వచ్చేస్తున్నాయ్.. కొత్త కార్లు: లాంచ్ ఎప్పుడంటే?

భారతదేశ ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. చైనా, జపాన్, అమెరికా దేశాలకు దీటుగా.. సరికొత్త ఉత్పత్తులు ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టుతున్నాయి. ఇందులో దేశీయ మోడల్స్ మాత్రమే కాకుండా.. విదేశీ బ్రాండ్ కూడా ఉన్నాయి. ఈ కథనంలో భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న కొత్త కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.

టాటా సియెర్రా

దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. సియెర్రా పేరుతో ఓ మిడ్‌సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఈ ఎస్‌యూవీని ఈ ఏడాది చివరి నాటికి దేశీయ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కారు ఎలక్ట్రిక్ మరియు ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వేరియంట్లుగా అందుబాటులో ఉండనుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ బహుశా 2025 దీపావళికి లాంచ్ అవుతుందని సమాచారం.

మారుతి సుజుకి ఈ విటారా

ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా ఈ విటారా పేరుతో.. మొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. 2025 భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ కారు e HEARTECH అనే ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుంది. ఇది 49 కిలోవాట్, 61 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ఎంపికలతో మార్కెట్లో విడుదల కానుంది. ఈ కారు గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లలో తయారవుతుంది. ఇక్కడ నుంచే ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. ఇది ఎంజీ విండ్సర్, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ వంటి వాటికీ ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది.

మారుతి సుజుకి ఎస్కుడో

పేరు కొంత కొత్తగా ఉన్నప్పటికీ.. మారుతి సుజుకి ఈ పేరుతోనే 5 సీటర్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీని 2025 సెప్టెంబర్ 03న లాంచ్ చేయనుంది. ఈ కారు మారుతి సుజుకి అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతుంది. ఇది పెట్రోల్ మరియు సీఎన్‌జీ రూపాల్లో మార్కెట్లో అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఎస్కుడో కారు ఇండియన్ మార్కెట్లో.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండనుంది.

రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్

దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన రెనాల్ట్ కిగర్.. ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇది 2025 ఆగస్టు 24న లాంచ్ అవుతుందని సమాచారం. ఇది కొత్త లోగోతో కూడిన ఫ్రంట్ గ్రిల్, అప్డేటెడ్ బంపర్లు, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఇందులో 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి.

విన్‌ఫాస్ట్ వీఎఫ్6 మరియు వీఎఫ్7

వియాత్నం దేశానికి చెందిన విన్‌ఫాస్ట్ ఈ నెలలోనే వీఎఫ్6 మరియు వీఎఫ్ 7 పేరుతో రెండు కార్లను లాంచ్ చేయనుంది. వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు 59.6 కిలోవాట్ బ్యాటరీ పొందనుంది. ఇది 399 కిమీ (ఎకో మోడ్) రేంజ్ అందిస్తుందని సమాచారం. అయితే రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గుతుంది. ఈ కారు 8.99 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.

వీఎఫ్7 విషయానికి వస్తే.. ఇది 75.3 కిలోవాట్ బ్యాటరీతో 450 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఇది కూడా ఎకో, ప్లస్ అనే రెండు ట్రిమ్‌లలో అమ్మకానికి రానుంది. ఈ రెండూ కూడా మంచి పనితీరును అందిస్తాయని సమాచారం. ధర, బుకింగ్స్ మరియు డెలివరీ వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

2025 హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ కంపెనీ ఆగస్టు 24న కొత్తతరం వెన్యూ కారును లాంచ్ చేయనుంది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా.. అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందినట్లు సమాచారం. ప్రీమియం డిజైన్ కలిగి.. అప్డేటెడ్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ లైట్ బార్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డీ-కట్ స్టీరింగ్ వీల్ మొదలైనవి కొత్త వెన్యూలో చూడవచ్చు.

Leave a Comment