విద్యార్థులకు గొప్ప అవకాశం: రూ.కోటి గెలుచుకునే ఛాన్స్!

భారతదేశంలో చదువుతున్న 6వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మంచి కార్యక్రమం ప్రవేశపెట్టింది. వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి?, కాన్సెప్ట్ ఏమిటి? ప్రైజ్ ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

వికసిత్ భారత్ బిల్డథాన్ థీమ్స్

ఆవిష్కరణ స్ఫూర్తిని విద్యార్థులలో పెంపొందించడానికి, సమస్యలకు పరిష్కారం వెతికే దిశగా ప్రోత్సహించడానికి కేంద్రం ఈ వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 స్టార్ట్ చేసింది. ”స్వదేశీ, ఆత్మనిర్భర భారత్, సమృద్ధి భారత్, లోకల్ ఫర్ లోకల్” వంటి థీమ్‌లతో ఆవిష్కరణలు, సమస్యలకు పరిష్కారాలను చూపాలని కేంద్రం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొననటానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఆఖరి తేదీ (2025 అక్టోబర్ 11). విద్యార్థులు 3 లేదా 5 మంది కలిసి ఒక బృందంగా మారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అధికారిక పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. మీకు ఒక ప్రత్యేకమైన ఐడీ జనరేట్ అవుతుంది.

రూ.కోటి విలువైన బహుమతులు

రిజిస్ట్రేషన్ చేసుకున్న బృందాలు ఒక థీమ్ ఎంచుకుని.. సమస్యకు తమదైన శైలిలో విభిన్న పరిష్కారాలను వెల్లడించాలి. దీనికి సంబంధించి 2-3 నిమిషాల వీడియో రికార్ట్ చేసి.. దానిని అక్టోబర్ 13 నుంచి 31వ తేదీ మధ్యలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2026 జనవరిలో అంటే వచ్చే ఏడాది విజేతలను ప్రకటిస్తారు. విజేతలకు రూ. కోటి విలువైన బహుమతులను అందిస్తారు.

ప్రధాన ఉద్దేశ్యం

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 కార్యక్రమంలో దేశంలోని సుమారు 2.5 లక్షల పాఠశాలల నుంచి కోటి కంటే ఎక్కువమంది విద్యార్థులను పాల్గొనేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వికసిత్ భారత్ 2047 దిశగా కేంద్రం వేస్తున్న మరో పెద్ద అడుగు. ఈ కార్యక్రమాన్ని అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ సహకారంతో విద్యామంత్రిత్వ శాఖ ప్రారంభించింది. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ప్రతిభకు ప్రపంచ కేంద్రంగా మలచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.

రిజిస్ట్రేషన్ విధానం

  • వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 కార్యక్రమంలో పాల్గొనాలనుకునే విద్యార్థులు అధికారికి వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • మీ బృందం వివరాలతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి.
  • ఇప్పటికే ప్రస్తావించిన నాలుగు థీమ్‌లలో ఏదో ఒకదానికి ఎంచుకుని.. మీ ఆవిష్కరణ భావన, ప్రాజెక్ట్ ఆలోచనలను సమర్పించాలి.

వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ తేదీ: 2025 సెప్టెంబర్ 23
  • రిజిస్ట్రేషన్ గడువు: 2025 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 11 వరకు
  • లైవ్ బిల్డథాన్: 2025 అక్టోబర్ 13
  • విజేతల ప్రకటన: 2025 డిసెంబర్ లేదా 2026 జనవరి

విద్యార్థులకు గొప్ప అవకాశం

మీలోని సృజనాత్మకతను, సమస్యలకు పరిష్కారం కనుగొనే తెలివిని ప్రపంచానికి చాటి చెప్పుకోవడానికి వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 ఒక గొప్ప అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు ప్రపంచానికి పరిచయం చేసుకోవడం మాత్రమే కాదు.. విలువైన బహుమతులు కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో లేదా ఇలాంటి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనడానికి ఆసక్తి చూపించాలి. వికసిత్ భారత్ 2047లో మీరు కూడా భాగస్వాములవ్వాలి.