మహీంద్రా కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 700, థార్, స్కార్పియో వంటి కార్లు గొప్ప బుకింగ్స్ పొందాయి. ఇప్పుడు ఆ రికార్డును బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ చెరిపేసింది. కేవలం సెకన్ల వ్యవధిలో మొత్తం అమ్ముడుపోయి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
135 సెకన్లలో సేల్
దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మధ్య కాలంలోనే.. బీఈ 6 ఎలక్ట్రిక్ కారును ప్రత్యేకమైన బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ రూపంలో లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారు కోసం ఆగస్టు 23న ఉదయం 11:00 గంటలకు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ స్వీకరించడం స్టార్ట్ చేసిన 135 సెకన్లలో (దాదాపు 3 నిముషాలు) కేటాయించిన 999 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది బుకింగ్స్ చరిత్రలోనే ఓ గొప్ప హిస్టరీ.
నిజానికి మహీంద్రా కంపెనీ బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లాంచ్ చేసినప్పుడు.. కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఆ తరువాత ఈ సంఖ్యను 999కి పెంచారు. అయినప్పటికీ అన్నీ సెకన్ల వ్యవధిలో సేల్ అయిపోయాయి. ఈ కారుకు కంపెనీ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్ భాగస్వామ్యంతో నిర్మించింది.
బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ధర
దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. స్టాండర్డ్ బీఈ 6.. 79 కిలోవాట్ ప్యాక్ 3 వేరియంట్ ఆధారంగా నిర్మితమైంది. దీని ధర రూ. 27.79 లక్షలు (ఎక్స్ షోరూం). ఈ కారును బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు సెప్టెంబర్ 20న అంతర్జాతీయ బ్యాట్‌మ్యాన్ దినోత్సవం నుంచి ప్రారంభం కానున్నాయి.
డిజైన్ & ఫీచర్స్
కొత్త మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. స్టాండర్డ్ బీఈ 6 ఆధారంగా తయారు చేసినప్పటికీ, ఆకర్షణీయమైన కాస్మొటిక్ డిజైన్స్ పొందినట్లు తెలుస్తోంది. ఇది శాటిన్ బ్లాక్ ఫినిషింగ్, బ్యాట్‌మ్యాన్ డెకాల్స్, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, బోల్డ్ ఆల్కెమీ గోల్డ్ పెయింటెడ్ సస్పెన్షన్, బ్రేక్ కాలిపర్లు అన్నీ చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. బ్యాట్ లోగోలు హబ్ క్యాప్స్, క్వార్టర్ ప్యానెల్స్, రియర్ బంపర్ అంతటా ఉన్నాయి.
ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ప్రీమియం ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. స్వెడ్ లెదర్ అపోల్స్ట్రే, బ్యాట్‌మ్యాన్ నెంబర్ ప్లేక్, ఎంబోస్డ్ బ్యాట్ లోగోలు మొదలైనవన్నీ ఇందులో ఉన్నాయి. స్టీరింగ్ వీల్ కూడా ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. లెవెల్ 2 ప్లస్ ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
పర్ఫామెన్స్
మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. స్టాండర్డ్ ‘బీఈ 6’ 79 కిలోవాట్ బ్యాటరీ ఎడిషన్ ఆధారంగా నిర్మించబడింది. కాబట్టి బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌లో కూడా అదే 79 కిలోవాట్ బ్యాటరీ 281 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 682 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఈ కారు కేవలం 6.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది 175 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. 20 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. మొతం మీద ఈ స్పెషల్ ఎడిషన్ అన్ని విధాలా వాహన వినియోగదారులను ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.