Zerodha CEO Nikhil Kamath Buys Ather Electric Scooter: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తేడాలేకుండా రోజు వారీ వినియోగానికి లేదా సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీతారలు, పారిశ్రామిక వేత్తలు సైతం తమ గ్యారేజిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యాడ్ చేశారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త జెరోధా కో-ఫౌండర్ ‘నిఖిల్ కామత్’ (Nikhil Kamath) ఓ సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
నిఖిల్ కామత్ కొనుగోలు చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఏథర్’ (Ather) కంపెనీకి చెందిన ‘450అపెక్స్’ అని స్పష్టమవుతోంది. ఈ స్కూటర్ కొనుగోలు చేసిన తరువాత నిఖిల్ రద్దీగా ఉన్న రోడ్ల మీద రైడ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వేలకోట్ల సంపద గలిగిన ఈయన కేవలం రూ.1.96 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే స్కూటర్ కొనుగోలు చేయడం చాలామందిలో ఒకింత ఆశ్చయాన్ని కలిగిస్తోంది. మరోవైపు ఈయనకు ఎలక్ట్రిక్ స్కూటర్ మీదున్న ఆసక్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
జెరోదా సీఈఓ నిఖిల్ కామత్ ఫోటోలను షేర్ చేస్తూ.. తాను ఏథర్ 450అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంఆర్‌పీ ధరకే కొన్నాను. కంపెనీ నాకు ఎలాంటి డిస్కౌంట్ అందించలేదని అన్నారు. అంతే కాకుండా.. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు గొప్ప ఉత్పత్తులని ప్రశంసించారు. మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందుతున్నాయని అన్నారు. అయితే కంపెనీ మార్కెటింగ్ తీరుపైన అంత సంతోషంగా లేనని పేర్కొంటూ.. సారీ తరుణ్ అని పేర్కొన్నారు.
ఒకప్పుడు తాను ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో పెట్టుబడి పెట్టాలని అనుకున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ ఉత్పత్తితో పోలిస్తే.. అమ్మకాలు వేగంగా సాగుతాయని ఆయన అన్నారు. అయితే తాను ఏథర్ ఎనర్జీకి మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా చొరవే.. అని అన్నారు. ఈ చొరవలో భాగంగానే చాలామంది విదేశీ బ్రాండ్ వాహనాల కంటే స్వదేశీ బ్రాండ్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారని అన్నారు.
ఏథర్ ఎనర్జీ
ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థల్లో ఒకటైన ఏథర్ ఎనర్జీ కంపెనీని 2013లో తరుణ్ మెహతా మరియు స్వప్నిల్ జైన్ స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ప్రస్తుతం కంపెనీ రెండు తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ఇందులో ఒకటి వైట్‌ఫీల్డ్‌లో (బెంగళూరు), మరొకటి హోసూర్ (తమిళనాడు).
బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ కంపెనీ.. ప్రస్తుతం ఏథర్ 450ఎస్, ఏథర్ 450ఎక్స్, ఏథర్ 450ఎక్స్ ప్రో, ఏథర్ 450 అపెక్స్ మరియు ఏథర్ రిజ్టా స్కూటర్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో తరువాత భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థగా అవతరించింది. ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా ఏథర్ గ్రిడ్ అని పిలువబడే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసింది.
ఏథర్ 450 అపెక్స్
ఇక నిఖిల్ కామత్ కొనుగోలు చేసిన ఏథర్ 450 అపెక్స్ విషయానికి వస్తే.. ఈ ఏడాది మార్కెట్లో అడుగుపెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఇది ఒకటి. ఇప్పటికే కంపెనీ ఈ స్కూటర్ డెలివరీలను కూడా ప్రారంభించింది. అయితే ఇది ప్రస్తుతం బెంగళూరు వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. కాగా కంపెనీ ఈ స్కూటర్ ఉత్పత్తిని మారినిత్ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
కంపెనీ అమ్మకాలపై ద్రుష్టి సారించడం కంటే కూడా మంచి నాణ్యమైన ఉత్పత్తి అందించడానికి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే డెలివరీలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి, దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Don’t Miss: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 విషయాలు!
ఏథర్ 450 అపెక్స్ కొంత ఖరీదైనదే అయినప్పటికీ.. బ్రాండ్ యొక్క అత్యంత శక్తివంతమైన స్కూటర్ కూడా. ఇది 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 7kW మోటారును పొందుతుంది. గంటకు 100 కిమీ వేగంతో.. 157 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇది స్మార్ట్ ఎకో, ఎకో, రైడ్, స్పోర్ట్స్, వార్ప్ మరియు వార్ప్ ప్లస్ అనే ఆరు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఇందులో రైడర్లకు కావాల్సిన దాదాపు అన్ని అప్డేటెడ్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎక్కువమంది ఈ స్కూటర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.