Xiaomi SU7 Showcased in India: ఆటోమొబైల్ రంగంలో భారత్ దూసుకెళ్తోంది. ఈ తరుణంలో చాలా కంపెనీలు తమ వాహనాలను ఎలక్ట్రిక్ విభాగంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ చైనా మొబైల్ తయారీ కంపెనీ ‘షియోమీ’ (Xiaomi) కూడా చేరనుంది. ఇప్పటికే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించినప్పటికీ.. ఈ ఏడాది ప్రారంభంలో విక్రయానికి వచ్చింది. అయితే ఇండియన్ మార్కెట్లో ఈ కారు అమ్మకానికి రానున్నట్లు తెలుస్తోంది.
2021 మార్చిలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అడుగుపెట్టిన చైనీస్ స్మార్ట్‌ఫోన్ షియోమీ.. భారతీయ తీరాలకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త ‘షియోమీ ఎస్‌యూ7’ (Xiaomi SU7) ఎలక్ట్రిక్ డిజైన్, ఫీచర్స్, రేంజ్ మరియు ఇతరత్రా వివరాలను వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..
డిజైన్
దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్న కొత్త షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఈ కారు డిజైన్ చేయడానికి కంపెనీ ప్రత్యేకించి బీఎండబ్ల్యూ డిజైనర్ ”లి టియాన్యువాన్”ను నియమించుకున్నారు. అంతే కాకుండా బీఎండబ్ల్యూ కనెక్షన్ మాజీ బీఎండబ్ల్యూ డిజైన్ హెడ్ ”క్రిస్ బ్యాంగిల్”ను కూడా నియమించుకుంది.
షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ సెడాన్ చూడగానే పోర్స్చే టేకాన్ మరియు టెస్లా మోడల్ ఎస్ మాదిరిగా అనిపిస్తుంది. కానీ తీక్షణంగా చూస్తే అది షియోమీ ఎస్‌యూ7 అని అర్థమవుతుంది. హెడ్‌లైట్ డిజైన్ మెక్‌లారెన్ 720ఎస్ మాదిరిగా ఉంటుంది. రియర్ గ్లాస్, అడ్జస్టబుల్ రియర్ స్పాయిలర్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇది 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రేమ్‌లెస్ డోర్స్ పొందుతుంది.
కలర్ ఆప్షన్స్
షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మీటోర్ బ్లూ, రేడియంట్ పర్పుల్, బసాల్ట్ గ్రే, లావా ఆరెంజ్, పెర్ల్ వైట్ మరియు డైమండ్ బ్లాక్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారు తన నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఫీచర్స్
కొత్త షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని స్టీరింగ్ వీల్ హీటింగ్ ఫంక్షన్ పొందుతుంది. కారు స్విచ్ ఆన్ చేసినప్పుడు 7.1 ఇంచెస్ ప్లిప్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా కొత్తగా ఉండటం వల్ల ఎంతగానో ఆకర్షిస్తుంది. ఫ్రంట్ సీట్లు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు వెంటిలేటెడ్ అండ్ హీటింగ్ ఫంక్షన్ పొందుతుంది.
షియోమీ ఎస్‌యూ7 16.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ పొందుతుంది. ప్రస్తుతం ఇందులోని సమాచారం మొత్తం చైనా భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ఇది ఇంకా భారతదేశంలోకి అడుగుపెట్టలేదు కాబట్టి కేవలం చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల చైనా భాష మాత్రమే చూపిస్తుంది. ఇండియాలో లాంచ్ అయిన తరువాత ఇంగ్లీష్ భాషలో సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ కారులో ఏడీఏఎస్ (ADAS) టెక్నాలజీ ఉంటుందని సమాచారం. ఇది వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఇందులో మల్టిపుల్ కెమెరాలు సెటప్ కూడా ఉంటుంది.
బ్యాటరీ మరియు రేంజ్
షియోమీ ఎలక్ట్రిక్ కారులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం బ్యాటరీ మరియు రేంజ్. ఈ కారు మల్టిపుల్ మోటార్ కాన్ఫిగరేషన్‌లతో లభిస్తుంది. ఇండియాలో లాంచ్ అయ్యే కారు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగి రెండు ఎలక్ట్రిక్ మోటార్లను పొందనున్నట్లు సమాచారం. కాబట్టి మొత్తం పవర్ 673 హార్స్ పవర్ మరియు 838 న్యూటన్ మీటర్ టార్క్ అని తెలుస్తోంది. ఈ కారు కేవలం 2.78 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులో 101 కిలోవాట్ నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC) బ్యాటరీ ఉండనుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 800 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.
Don’t Miss: మాయం కానున్న టోల్ ప్లాజాలు!.. అంతా GNSS సిస్టం: ఇదెలా పనిచేస్తుందో తెలుసా?
ఇండియా లాంచ్ మరియు అంచనా ధర
భారతదేశంలో షియోమీ ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం మీద అధికారిక సమాచారం వెల్లడికాలేదు. అయితే ఈ కారు ధర చైనా మార్కెట్లో 215900 యువాన్స్ నుంచి 299900 యువాన్స్ మధ్య ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 25.4 లక్షల నుంచి రూ. 35.3 లక్షలు. దీన్ని బట్టి చూస్తే దేశీయ విఫణిలో లాంచ్ అయితే బహుశా ఇదే ధరకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.