ప్రపంచ వ్యాప్తంగా అనేక కారణాల వల్ల.. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కొంత మందగించాయి. అయితే భారతదేశంలో మాత్రం ఇందుకు భిన్నం. ఎందుకంటే ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశంలో.. ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వాటా 6 శాతంగా ఉంది. దీనికి కారణం కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లాంచ్ కావచ్చు, ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడటం కావచ్చు. ఏదైతేనేం.. దేశంలో ఈవీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ కథనంలో ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవం సందర్భంగా.. ఐదు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్స్ (జనరేషన్ 3)
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే వివిధ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆగస్టులో ”ఎస్1 ప్రో స్పోర్ట్స్ జెన్ 3” లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.50 లక్షలు ( షోరూమ్). అయితే దీనిని రూ. 999లతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2026 జనవరిలో ప్రారంభమవుతాయి. ఈ స్కూటర్ 5.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా.. 320 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 15 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.
ఆల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్
బెంగళూరుకు చెందిన అల్ట్రావయొలెట్ కంపెనీ ఆధునిక వాహనాలను లాంచ్ చేస్తూ యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగానే కంపెనీ టెస్సెరాక్ట్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనిని కూడా రూ. 999లతో బుక్ చేసుకోవచ్చు. 14 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ స్కూటర్.. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ పొందుతుంది. డిజైన్ కూడా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ టీఎఫ్టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇండీగ్రేటెడ్ డాష్‌క్యామ్, మొబైల్ కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.
హీరో విడా వీఎక్స్2
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. ఈ ఏడాది జులైలో వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది వీఎక్స్2 గో, వీఎక్స్2 ప్లస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 99,490, రూ. 1.10 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇవి 92 కిమీ రేంజ్ అందించే.. 2.2 కిలోవాట్ సింగిల్ రిమూవబుల్ బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 70 కిమీ కావడం విశేషం. ఎకో మరియు రైడ్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ స్కూటర్ 4.3 ఇంచెస్ ఎల్‌సీడీ డిజిటల్ డిస్‌ప్లే పొందుతుంది. ఇది స్కూటర్ గురించి చాలా సమాచారం అందిస్తుంది.
కైనెటిక్ డీఎక్స్
1980.. 90 సంవత్సరాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన స్కూటర్ నుంచి ‘కైనెటిక్ డీఎక్స్‘ ప్రేరణ పొందింది. ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలోనే అతిపెద్ద ఆవిష్కరణ. ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 1,11,499 (ఎక్స్ షోరూమ్). డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లోర్‌బోర్డ్ కింద 2.6 కిలోవాట్ లిథియం ఐరన్ పాస్ఫేట్ ఉంటుంది. ఇది 4.8 కేడబ్ల్యు మోటారును పొందుతుంది. సింగిల్ ఛార్జితో 116 కిమీ రేంజ్ అందించే ఈ స్కూటర్ మూడు రైడింగ్ మోడ్స్ (రేంజ్, పవర్, టర్బో) పొందుతుంది.
టీవీఎస్ ఆర్బిటర్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ.. టీవీఎస్ ఇటీవల ఆర్బిటర్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 99,999 (ఎక్స్ షోరూమ్). ఈ స్కూటర్ 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 158 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ ఫంక్షన్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ ఇచ్చే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.