మొలకెత్తిన బంగాళాదుంప: తింటే వచ్చే సమస్యలు

కొన్ని మొలకెత్తి తింటే మంచిదంటారు. మరికొన్ని మొలకెత్తినవి తింటే ప్రమాదంటారు. నిజానికి పెసలు వంటివి మొలకెత్తి తినడం వల్ల.. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మొలకెత్తిన బంగాళా దుంప (పొటాటో) తింటే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇదెలా ప్రమాదం?, దీనివల్ల జరిగే అనర్దాలు ఏమిటనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మొలకెత్తిన బంగాళాదుంప – సమస్యలు

ఈ రోజుల్లో చాలామంది బంగాళాదుంపను దాదాపు అన్ని వంటకాల్లోనూ ఉపయోగిస్తుంటారు. వంటకాలు పక్కనపెడితే.. ఫ్రెంచ్ ప్రైస్, చీజ్ బాల్స్ వంటివాటితో మాత్రమే కాకుండా.. చాలామంది ఇష్టంగా తినే పానీపూరీలో కూడా పొటాటోను విరివిగా ఉపయోగిస్తుంటారు. మొలకెత్తని బంగాళాదుంప వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కానీ మొలకెత్తిన బంగాళాదుంప అయితేనే సమస్య.

హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. మొలకెత్తిన బంగాళాదుంపల్లో సోలనిన్, చాకోనిన్ అనే రెండు గ్లైకోఆల్కలాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. వీటిని తక్కువ పరిమాణంలో తీసుకుంటే.. రక్తంలో షుగర్ లెవెల్స్ నిర్వహించడంలో సహాయపడతాయి. ఎక్కువైతే.. ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య సమస్యలు

➤గ్లైకోఅల్కలాయిడ్ తీసుకోవడం వల్ల.. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దీని పరిమాణం ఎక్కువైతే లేదా గ్లైకోఅల్కలాయిడ్ ఎక్కువైతే.. తలనొప్పి, జ్వరం, పల్స్ పెరిగిపోవడం, లో బీపీ వంటి సమస్యలు తలెత్తుతాయని హెల్త్‌లైన్ స్పష్టం చేసింది.

➤బంగాళాదుంపలు మొలకెత్తినట్లయితే.. గ్లైకోఅల్కలాయిడ్ ఉత్పత్తి అవుతుందని తెలుసుకున్నాం. అంటే బంగాళాదుంప ఆకులు, పువ్వులు, మొలకెత్తిన ప్రాంతాల్లో గ్లైకోఅల్కలాయిడ్ ఉంటుంది. కాబట్టి మొలకెత్తిన పొటాటో తినడం వల్ల.. జీర్ణాశయానంతర సమస్యలు మాత్రమే కాకుండా.. నాడీ సంబంధ రుగ్మతలు ఏర్పడతాయి. తలనొప్పి, వికారం, తిమ్మిర్లు, వాంతులు వంటివి కూడా సంభవిస్తాయి.

➤సాధారణ బంగాళాదుంప కంటే.. మొలకెత్తిన బంగాళాదుంపలు రుచికి చేదుగా ఉంటాయి. దీనికి కారణం అధిక స్థాయిలో ఉండే గ్లైకోఅల్కలాయిడ్స్. తినడానికి కూడా అంత బాగుండదు. ఇలాంటివి తినకపోవడమే మంచిది.

➤పోషక విలువలు కూడా మొలకెత్తిన బంగాళాదుంపలో చాలా తక్కువగానే ఉంటాయి. ఎప్పుడైతే బంగాళాదుంప మొలకెత్తుతుందో. అప్పుడే పోషకాలు నశించడం ప్రారంభమవుతుంది. కాబట్టి వీటిని తింటే.. పోషకాల సంగతి దేవుడెరుగు, అనుకోని సమస్యలు ఎదురవుతాయి.

సమస్యను తగ్గించే మార్గాలు

మొలకెత్తిన బంగాళాదుంపలో.. కళ్ళు, ఆకుపచ్చగా ఉండే తొక్క, మొలకలు వంటి భాగాలను తొలగించడం వల్ల కొంతవరకు ఇందులో గ్లైకోఅల్కలాయిడ్ తగ్గించవచ్చు. అంతే కాకుండా ఉడకబెట్టడం, కాల్చడం లేదా మైక్రోవేవ్ చేయడం వల్ల కూడా ఓ స్థాయిలో విషపదార్థాలను తగ్గించవచ్చు.

పరిష్కారం ఇదే..

బాటమ్ లైన్నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ ప్రకారం.. మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను ఉపయోగిచకపోవడమే ఉత్తమం. మొలకెత్తిన బంగాళాదుంపను తినకూడదు అనుకుంటే.. పొటాటోను వీలైనంత వరకు నిల్వ చేయకుండా ఉండటం మంచిది. ఒక వేళా మీ దగ్గర బంగాళాదుంపలు ఉంటే.. వాటిని పొడి ప్రదేశాల్లో నిల్వచేయడం ఉత్తమం. మొత్తం మీద బంగాళాదుంపను ఇష్టంగా తినేవారు.. ప్రతి ఒక్కరూ మొలకెత్తిన బంగాళాదుంప వల్ల వచ్చే సమస్యలను తెలుసుకోవాలి. లేకుంటే.. అనుకోని ప్రమాదాలను ఆహ్వానించినవారు అవుతారు.