ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెలలో.. మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కాపురం, పోలవరంతో పాటు మదనపల్లెను కూడా జిల్లాగా ప్రకటించారు. అయితే మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలనే.. ఆశయంతో ఎప్పటినుంచో బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ అంబేద్కర్ సేన, మాల మహానాడు, సీపీఐ, కాంగ్రెస్, ఇలా అన్నీ పార్టీలు, సంఘాలు కలిసి మదనపల్లి జిల్లా సాధన సమితి పేరుతో ఒక జేఏసీగా ఏర్పడి ఉద్యమాలు చేశారు. ఇప్పుడు వీరంతా కలసి మదనపల్లి పట్టణంలో ఉద్యమకారుల విజయోత్సవ ర్యాలీ పేరుతో బహుజన్ సమాజ్ పార్టీ.. బందెల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయోత్సవ ర్యాలీ
బీఎస్పీ ఆధ్వర్యంలో మొదలైన ఈ మదనపల్లె జిల్లా విజయోత్సవ ర్యాలీ.. అనంతపురంకు వెళ్లే దారిలో ఉన్న టిప్పు సుల్తాన్ మైదాన ప్రాంతం నుంచి ప్రారంభమై.. మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ దగ్గర తిరుపతికి వెళ్లే రోడ్డు మార్గంలోని డా.బీ.ఆర్. అంబేడ్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. అంబేద్కర్ విగ్రహం ముందు ఎన్నో నిరసనలు, పోరాటాలు చేసామని ఇప్పుడు ఈ విజయాన్ని కూడా ఇక్కడ జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అక్కడ సమావేశాన్ని నిర్వహించి జిల్లా సాధన కోసం వారు చేసిన పోరాట, ఉద్యమాలని దానితో పాటు మదనపల్లె అభివృద్ధి గురించి మాట్లాడటం జరిగింది.
పోరాటాల వల్లనే మదనపల్లె జిల్లా..
ఈ సందర్బంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్, ఇతర నాయకులు మాట్లాడుతూ ప్రజా పోరాటాల వల్లనే మదనపల్లె జిల్లాగా మారడానికి కారణం అయిందని అన్నారు. అంతే కాకుండా ఎప్పుడూ ప్రజల అభిప్రాయాలను, వారి ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయరాదని, వారి ఆలోచనలకు, పోరాటాలకు విలువ ఇచ్చి వాటి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఆచితూచి సరైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ప్రజల ఉద్యమాన్ని చులకన చేసి.. పక్కన పెడితే అనేక ప్రభుత్వాలు ఆ నిరసన సెగకు తట్టుకుని నిలబడలేక పోయాయి. గత ప్రభుత్వం మదనపల్లెని జిల్లా చేయాలనే అంశాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఓడిపోయిందని అన్నారు.
బీటీ కాలేజీని యూనివర్సిటీగా..
ఇక ముందు ముందు మదనపల్లెకి సంబంధించిన అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ రాజీపడే అవకాశం లేదని, జిల్లా డెవలప్మెంట్ కోసం మరొక ప్రత్యేక జేఏసీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడున్న అనేక ఇతరత్రా సమస్యలను అన్నింటిపై కూడా మేము స్పందించి, ఉద్యమించి మదనపల్లె భవిష్యత్తుని మార్చే విధంగా కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. అదే విధంగా మదనపల్లెలో బ్రిటిష్ పరిపాలన కాలంలో అనిబిసెంట్ కట్టించిన అతిపురాతమైన విద్యా బాండాగారం అయిన బిసెంట్ థీయోసాఫికల్ (బీటీ) కాలేజీని ఒక యూనివర్సిటీగా మార్చి అన్నీ విధాలుగా తీర్చిదిద్దాలని కోరారు.
మదనపల్లెకు హంద్రీనీవా నీళ్లు!
హంద్రీ నీవా కాలువలో పారే నీళ్లను మదనపల్లె కూడా అందించాలని, టమోటాకి సంబంధించిన ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా ప్రారంభించాలని.. ఆ రకంగా మదనపల్లె పట్టణంతో పాటు జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్బంగా అందరూ మాట్లాడటం జరిగింది.
జిల్లా సాధన విషయంలో ఎన్నోసార్లు నిర్బంధించినా, అనేక అరెస్టులు చేసినా.. తాము ఎప్పుడూ, ఎక్కడా కూడా వెనుదిరిగిన దాఖలాలు లేవని మరింత రెట్టింపుతో పని చేశామని రాబోయే కాలంలో మదనపల్లె కి అభివృద్ధి విషయంలో ఏ ఇబ్బంది వచ్చిన ఇదేవిధంగా ముందుండి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. జేఏసీ ప్రారంభించినది పీటీఏం శివ ప్రసాద్ అని, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జనసేన నాయకులు తదితరులు కూడా పాల్గొనటం వలన కూడా ఇది నెరవేరింది అని అన్నారు.