భారత్‌లో Ford కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త కార్లు ఇవే – చూసారా!

Upcoming Ford Cars For Indian Market 2024: భారత్ వదిలి వెళ్లిన అమెరికన్ బ్రాండ్ కంపెనీ ఫోర్డ్ (Ford) మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ దేశీయ మార్కెట్లో మూడు కొత్త కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇందులో 2024 ఫోర్డ్ ఎండీవర్ న్యూ జనరేషన్, మస్టాంగ్ మాక్ ఎలక్ట్రిక్ మరియు కాంపాక్ట్ SUV ఉన్నాయి.

2024 ఫోర్డ్ ఎండీవర్ న్యూ జనరేషన్ (Ford Endeavour New Generation)

ఫోర్డ్ కంపెనీ భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనున్న కొత్త కార్లలో ఒకటి 2024 న్యూ జనరేషన్ ఎండీవర్. ఇప్పటికే సంస్థ ఈ మోడల్ కోసం పేటెంట్‌ను దాఖలు చేసింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ SUV మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ కొత్త SUV అప్డేటెడ్ డిజైన్ కలిగి సీ షేప్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, పెద్ద గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్ వంటి వాటిని పొందుతుంది.

సైడ్ ప్రొఫైల్‌లో పెద్ద అల్లాయ్ వీల్స్ మరియు క్రోమ్ యాక్సెంట్‌ల సెట్‌ను పొందుతుంది. వెనుకవైపు ఇది సరికొత్త ఎల్ఈడీ టైల్‌లైట్‌ల సెట్‌ను పొందుతుంది. మొత్తం మీద ఈ కారు డిజైన్ చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుందని ఇప్పుడే అర్థమవుతోంది. ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌లో 12 ఇంచెస్ వర్టికల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. అంతే కాకుండా కొత్త స్టీరింగ్ వీల్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ గేజ్ క్లస్టర్‌ను కూడా ఉంటాయి.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇది అదే పాత సింగిల్ టర్బో ఇంజన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఇంజిన్ 170 bhp పవర్ మరియు 420 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ SUV మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఎంజి గ్లోస్టర్ మరియు స్కోడా కొడియాక్‌ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఫోర్డ్ మస్టాంగ్ మాక్ ఎలక్ట్రిక్ (Ford Mustang Mach-E)

కంపెనీ లాంచ్ చేయనున్న రెండో మోడల్ ఫోర్డ్ మస్టాంగ్ మాక్ ఎలక్ట్రిక్. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికి మంచి అమ్మకాలు పొందుతున్న ఈ ఎలక్ట్రిక్ SVU త్వరలోనే భారతీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ SUV ఎల్ఈడీ హెడ్‌లైట్లు మరియు క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్‌తో సొగసైన ఫ్రంట్ ఎండ్‌ను పొందుతుంది. ఇది 18 నుంచి 20 ఇంచెస్ పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్‌ను కూడా పొందుతుంది. వెనుక భాగంలో మస్టాంగ్ స్పోర్ట్స్ కారు మాదిరిగానే ఎల్ఈడీ టైల్‌లైట్‌లను పొందుతుంది.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. మస్టాంగ్ మాక్ ఎలక్ట్రిక్ కారు విభిన్న ఎంపికలతో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. రియర్ వీల్ డ్రైవ్ మోడల్‌లు 265 నుంచి 288 bhp పవర్ డెలివరీ చేస్తాయి. ఆల్ వీల్ డ్రైవ్ మోడ్స్ 344 నుంచి 470 bhp పవర్ అందిస్తాయి. రేంజ్ మరియు బ్యాటరీ వంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ కారు ధర కోటి రూపాయల వరకు ఉంటుందని సమాచారం.

ఫోర్డ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ (Ford Compact SUV)

ఇక చివరగా ఫోర్డ్ కంపెనీ దేశీయ మార్కెట్లో లాంచ్ చేయనున్న కారు కాంపాక్ట్ ఎస్‌యూవీ అని తెలుస్తోంది. భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న తరుణంలో ఫోర్డ్ కంపెనీ ఆ విభాగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి మరియు ఇండియన్ మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. కంపెనీ ఈ SUV డిజైన్ కోసం పేటెంట్ దాఖలు చేసినట్లు ఇటీవల తెలిసింది. రానున్న రోజుల్లో కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు గురించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయి.

Don’t Miss: BYD Seal EV: భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ – సింగిల్ చార్జితో 650 కిమీ రేంజ్..

ఫోర్డ్ కంపెనీ

అమెరికన్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ (Ford) కప్పుడు భారతీయ మార్కెట్లో తిరుగులేని ప్రఖ్యాతి పొందినప్పటికీ.. కాలక్రమంలో కొత్తగా మార్కెట్లో అడుగుపెట్టిన ప్రత్యర్ధ కంపెనీల ఉత్పత్తుల వల్ల క్రమంగా క్షిణించింది. కొత్త వాహనాలను ప్రవేశపెట్టడంతో విఫలం అవ్వడం మరియు ప్రత్యర్థులు సరైన పోటీ ఇవ్వకపోవడం కారణంగా కంపెనీ దేశీయ విఫణిలో మనుగడ సాగించలేకపోయింది. దీంతో కంపెనీ దేశాన్ని వదిలిపెట్టింది. అయితే మళ్ళీ కొత్త ఉత్పత్తుల విడుదలతో (లాంచ్) ఇండియన్ మార్కెట్లో మళ్ళీ పూర్వ వైభవం పొందటానికి సన్నద్ధమవుతోంది.