భారతప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం (సెప్టెంబర్ 17) సందర్భంగా.. దేశంలోని పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, సినీతారలు మాత్రమే కాకుండా, ఇతర దేశాల అధ్యక్షులు సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే డైరెక్టర్ సీహెచ్ క్రాంతి కుమార్ మాత్రం ‘మా వందే‘ మోదీ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మోదీ బయోపిక్ మా వందే
నరేంద్ర మోదీ బయోపిక్ మా వందే సినిమా కోసం దక్షిణాది టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. మలయాళీ హీరో ఉన్ని ముకుందన్ నరేంద్ర మోదీ క్యారెక్టర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే కాకుండా.. దేశంలోని ఇతర ప్రముఖ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పుడు విడుదలైన పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు వీర్ రెడ్డి ప్రొడ్యూసర్. కేజీఎఫ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన రవి బస్రూత్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.కాగా దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు పనిచేసిన సెంథిల్ కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేయనున్నారు.
తల్లి సంకల్పం గొప్పది
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. ఇందులో ఉన్ని ముకుందన్ ఇన్ మా వందే అని ఉండటం మాత్రమే కాకుండా.. ఎన్ని పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పది అనే వాక్యం ఉండటం, దాని కింద నరేంద్ర మోదీ అని ఉండటం చూడవచ్చు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే ఇప్పటికే 2019లోనే ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరుతో ఒక బయోపిక్ రిలీజ్ అయింది. ఇప్పుడు రెండో సినిమా రిలీజ్ కావడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
నరేంద్ర మోదీ గురించి
రాజకీయ అంశాలు ఎలా ఉన్నా.. భారతదేశ అభివృద్ధికి పాటుపడుతున్న మహామనిషి ‘నరేంద్ర మోదీ’ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోంది.
1950 సెప్టెంబర్ 17న దామోదర్దాస్ ముల్చంద్ మోదీ, హీరాబెన్ మోదీ దంపతులకు జన్మించిన ఆరుగురు పిల్లల్లో నరేంద్ర దామోదర్దాస్ మోదీ.. మూడో వ్యక్తి. వీరిది గుజరాతీ కుటుంబం. ఈయన చిన్నప్పుడు టీ స్టాల్లో కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ.. ఆ తరువాత 2014 నుంచి భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో భారతదేశానికి ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా ఉన్న ఘనత కూడా ఈయన సొంతం చేసుకున్నారు.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత.. ఇప్పటివరకు 78 దేశాలు సందర్శించారు. దేశం ప్రతిభను చాటిచెబుతూనే.. ఇతర దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకున్న ఘనత కూడా నరేంద్ర మోదీ సొంతం కావడం గమనార్హం. ఈ మధ్యకాలంలో అమెరికా భారీ సుంకాలను విధించిన తరువాత చైనాలో కూడా పర్యటించి.. అమెరికా ఆంక్షలను కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు మళ్లీ అమెరికా.. మనదేశంతో సత్సంబందాలను ఏర్పరచుకోవడానికి సన్నద్ధమవుతోంది.