ప్రేమ.. ఇది కేవలం రెండక్షరాల పదమే కావచ్చు. కానీ.. ఎప్పుడు, ఎవరికి, ఎలా పుడుతుందో చెప్పలేము. చెప్పడం మేధావులకు సైతం సాధ్యం కాదు. ఎల్లలు దాటిన ప్రేమ కథలు విన్నాం.. చరిత్రలో నిలిచిపోయిన ప్రేమికుల గురించి కూడా విన్నాం. చాలామంది ప్రేమ, ప్రేమ అంటూ.. ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ ప్రేమికుల రోజు ఎలా మొదలైంది?, ఎక్కడ మొదలైందనే విషయం చాలామంది ప్రేమికులకు కూడా తెలియదు. ఈ కథనంలో ఆ విషయాలను తెలుసుకుందాం.
ఆయన జ్ఞాపకార్థంగానే.. వాలెంటైన్స్ డే
ప్రేమికుల రోజు అని ప్రత్యేకంగా చెప్పడమే కానీ.. ప్రేమించేవారికి, ప్రేమలో ఉన్నవారికి ప్రతిరోజూ ప్రేమికుల రోజే. చరిత్రలోకి వెళ్తే.. ప్రేమికుల రోజు ప్రాచీన రోమన్ సామ్రాజ్య కాలానికి చెందింది. అప్పటి రోమన్ చక్రవర్తి క్లాడియస్ II సైనికులు పెళ్లి చేసుకుంటే.. బాధ్యతలు పెరుగుతాయని, యుద్ధంలో ధైర్యంగా పోరాడలేరు అని భావించి.. యువకులకు వివాహాలే నిషేదించారు. అయితే ఆ సమయంలోనే సెయింట్ వాలెంటైన్ (రోమన్ క్యాథలిక్ పూజారి – ఫాదర్).. ప్రేమికులకు రహస్యంగా వివాహాలు జరిపించడం మొదలుపెట్టారు. ఇది తెలుసుకున్న క్లాడియస్ II.. ఆయనను 270 ఏడీ ఫిబ్రవరి 14న ఉరి తీయించారు. ఆయన జ్ఞాపకంగానే ప్రతి ఏటా ఫిబ్రవరి 14న వాలైంటైన్స్ డే జరుపుకోవడం మొదలైంది.
ఆ తరువాత కాలంలో ప్రేమికుల రోజును ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ప్రేమికుల రోజు అనేది కేవలం ప్రేమికులకే కాకుండా.. జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల పట్ల ప్రేమ, గౌరవం, కృతజ్ఞత తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైన సందర్భం.
ప్రేమను వర్ణించడానికి భాష సరిపోదు, భావాలు సరిపోవు. ప్రేమను అనుభవించిన వారికి మాత్రమే ప్రేమ అర్థమవుతుంది. చూసేవారికి లేదా చెప్పేవారికి ప్రేమ ఒక ట్రాష్ లేదా టైమ్ పాస్ అనుకోవచ్చు. నిజమైన ప్రేమ.. ఖండాంతరాలు దాటేస్తుంది. దీనికి ఉదాహరణ ప్రతి ఒక్కరికి, ఏదో ఒక సందర్భంలో తెలిసే ఉంటుంది.
చరిత్రలో నిలిచిన శాశ్వత ప్రేమ కథలు
ప్రేమకు అర్థం ఏమంటే.. నిన్ను నన్ను చూపిస్తా అని ఒక పాటలో వినే ఉంటారు. కానీ ప్రేమంటే.. ఈ రోజుకూ లైలా – మజ్ను, పారు – దేవదాస్, సలీం – అనార్కలి అనే చెబుతారు. అలాంటి ప్రేమికులు నభూతో న భవిష్యత్ అనే చెప్పాలి. బహుశా ఈ కాలంలో కూడా ఎక్కడో ఓ చోట ఉండే ఉండొచ్చు!
లైలా – మజ్ను
తెలుగు సినిమాల్లో కనిపించే లైలా – మజ్ను అనుకుంటే పొరపాటే. అరబ్ దేశాల్లో ప్రసిద్ధి చెందిన ప్రేమ కథ ఈ లైలా – మజ్ను స్టోరీ. నిజానికి మజ్ను పేరు ఖైస్. ఈయన లైలాపై అమితమైన ప్రేమ పెంచుకున్నప్పటికీ.. కుటుంబాల వ్యతిరేఖత, అప్పటి సమాజం పరిస్థితులు వీరి ప్రేమకు అడ్డుకట్ట వేసాయి. ప్రేమలో మునిగిపోయిన ఖైస్‌ను అందరూ మజ్ను అని పిలిచారు. మజ్ను అంటే పిచ్చివాడు అని అర్థం. ఈ కథనే 12వ శతాబ్దంలో ఒక కవి రచించారు. ఆ తరువాత ఇది అందరికీ తెలిసింది.
పారు – దేవదాస్
సినిమాల పుణ్యమా అని కొన్ని కథలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఈ పారు – దేవదాస్ ఒకటి. ప్రియురాలిని మర్చిపోలేక, ముందుకు బానిసై చివరికి తాను ప్రేమించిన యువతి ఇంటిముందు ప్రాణం వదిలిన ప్రేమ కథే ఇది. పార్వతి, దేవదాస్ చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. కుటుంబ గౌరవం, జాత్యహంకార కారణాల వల్ల.. పారు మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ముందుకు బానిసైన దేవదాస్.. చివరికి ప్రేయసి ఇంటి ముందరే కన్ను మూస్తారు.
సలీం – అనార్కలి
ఇది మొఘల్ కాలానికి చెందిన విషాదగాథ. యువరాజు సలీం, నర్తకి అయిన అనార్కలిని ప్రేమించాడు. అయితే ఈయన తండ్రి అక్బర్ వీరి ప్రేమను అంగీకరించలేదు. రాజవంశ గౌరవం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేసాడు. చివరికి సలీం కళ్ల ముందరే.. అనార్కలికి బతికుండగానే సమాధి కట్టాడు. ఇలా ఈ ప్రేమ కథ కూడా విషాదంగా మిగిలిపోయింది.
నిజానికి పైన చెప్పుకున్న సంఘటనలు గమనిస్తే.. ప్రేమకు జాతి, మతం, హెచ్చు తగ్గులు లేవని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ప్రేమించుకుంటే.. ప్రాణాలు వదిలేయలేమో అనే అనుమానం కూడా కలుగుతుంది.
ఒక్కటి మాత్రం నిజం.. ప్రేమించినప్పుడు ఉన్నంత ఆనందం.. కలిసి జీవించినప్పుడు ఉండకపోవచ్చు. కాబట్టి ప్రేమించే ముందు.. కలిసి జీవించే ముందు తప్పకుండా ఒకసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఆ ప్రయాణంలో ఇద్దరు మాత్రమే నడవాల్సి ఉంటుంది, ఏ ఒక్కరి అండా కనిపించదు. ఒక్కోసారి భరించలేని బాధలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ”ప్రేమంటే రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. ఎందోమంది మనుషుల దూరం” అనేది తప్పకుండా గుర్తుంచుకోవాలి.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.