ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెక్నాజీని ఉపయోగించుకోవడంలో చాలా ముందు వరుసలో ఉంది. ఇందులో భాగంగానే సాధారణ రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ తీసుకొచ్చింది. ఇప్పటికే దాదాపు అందరికీ వీటిని జారీ చేసింది కూడా. కాగా.. ఇంకా ఎవరైనా స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోని వారికోసం ప్రభుత్వం చివరి గడువును ప్రకటించింది. ఈ కథనంలో స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ఉపయోగాలేమిటి? గడువు లోపల దీనిని తీసుకోకపోతే ఎంత ఫైన్ కట్టాలి అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
డిసెంబర్ 15 లాస్ట్ డేట్!
రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచడానికి.. ఇందులో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేసింది. 2025 ఆగష్టు నెల నుంచి వీటిని (స్మార్ట్ రేషన్ కార్డ్స్) పంపిణీ చేస్తున్నారు. అయితే ఇంకా కొంతమంది వీటిని తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆఖరి గడువుగా డిసెంబర్ 15 ప్రకటించింది. అంటే ఆ రోజు లోపల కార్డు తీసుకోవాలి. లేకుంటే రూ. 200 చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది.
గడువు దాటితే రూ. 200!
డిసెంబర్ 15 తరువాత.. రేషన్ డీలర్స్ లేదా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ వద్ద ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను కమిషనరేట్‌కు పంపిస్తారు. ఇదే జరిగితే.. తరువాత మీరు స్మార్ట్ రేషన్ కార్డు పొందాలంటే.. కొంత కష్టమే అని చెప్పాలి. కానీ అసాధ్యం కాదు. ఎందుకంటే డిసెంబర్ 15 తరువాత స్మార్ట్ రేషన్ కార్డు కావాలనుకునేవారు.. మీకు సమీపంలో ఉండే వార్డు, గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం 200 రూపాయలు చెల్లించి, అడ్రస్ ప్రూఫ్ ఇస్తే సరిపోతుంది. ఆ తరువాత కార్డు మీ ఇంటికి వస్తుంది.
స్మార్ట్ రేషన్ కార్డు ప్రత్యేకతలు
ప్రభుత్వం అందించిన స్మార్ట్ రేషన్ కార్డులు.. పాత రేషన్ కార్డుల కంటే భిన్నంగా ఉన్నాయి. చూడటానికి ఏటీఎం కార్డు మాదిరిగా ఉన్న ఈ కార్డులో.. కార్డు హోల్డర్ పేరు, కుటుంబ సభ్యుల వివరాలతో పాటు, ప్రభుత్వం లోగో, లబ్దిదారుడి ఫోటో వంటివి ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఉండటం కూడా చూడవచ్చు. ఈ కార్డు పూర్తిగా డిజిటల్, కాబట్టి మోసాలకు తావులేదు. సరైన లబ్ధిదారు ప్రయోజనం తప్పకుండా పొందుతాడు.
స్మార్ట్ రేషన్ కార్డులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి.. యజమాని, కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఫొటోలతో పాటు చిరునామా, రేషన్ డిపో వంటివి కూడా క్షణాల్లో తెలుస్తాయి. కొత్త కారుల కోసం.. యంత్రాంగం కొత్త ఈపోస్ మెషీన్స్ కూడా అందించింది. డీలర్స్ ఇప్పుడు కార్డును స్వైప్ చేయగానే.. కార్డుదారులు వివరాలు ఇట్టే తెలిసిపోయేలా బయోమెట్రిక్ సదుపాయం ప్లాన్ చేశారు. ఒకవేళా అనుకోని సందర్భాల్లో.. బయిమెట్రిక్ పనిచేయని ఎడల ఐరిష్ స్కాన్ చేయొచ్చు కూడా. ఇందులో జీపీఆర్ఎస్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
కొత్త సంస్కరణలలో భాగం..
టెక్నాలజీని ఉపయోగించి.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలు చేపడుతోంది. ఇందులో ఒకటి స్మార్ట్ రేషన్ కార్డు విధానం. ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తప్పకుండా చెప్పవచ్చు. ఇది కార్డు మాదిరిగా ఉండటం వల్ల.. జేబులో పెట్టుకుని సులభంగా తీసుకెళ్లవచ్చు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే అనేక సంస్కరణలు చేపడతారని ఆశిస్తున్నాము.