రతన్ టాటా మీద చెయ్యేసి మాట్లాడేంత చనువుందా! ఎవరితడు?

Shantanu Naidu Relationship With Ratan Tata: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా (Ratan Tata) గురించి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలామందికి తెలుసు. అయితే అంతటి వ్యాపార దిగ్గజానికే టెక్నాలజీ పాఠాలు నేర్పే ఓ కుర్రాడి గురించి బహుశా తెలియకపోవచ్చు. ఇంతకీ అతడెవరు, అతనికి రతన్ టాటాకు ఉన్న సంబంధం ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రతన్ టాటా అసిస్టెంట్, ఆఫీసులో డిప్యూటీ జనరల్ మేనేజర్ విధులు నిర్వహించే 28 ఏళ్ల ‘శంతను నాయుడు’ (Shantanu Naidu) 83 సంవత్సరాల వయసున్న రతన్ టాటాకు మంచి మిత్రుడు కూడా. ఇతడు ఏకంగా మూడు స్టార్టప్‌లను విజయవంతంగా నడుపుతున్నట్లు సమాచారం.

రతన్ టాటా వయసేమిటి, ఈ కుర్రాడి వయసేమిటి? వారి మధ్య స్నేహం ఏమిటని కొందరికి అనుమానం రావొచ్చు. కానీ ఇద్దరు మనుషులు ఆలోచనలు కలిస్తే, దృక్పథాలు ఒకటైతే ఆ సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి నిదర్శనమే రతన్ టాటా మరియు శంతను నాయుడు.

నిజానికి వీరిరువురి వయసులో చాలా తేడా ఉన్నప్పటికీ వీరి మాటలు, వీరి ముచ్చట్లు చాలా రసవత్తరంగా ఉంటుంది. వీరి మధ్య ఉన్న బంధాన్ని సరిగ్గా అర్థం చేసుకునే వారి వయసు కేవలం సంఖ్య మాత్రమే అని ఖచ్చితంగా నిర్థారిస్తారు.

కేవలం వ్యాపారంలో మాత్రమే కాకుండా సామాజిక సేవలో కూడా తరిస్తున్న రతన్ టాటా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడేంత చనువు ఎవరికైనా ఉంది అంటే తప్పకుండా అది శంతను నాయుడు అనే చెప్పాలి. మూగ జీవాల సంరక్షణలో మొదలైన వీరి పరిచయం నేడు మంచి స్నేహంగా మారింది.

వీరిద్దరూ ఎప్పుడూ సేవా కార్యక్రమాలు గురించి చర్చిస్తూ, ఈమెయిల్స్ ద్వారా అభిప్రాయాలూ పంచుకునేవారు. రతన్ టాటాను సోషల్ మీడియాకు పరిచయం చేసింది కూడా శంతను నాయుడే. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, హ్యాష్ టాగ్స్, ఎమోజి వంటి వాటిని ఉపయోగించడం కూడా ఇతడే నేర్పించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రతన్ టాటాకు వ్యాపార నిర్వహణ సంబమైన సలహాలు కూడా ఇస్తుంటాడు.

శంతను నాయుడు మోటోపాస్ కంపెనీ బాధ్యతలు చూసుకుంటూనే, పెద్ద చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అతడు చదువుకునే కార్నెల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేడుకలకు రతన్ టాటా హాజరయ్యాడు. ఆ తరువాత శంతను ఇండియా వచ్చిన తరువాత రతన్ టాటా ఆహ్వానం మేరకు బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరాడు.

వయసురీత్యా చిన్నవాడైనా.. ఆలోచనలో మాత్రం పెద్దవాడే అంటూ రతన్ టాటా గతంలో కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. కరోనా సమయంలో రతన్ టాటా నిర్వహించిన అనేక కార్యక్రమాలను శంతను దగ్గరుండి చూసుకున్నాడు.

శంతను నాయుడు పరిచయం

రతన్ టాటాకు శంతను నాయుడికి పరిచయం ఎలా ఏర్పడిందని చాలామందికి అనుమానం వచ్చి ఉండవచ్చు. నిజానికి ఒకరోజు శంతను ఆఫిస్ నుంచి ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుక్క ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూసి చలించిపోయాడు. దీంతో మరోసారి ఇలాంటి సంఘటన జరగకూడదని స్నేహితులతో కలిసి రంగురంగుల రేడియం బెల్టులు తయారు చేసి వాటికి అమర్చాడు.

Don’t Miss: ఒకప్పుడు సైకిల్.. ఇప్పుడు కోట్లు ఖరీదైన లగ్జరీ కార్లు – ఎవరీ అనురాగ్..

కుక్క మేడలో రేడియం బెల్టు ఉండటం వల్ల వాహనాల లైటింగ్ పడినప్పుడు అవి మెరిసేవి, ఆ సందర్భంలో వాహనాలు ఆపడం లేదా నెమ్మదిగా వెళ్లడం చేసేవారు. ఇవి చూసిన ప్రజలు కూడా వారికి ఇలాంటి బెల్టులు కావాలని అడిగారు, కానీ అతని వద్ద వాటి తయారీకి అంత డబ్బు లేకపోవడంతో తండ్రి సలహాతో టాటా ఇండస్ట్రీస్ వారికి సందేశం పంపించాడు.

ఆ తరువాత కంపెనీ నుంచి ఆహ్వానం లభించింది. శంతను ముంబై వెళ్లిన తరువాత ఆ ప్రాజెక్టుకి కంపెనీ వారు కూడా ఒకే చెప్పేసారు. దీంతో మోటోపాస్ అనే స్టార్టప్ ప్రారంభించాడు. ప్రస్తుతం వృద్ధుల కోసం గుడ్‌ఫెలోస్ అనే స్టార్టప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.