వారసుడొచ్చాడు.. కొడుకు ఫోటో షేర్ చేసిన వరుణ్ తేజ్

నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తండ్రయ్యాడు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌లో.. లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా సెట్ నుంచే నేరుగా ఆసుపత్రికి వెళ్లి, ఈ మెగా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ తేజ్ తన కొడుకు ఫోటోను షేర్ చేస్తూ లిటిల్ మ్యాన్ అంటూ క్యాప్సన్ ఇచ్చారు. అటు వరుణ్ ఫ్యాన్స్, ఇటు లావణ్య ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

2023లో పెళ్లి

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలోని బొర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహనానికి మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ఆ తరువాత 2023 నవంబర్ 5న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా.. ఇతర సెలబ్రిటీలు, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

నిజానికి లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2017లో మిస్టర్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం స్నేహంతో మొదలై.. ప్రేమగా మారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత లావణ్య త్రిపాఠి దాదాపు సినిమాలకు దూరమైంది. కాగా ఈ ఏడాది మే నెలలో తాము తల్లిదండ్రులు అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడు ఈ జంట మగబిడ్డకు జన్మనిచ్చింది. వారసుని రాకతో మెగా ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. నాగబాబు తాతయ్య ప్రమోషన్ తీసుకున్నారు.

లావణ్య త్రిపాఠి

1991 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించిన లావణ్య త్రిపాఠి.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో పెరిగింది. తండ్రి హైకోర్టులో న్యాయవాది, కాగా అమ్మ ఉపాధ్యాయినిగా పనిచేశారు. లావణ్యకు ఒక చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. ఈమె (లావణ్య త్రిపాఠి) డెహ్రాడూన్‌లోని మార్షల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత.. ముంబై వెళ్లి, అక్కడ రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రం పూర్తి చేసింది. 2006లో చదువుకునే రోజుల్లోనే మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలుచుకుంది. ఆ సమయంలోనే భరతనాట్యం కూడా నేర్చుకుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈమె తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల చిత్రాల్లో కూడా నటించింది. పెళ్లి తరువాత లావణ్య సినిమాలకు దూరంగా ఉంది.

వరుణ్ తేజ్

మెగా వారసుడు.. నాగబాబు తనయుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. ఆ తరువాత తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలనటుడిగా సినిమాల్లో కనిపించినప్పటికీ.. ముకుంద సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా వంటి సినిమాల్లో నటించారు. వరుణ్ తేజ్ చివరి సినిమా మట్కా. కాగా ఈయన ప్రస్తుతం ‘వీటీ15’ కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం ప్రస్తుతానికి వెల్లడికాలేదు. బహుశా దీనిని త్వరలోనే విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.

Leave a Comment