ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 విషయాలు!

Top 10 Highlights Of Bajaj Freedom 125 CNG Bike: ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్‌జీ బైకును ఇటీవల బజాజ్ ఆటో కంపెనీ భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. ఇది ఆటోమొబైల్ చరిత్రలోనే ఓ పెద్ద విప్లవం అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో మరిన్ని సీఎన్‌జీ బైకులు వస్తాయి అనటానికి ఇదొక నిదర్శనం. అయితే ఈ బైక్ కోసం సంస్థ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి ఇది ఎలాంటి అమ్మకాలు పొందుతుంది? మార్కెట్లో విజయం సాధిస్తుందా? లేదా?.. అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి. అంతకంటే ముందు ఈ బైక్ కొనాలనుకునే వారు తప్పకుండా ఈ బైక్ గురించి తెలుసుకోవలసిన 10 అంశాలను గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

సీఎన్‌జీ ట్యాంక్ కెపాసిటీ

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన సరికొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ 2 కేజీల సీఎన్‌జీ ట్యాంక్ పొందుతుంది. ఇది బైక్ యొక్క సీటు కింద ట్రెల్లీస్ ఫ్రేమ్‌లో అమర్చబడి ఉంటుంది. ట్యాంక్ కెపాసిటీ తక్కువే అయినా ఎక్కువ మైలేజ్ ఇస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైకులోని సీఎన్‌జీ ట్యాంక్ మాదిరిగానే.. 2 లీటర్ల కెపాసిటీ కలిగిం పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. ఇది అన్ని బైకులలో ఉన్నట్లే సీటుకు కొంచెం ముందు భాగంలో ఉంటుంది. ఫ్యూయల్ క్యాప్ కూడా కనిపిస్తుంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కూడా తక్కువే అయినా.. సీఎన్‌జీ మరియు పెట్రోల్ ద్వారా వినియోగదారుడు ఉత్తమ మైలేజ్ పొందవచ్చు.

సీఎన్‌జీతో బైక్ మైలేజ్

కేవలం 2 కేజీల కెపాసిటీ కలిగిన బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ ఒక కేజీ సీఎన్‌జీతో ఏకంగా 102 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. దీని ప్రకారం 2 కేజీల సీఎన్‌జీతో బజాజ్ సీఎన్‌జీ 200 కంటే ఎక్కువ కిమీ మైలేజ్ అందిస్తుంది. ఎక్కువ మైలేజ్ కావాలనుకునేవారికి ఇది ఒక ఉత్తమ ఆప్షన్ అనే చెప్పాలి. సాధారణ పెట్రోల్ బైకుతో పోలిస్తే సీఎన్‌జీ బైక్ నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువే.

పెట్రోల్‌లో బైక్ మైలేజ్ & మొత్తం మైలేజ్

బజాజ్ సీఎన్‌జీ బైకులోని పెట్రోల్ ట్యాంక్ 102 కిమీ మైలేజ్ అందిస్తుంది. అంటే ఒక లీటరుతో బజాజ్ సీఎన్‌జీ బైక్ 50 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుందన్నమాట. కాగా సీఎన్‌జీ మరియు పెట్రోల్ రెండూ కలిసి 330 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో ఈ మైలేజ్ వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

సీటు పరిమాణం

కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ పొడవైన సీటును పొందుతుంది. సీటు పొడవు ఏకంగా 785 మిమీ వరకు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే బజాజ్ సీఎన్‌జీ బైక్ ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర బజాజ్ బైకుల కంటే పొడవైన సీటును కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ బైక్ రైడర్లకు మాత్రమే కాకుండా పిలియన్లకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

125 సీసీ ఇంజిన్

బజాజ్ సీఎన్‌జీ బైక్ 125 సీసీ విభాగంలో లాంచ్ అయింది. కాబట్టి ఇది 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 9.4 బిహెచ్‌పీ పవర్ మరియు 9.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుందనే చెప్పాలి. అయితే బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ పర్ఫామెన్స్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

టాప్ స్పీడ్

ఒక బైక్ ఎంత మంచి డిజైన్ కలిగి ఉన్నప్పటికీ స్పీడ్ కూడా ముఖ్యమే. కాబట్టి బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ సీఎన్‌జీతో నడిచేటప్పుడు గంటకు 90.5 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే పెట్రోల్‌తో నడిచేటప్పుడు గంటకు 93.4 కిమీ వరకు వేగవంతం అవుతుంది. సీఎన్‌జీతో నడిచేటప్పుడు కంటే కూడా పెట్రోల్‌తో నడిచేటప్పుడు ఈ బైక్ స్పీడ్ కొంత ఎక్కువని తెలుస్తోంది.

గేర్‌బాక్స్ ఆప్షన్

కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ 125 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ఇది ఇతర బైకుల మాదిరిగానే 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి పనితీరు గురించి వాహన వినియోగదారుడు ప్రేత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

వేరియంట్స్

ఇటీవలే దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్.. ముచ్చటగా మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి డ్రమ్ వేరియంట్, డ్రమ్ ఎల్ఈడీ వేరియంట్ మరియు డిస్క్ ఎల్ఈడీ వేరియంట్. ఇవి మూడు చూడటానికి ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫీచర్ల విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది.

Don’t Miss: వాహన ప్రపంచానికి మకుటం లేని మహారాజు.. ‘MS ధోని’ మైండ్ బ్లోయింగ్ కార్లు

ధరలు

ఇప్పుడు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం బైక్ యొక్క ధరలు. బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బేస్ వేరియంట్ (డ్రమ్ వేరియంట్) ధర రూ. 95000. మిగిలిన రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ. 1.05 లక్షలు (డ్రమ్ ఎల్ఈడీ వేరియంట్), రూ. 1.10 లక్షలు (డిస్క్ ఎల్ఈడీ).. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్.