కొత్త కొత్తగా వచ్చేస్తున్నవి.. లాంచ్‍కు సిద్దమవుతున్న కార్లు ఇవే!

Upcoming Cars in India By Diwali: పండుగ సీజన్ వచ్చేస్తోంది.. కొత్త వాహనాలను లాంచ్ చేయడానికి కంపెనీలు కూడా సర్వత్రా సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ మాత్రమే కాకుండా.. హ్యుందాయ్ మోటార్స్, కియా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి కంపెనీలు ఉన్నాయి. వచ్చే దీపావళి లోపల భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కార్లు ఏవి? వాటి వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం..

టాటా నెక్సాన్ సీఎన్‌జీ (Tata Nexon CNG)

వాహన విభాగంలో అగ్రగామిగా.. ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ రంగంలో కూడా నేను సైతం అంటూ దూసుకెళ్తున్న టాటా నెక్సాన్ త్వరలో సీఎన్‌జీ రూపంలో కూడా లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు కనిపించిన ఈ కారు దీపావళి లోపల మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. చూడటానికి దాని మునుపటి మోడల్స్ డిజైన్ కలిగిన ఈ కారు డ్యూయెల్ సిలిండర్ సీఎన్‌జీ కిట్ పొందుతుంది. ఇది ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. దీని ధర పెట్రోల్ మోడల్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉండొచ్చని సమాచారం. అయితే ఇది పెట్రోల్ మోడల్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

టాటా కర్వ్ (Tata Curvv)

ఇటీవల ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అయిన టాటా కర్వ్.. పెట్రోల్ మరియు డీజిల్ కార్లను కూడా విడుదల చేయనుంది. కంపెనీ ఇప్పటికే ఈ కార్లను ఆవిష్కరించినప్పటికీ.. ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే సంస్థ టాటా కర్వ్ పెట్రోల్ మరియు డీజిల్ కార్ల ధరలను సెప్టెంబర్ 2న ప్రకటించే అవకాసం ఉంది. ఈ కొత్త కారు ధరలు రూ.10 లక్షల నుంచి రూ. 22 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

టాటా కర్వ్ మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందనున్నట్లు సమాచారం. ఇందులో రెండు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్, ఒకటి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇవన్నీ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్ ఆప్షన్స్ పొందుతాయి. కాగా కంపెనీ ఈ కారును CNG రూపంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ (Hyundai Alcazar Facelift)

ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ అల్కాజార్ త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ కారు ధరలను సెప్టెంబర్ 5న ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఫేస్‌లిఫ్ట్ కోడం సంస్థ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.

హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ క్రెటాలోని కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ పొందనున్నట్లు సమాచారం. ఈ కారు హెచ్ షేప్ డీఆర్ఎల్స్, హెచ్ షేప్ టెయిల్ లైట్స్ మరియు లైట్ బార్.. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా పొందుతుంది. ఇందులో ఆధునిక ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఉండనున్నట్లు సమాచారం. ఈ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది.

ఎంజీ విండ్సర్ (MG Windsor)

దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఎంజీ మోటార్స్ త్వరలో విండ్సర్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. కంపెనీ ఈ కారును సెప్టెంబర్ 11న ఆవిష్కరించనున్నట్లు సమాచారం. సుమారు 4.3 మీటర్స్ పొడవున్న ఈ కారు పెద్ద గ్లాస్‌హౌస్ పొందనుంది. ఇప్పటికి టెస్టింగ్ దశలో పలుమార్లు కనిపించిన ఈ కారు లేటెస్ట్ డిజైన్ పొందుతుందని తెలుస్తోంది.

ఎంజీ విండ్సర్ కారు ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ కలిగిన మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్ పొందుతుందని తెలుస్తోంది. ఈ మోడల్ 37.9 కిలోవాట్ మరియు 50.6 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇవి వరుసగా 360 కిమీ మరియు 460 కిమీ మైలేజ్ అందిస్తాయి. దీని ప్రారంభ ధర రూ. 20 లక్షల వరకు ఉండొచ్చు. ఇది టాటా నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది.

కియా కార్నివాల్ (Kia Carnival)

2023 ఇండియా ఆటో ఎక్స్‌పోలో కనిపించిన నాల్గవ తరం కియా కార్నివాల్ గత ఏడాది చివర్లో ప్రపంచ మార్కెట్లో ప్రవేశించింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా పెద్దదిగా ఉంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే ఈ కారు అద్భుతమైన ఇంటీరియర్ కూడా పొందుతుంది. ఈ కారు 7 సీటర్, 9 సీటర్ మరియు 11 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. అయితే భారతదేశంలో ఈ మూడు కాన్ఫిగరేషన్స్ అందుబాటులోకి వస్తాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 50 లక్షలు ఉంటుందని సమాచారం.

ఆడి క్యూ6 ఈ-ట్రాన్ (Audi Q6 E-Tron)

ఎలక్ట్రిక్ విభాగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్న ఆడి.. త్వరలోనే క్యూ6 ఈ-ట్రాన్ పేరుతో మరో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. సుమారు 4.7 మీటర్ల పొడవున్న ఈ కారు ధర రూ. 85 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రీమియం ప్లాట్‌ఫామ్ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడి ఉంటుంది. రాబోయే దీపావళి నాటికి మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం.

మెర్సిడెస్ ఈ-క్లాస్ (Mercedes E-Class)

దీపావళి లోపల మార్కెట్లో అడుగుపెట్టే కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ యొక్క ఈ క్లాస్ కూడా ఉంది. ఇది ఆరవ తరం లాంగ్ వీల్‌బేస్ ఈ-క్లాస్. దీని ధర రూ. 85 లక్షల వరకు ఉండొచ్చు. కంపెనీ ఈ కారును చకన్ ప్లాంట్‌లో తయారు చేసే అవకాశం ఉంది. బుకింగ్స్ వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారు పెట్రోల్ మరియు డీజిన్ ఇంజిన్ ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది.

కియా ఈవీ9 (Kia EV9)

కొత్త కార్లకు ఆదరణ భారీగా పెరుగుతున్న తరుణంలో కియా ఇండియా గొప్ప సన్నాహాలే సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే అప్డేటెడ్ కియా కార్నివాల్ మాత్రమే కాకుండా ఈవీ9 పేరుతో కూడా కారును లాంచ్ చేయనుంది. ఈ కారు మార్కెట్లో లాంచ్ అయిన తరువాత బీఎండబ్ల్యూ ఐఎక్స్, మెర్సిడెస్ ఈక్యూఈ మరియు ఆడి క్యూ8 ఈ-ట్రాన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. అత్యద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు.. ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది.

Don’t Miss: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఎలక్ట్రిక్ కారు ఇదే!.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ (Mercedes Maybach EQS)

బెంజ్ కంపెనీ మేబ్యాచ్ ఈక్యూఎస్ పేరుతో కూడా ఓ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని సెప్టెంబర్ 5న లాంచ్ చేసే అవకాశం ఉంది. డ్యూయెల్ మోటార్ సెటప్ కలిగిన ఈ కారు 108.4 కిలోవాట్ బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది సింగిల్ చార్జితో 600 కిమీ రేంజ్ అందిస్తుంది. అంతే కాకుండా 210 కిమీ గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ కారు 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 4 కోట్లు వరకు ఉండొచ్చని అంచనా.