Which Extinct car Brands do People Search Most In Google: ఆటోమొబైల్ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతూ.. మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రపంచంలో చైనా అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కాగా.. యునైటెడ్ స్టేట్స్ ఆ తరువాత స్థానంలో ఉంది. భారత్ ఇందులో ముచ్చటగా మూడో స్థానంలో ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆటోమొబైల్ మార్కెట్‌లో డజన్ల కొద్దీ బ్రాండ్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో మరికొన్ని కాలగర్భంలో కలిసిపోతూనే ఉన్నాయి.
గతంలో ఓ వెలుగు వెలిగి ఎంతో గొప్ప ప్రజాదరణ పొందిన పాపులర్ బ్రాండ్స్ ఈ రోజు ఉత్పత్తి దశలో లేదు, ఉనికిలో ఉన్న కొన్ని కార్లు కూడా చరమదశలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని కంపెనీలు మార్కెట్లో తమ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేసినప్పటికీ ఎక్కువమంది ఆ బ్రాండ్స్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నట్లు కార్ లీజింగ్ కంపెనీ హిప్పో లీజింగ్ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
వెల్లడైన అధ్యయనాల ప్రకారం.. ప్రపంచంలో ఎక్కువమంది గూగుల్‌లో వెతికిన టాప్ 5 కార్ల తయారీ సంస్థల జాబితాలో సాబ్ ఆటోమొబైల్, పొంటియాక్, ఓల్డ్‌స్‌మొబైల్, ట్రాబంట్ మరియు హోల్డెన్ వంటివి ఉన్నాయి. భారదేశంలో కూడా చాలామంది కాలగర్భంలో కలిసిపోయిన సాబ్ బ్రాండ్ కోసం సాధించినట్లు నివేదికలు చెబుతున్నాయి. జపాన్, యూకే, ఫ్రాన్స్ మరియు సౌత్ కొరియా దేశాల్లో కూడా ఈ సాబ్ బ్రాండ్ కోసం తెగ వెతికేసినట్లు హిప్పో లీజింగ్ డేటాలో వెల్లడించింది.
సాబ్ ఆటోమొబైల్ (Saab Automobile)
సాబ్ ఆటోమొబైల్ అనేది 1945లో స్వీడన్‌లో స్థాపించబడిన వాహన తయారీ సంస్థ. ఇది ఓ చిన్న ఆటోమొబైల్ డిజైన్ కోసం ఏర్పడిన ప్రాజెక్టులో భాగంగా పుట్టిన కంపెనీ. దీని మొదటి ఉత్పత్తి ‘సాబ్ 92’. దీనిని కంపెనీ 1949లో ప్రారంభించింది. ఆ తరువాత 1968లో ఈ కంపెనీ స్కానియా వాబిస్‌తో విలీనమైపోయింది. ఆ తరువాత ఐదేళ్లకు అంటే 1973 ప్రాంతంలో ‘సాబ్ 900’ ప్రారంభమైంది. ఈ కారు కాలక్రంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే 1980లో మరిన్ని ఆధునిక హంగులతో ‘సాబ్ 9000’ రూపంలో కనిపించింది.
కాలక్రమంలో జరిగిన ఎన్నో మార్పుల కారణంగా 1989లో సాబ్-స్కానియా ఆటోమొబైల్ విభాగం.. సాబ్ ఆటోమొబైల్ ఏబీ అనే స్వాతంత్య్ర కంపెనీగా ఏర్పడింది. ఆ తరువాత అమెరికన్ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ఇందులో 50 శాతం వాటా సొంతం చేసుకుంది. ఈ సమయంలోనే సాబ్ 9-3 మరియు సాబ్ 9-5 అనే మోడల్స్ పుట్టుకొచ్చాయి. ఆటోమొబైల్ మార్కెట్లో జరిగిన అనేక పరిణామాల కారణంగా తరువాత ఈ కంపెనీ డచ్ ఆటోమొబైల్ తయారీదారు సొంతం చేసుకుంది.
ప్రారంభంలో ఎంతో వైభవాన్ని సొంతం చేసుకున్న సాబ్.. తరువాత ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో సక్సెస్ సాధించలేకపోయింది. అయితే కంపెనీ ఉత్పత్తులు మాత్రం వాహన ప్రియుల మనసులో చెరగని ముద్ర వేసాయి. ఈ కారణంగానే ప్రపంచంలోని చాలా దేశాలు ఈ కార్ల కోసం గూగుల్ సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్లకు భారతదేశంలో కూడా అభిమానులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
పోంటియాక్ (Pontiac)
మన జాబితాలో ఎక్కువమంది గూగుల్ సెర్చ్ చేసిన కారు బ్రాండ్ పొంటియాక్. ఇది 1926లో స్థాపించబడిన అమెరికన్ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్ (GM) కింద ఉన్న ఓ ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్. ఈ బ్రాండ్ కార్లు ఎక్కువగా అమెరికా, కెనడా, మెక్సికో వంటి దేశాల్లో ఎక్కువగా విక్రయించబడ్డాయి. ప్రారంభంలో మంచి అమ్మకాలతో తిరుగులేని రికార్డ్ క్రియేట్ చేసిన ఈ బ్రాండ్ కార్లు.. కాలక్రమంలో ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వడంలో విఫలమయ్యాయి.
మార్కెట్లో కొత్త కార్లు పుట్టుకు రావడంతో చాలామంది వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. ఆ సమయంలో పోంటియాక్ కార్ల అమమకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఆ తరువాత చేసేదేమీ లేక సంస్థ ఈ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. అయినప్పటికీ ఈ కార్లు వాహన ప్రేమికుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ కారణంగానే కొందరు అభిమానులు వీటి కోసం ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేస్తుంటారు.
ఓల్డ్‌స్‌మొబైల్ (Oldsmobile)
బహుశా ఈ పేరు ఎక్కువమంది భారతీయులకు తెలిసి ఉండకపోవచ్చు. ఇది అమెరికన్ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ యొక్క డివిజన్ అని తెలుస్తోంది. నిజానికి ఇది 1897లో రాన్సమ్ ఈ. ఓల్డ్స్ చేత ‘ఓల్డ్స్ మోటార్ వెహికల్’ కంపెనీగా ప్రారంభమైంది. ఇది ఏకంగా 35 మిలియన్ల కంటే ఎక్కువ వాహనాలను ఉత్పత్తి చేసింది. ఇందులో సుమారు 14 మిలియన్ల వాహనాలు లాన్సింగ్, మిచిగాన్ వంటి తయారీ కర్మాగారాల్లో రూపొందించబడ్డాయి.
1900ల ప్రారంభంలో అమెరికాలో అమ్మకాల పరంగా ఓ మెరుపు మెరిసిన ఓల్డ్‌స్‌మొబైల్ మొట్ట మొదటి వాహనం ‘కర్వ్డ్ డాష్’. ఇది 1902 మరియు 1907 ప్రాంతంలో నిర్మించబడింది. ఆ తరువాత కంపెనీ కాంపాక్ట్ సెడాన్‌లను కూడా తయారు చేసి విక్రయించింది. క్రమంగా మార్కెట్లో కొత్త ఉత్పత్తుల సంఖ్య పెరిగింది.. ఈ కంపెనీ ఉత్పత్తులకు ప్రాభల్యం బాగా తగ్గింది. 1990లలో కంపెనీ దాదాపు దివాళా తీసే స్థితికి చేరింది. 2000 సంవత్సరం నాటికి లాభాలు కూడా ఒక సమస్యగా మారింది. ఇలా కంపెనీ వాహనాలు కాల గర్భంలో కలిసిపోయాయి.
ట్రాబంట్ (Trabant)
ప్రపంచంలో ఎక్కువమంది గూగుల్ సెర్చ్ చేసి వెతికిన కార్ల జాబితాలో మరొకటి ట్రాబంట్. ఇది జర్మన్ వాహన తయారీ సంస్థ. కంపెనీ ట్రాబంట్ 500, ట్రాబంట్ 600, ట్రాబంట్ 601 మరియు ట్రాబెంట్ 1.1 అనే మోడల్స్ విక్రయించింది. ఇందులో మొదటి మోడల్ ట్రాబంట్ 500 అని తెలుస్తోంది. ఆ తరువాత కంపెనీ స్పార్క్ ప్లగ్ అని పిలువబడే కార్లను ఏకంగా 3096999 యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు సమాచారం. ఈ కంపెనీ కార్లకు ప్రపంచంలో అభిమానులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆదరణ తక్కువగానే ఉండేది. ఈ కారణంగానే సంస్థ ఈ బ్రాండ్ కార్ల ఉత్పత్తులను నిలిపివేసింది.
Don’t Miss: ఓటమి ఎరుగని దర్శకధీరుడు ‘రాజమౌళి’ కార్లు చూశారా? బెంజ్, ఆడి, వోల్వో ఇంకా..
హోల్డెన్ (Holden)
చివరగా మనం చెప్పుకోబోతున్న పురాతన బ్రాండ్ హోల్డెన్. నిజానికి దీన్ని గతంలో జనరల్ మోటార్స్ హోల్డెన్ అని పిలిచేవారు. ఎందుకంటే ఇది జనరల్ మోటార్స్ యొక్క ఆస్ట్రేలియన్ అనుబంధ సంస్థ. ఇది దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో స్థాపించారు. దశాబ్దాల కాలం మార్కెట్లో గొప్ప అమ్మకాలు పొందుతూ దూసుకెళ్లిన ఈ కారు.. క్రమంగా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో బ్రాండ్ అమ్మకాలు అంతంత మాత్రంగానే మిగిలిపోయాయి. ఇలా హోల్డెన్ కూడా కాలగర్భంలో కలిసిపోయింది. అయినప్పటికీ ఈ బ్రాండ్ కార్ల కోసం చాలా దేశాల్లోని ఆటోమొబైల్ ఔత్సాహికులు సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం.