టైర్స్ పొందుతుంది. అంతే కాకుండా 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు కమాండింగ్ రైడింగ్ పొజిషన్ కోసం ఫైటర్ జెట్ ప్రేరేపిత ఎర్గోనామిక్స్ వంటివి కూడా బైకులో ఉన్నాయి.

బ్యాటరీ వివరాలు

ఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్.. 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 40.2 బీహెచ్‌పీ పవర్, 610 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ 2.7 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 145 కిమీ కావడం గమనార్హం. ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జితో 323 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.

ఇతర వివరాలు

కొత్త ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ 41 మిమీ యూఎస్డీ ఫోర్క్స్, మోనోషాక్ పొందుతుంది. ఈ రెండూ కూడా ఫ్రీలోడ్ అడ్జస్టబుల్. బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే.. ముందు భాగంలో ఫోర్ పిస్టన్ కాలిపర్‌తో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, 230 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, మూడు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ కూడా ఉన్నాయి.

టెక్నాలజీ

ఇప్పటివరకు కార్లలో మాత్రమే ఏడీఏఎస్ ఫీచర్ ఉండేవి. కానీ మొదటిసారి ఆల్ట్రావయొలెట్.. తన ఎక్స్-47 క్రాస్ఓవర్ బైకులో అందించింది. కాబట్టి ఈ బైకులో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ చేంజ్ అసిస్ట్, ఓవర్‌టేక్ అలర్ట్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ బైకులో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.