భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అందులోనూ ఇప్పుడు పండుగ సీజన్. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇటాలియన్ బ్రాండ్ అయిన మోటోహౌస్ కంపెనీ.. ఇండియన్ మార్కెట్లో సరికొత్త వీఎల్ఎఫ్ మాబ్స్టర్ 125 లాంచ్ చేసింది. ఇప్పటికే బ్రిక్స్టన్ శ్రేణి బైకులను లాంచ్ చేసిన ఈ కంపెనీ.. ఇప్పుడు 125 సీసీ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర, బుకింగ్స్, డెలివరీ డీటైల్స్, ఇంజిన్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర & బుకింగ్స్
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త వీఎల్ఎఫ్ మాబ్స్టర్ 125 స్కూటర్ ధర రూ. 1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ప్రారంభ ధర కేవలం మొదటి 2500 కస్టమర్లకు మాత్రమే అని తెలుస్తోంది. కాగా కంపెనీ ఈ స్కూటర్ కోసం రూ. 999లతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లో.. ఈ స్కూటర్ 1000 బుకింగ్స్ స్వీకరించగలిగింది. డెలివరీలు నవంబర్ 2025లో ప్రారంభమవుతాయని సమాచారం.
డిజైన్
కొత్త వీఎల్ఎఫ్ మాబ్స్టర్ 125 స్కూటర్.. మాబ్స్టర్ 135 మ్యాక్సీ స్కూటర్ నుంచి ప్రేరణ పొందింది. కాబట్టి ఇది మంచి డిజైన్ పొందింది. ఈ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, అగ్రెసివ్ బాడీ ప్యానెల్స్, స్ప్లిట్ స్టైల్ ఫుట్‌రెస్ట్‌లు, స్టెప్డ్ సీటు వంటివి కలిగి ఉండటం చూడవచ్చు. అంతే కాకుండా ఈ స్కూటర్ ట్యూబ్‌లెస్ టైర్లతో.. 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో సీబీఎస్‌తో కూడిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఈ స్కూటర్ సీటు ఎత్తు 797 మిమీ కాగా.. గ్రౌండ్ క్లియరెన్స్ 155 మిమీ.
నాలుగు రంగులలో (రెడ్, బూడిద రంగు, వైట్, ఫ్లోరోసెంట్ ఎల్లో) లభించే ఈ స్కూటర్ కొనుగోలుపై.. కొనుగోలుదారు 4 సంవత్సరాలు లేదా 40000 కిమీ వారంటీతో పాటు, ఒక సంవత్సరం రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను పొందుతాడు. ప్రస్తుతం ఈ కంపెనీకిని ఢిల్లీ, పూణే, బెంగళూరు, గోవా వంటి మొత్తం దేశవ్యాప్తంగా 12 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. కాగా సంస్థ మరో 10 అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది.
ఫీచర్స్
వీఎల్ఎఫ్ మాబ్స్టర్ 125 స్కూటర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో టీఎఫ్టీ స్క్రీన్ ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ న్యావిగేషన్, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్, రైడింగ్ గణాంకాలను చూపిస్తుంది. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, హాఫ్ ఫేస్ హెల్మెట్‌కు సరిపోయేంత అండర్ సీట్ స్టోరేజ్ వంటివి ఇందులో ఉన్నాయి. కీలెస్ ఇగ్నియస్, ఆటో స్టార్ట్ / స్టాప్ వంటి ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ పొందుతుంది.
ఇంజిన్ వివరాలు
వీఎల్ఎఫ్ 125 స్కూటర్ 125 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8250 ఆర్పీఎం వద్ద 12.1 బీహెచ్పీ పవర్, 6500 ఆర్పీఎం వద్ద 11.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్కులు, మోనోషాక్ సస్పెన్షన్ వంటివి పొందుతుంది. ఈ స్కూటర్ బరువు 122 కేజీలు కాగా.. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్లు. ఈ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.