విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న నిశ్చితార్థం విషయం కొంత సద్దుమణుగుతోంది. ఈ తరుణంలో నటుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమా రౌడీ జనార్దన్కు సంబంధించిన పూజా కార్యక్రమం ఈ రోజు (అక్టోబర్ 11) హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు?.. సినిమా రిలీజ్ వంటి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ, ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
రౌడీ జనార్దన్.. విజయ్ దేవరకొండ
నటుడు విజయ్ దేవరకొండ తదుపరి సినిమా రౌడీ జనార్దన్’కు రాజావారు రాణిగారు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రవికిరణ్ కోల దర్శకత్వం వహించనున్నారు. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 16 (అక్టోబర్ 16) నుంచే ముంబైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు జరిగిన ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమానికి.. అల్లు అరవింద్ ప్రత్యేక అతిథిగా హాజరై.. తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొదటిసారి కీర్తి సురేష్‌తో జంటగా
రౌడీ జనార్దన్ సినిమాలో హీరోయిన్‌గా మహానటి కీర్తి సురేష్ నటించనున్నారు. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా కనిపించనున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. దీంతో అటు దేవరకొండ ఫ్యాన్స్, ఇటు కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని చాలా అతృతతో ఎదురు చూస్తున్నారు. పేరుకు తగ్గట్టుగానే ఇది మంచి యాక్షన్ కథా చిత్రమని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ బడ్జెట్ కేటాయించనున్నట్లు సమాచారం. ఈ సినిమా 2026 చివరి నాటికి థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి.
హిట్ కొట్టేనా?
ఇటీవల రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమా ఊహించిన అంచనాలను అందుకోలేకపోయింది. గీత గోవిందం సినిమా తరువాత.. అంత పెద్ద హిట్ సాధించిన సినిమాలు విజయ్ దేవరకొండ ఖాతాలో పడలేదు. ఈ సారైనా రౌడీ జనార్దన్ సినిమాతో హిట్ కైవసం చేసుకుంటాడేమో వేచిచూడాలి. సినిమా టైటిల్, దర్శక & నిర్మాతలను బట్టి చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధిస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు.
విజయ్ దేవరకొండ గురించి
2011లో నువ్విలా సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన గీత గోవిందం మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు దాదాపు అంతంతమాత్రమే అనిపించాయి. సినిమా విషయం పక్కన పెడితే.. నటి రష్మిక మందన్నతో.. విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు తెరమీదకు వచ్చాయి. ఈ విషయాన్ని వారిరువురు అధికారికంగా ప్రకటించినప్పటికీ.. అసలు స్పందించనే లేదు. దీన్నిబట్టి చూస్తే వీరు నిశ్చితార్థం చేసుకున్నారనే విషయం నిజమే అని తెలుస్తోంది. కాగా వీరి పెళ్లి 2026 ఫిబ్రవరిలో ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.