నోట్ల రద్దు ఎప్పుడు జరిగింది అనే ప్రశ్న రాగానే.. మోదీ ప్రభుత్వంలో జరిగిందని చాలామంది చెబుతారు. కానీ దశాబ్దాలకు ముందే నోట్ల రద్దు జరిగిందంటే బహుశా కొందరు నమ్మకపోవచ్చు. ఇంతకీ అప్పుడు రద్దు అయిన నోట్లు ఏవి?, ఎవరి హయాంలో నోట్ల రద్దు జరిగిందనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1946 జనవరి 12న ఓసారి!
నోట్ల రద్దు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే జరిగిందని కొందరు చెబుతున్నప్పటికీ.. బ్రిటీష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో (1946 జనవరి 12) కూడా నోట్ల రద్దు జరిగినట్లు కొన్ని అధరాలు చెబుతున్నాయి. యుద్ధం నాటి నల్ల డబ్బును (బ్లాక్ మనీ) బయట తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే.. దేశానికి స్వాతంత్య్రం రాకముందే రూ. 1,000, రూ.5,000, రూ. 10,000 నోట్ల రద్దు చేశారు. ఈ ప్రభావం సంపన్నుల మీదనే చూపింది. ఈ చర్య వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులకు గురవ్వలేదు.
1978 జనవరి 16న మరోసారి!
బ్రిటీష్ ప్రభుత్వం ఒకసారి నోట్ల రద్దు చేసిన తరువాత.. 1978 జనవరి 16న.. అంటే నేటికి 48 సంవత్సరాలు ముందు అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా నోట్ల రద్దు చేపట్టారు. అప్పుడు కూడా అదే రూ. వెయ్యి, రూ. ఐదు వేలు, రూ. పదివేలు నోట్లను రద్దు చేశారు. బ్లాక్ మనీని నియంత్రించడంలో భాగంగా అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా సాధారణ ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపించలేదు.
మోదీ ప్రభుత్వంలో ఇంకోసారి!
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. 2016లో జరిగిన నోట్ల రద్దు చాలామందిపై ప్రభావము చూపింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజలపై కూడా పడింది. రూ. 500, రూ.1000 నోట్ల రద్దు జరిగింది. ఈ నోట్ల రోజువారీ శ్రామికుల దగ్గర కూడా ఉండేవి. ఎక్కువ మొత్తంలో వారి వద్ద ఉండే అవకాశం లేదు కాబట్టి.. ఈ ప్రభావం కూడా సంపన్నుల మీదనే చూపించింది. బ్లాక్ మనీ కంట్రోల్, నకిలీ నోట్ల చెలామనీ వంటి వాటిని నిర్మూలించి.. డిజిటల్ చెల్లిపులకు ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రూ.2000 నోట్ల ఉపసంహరణ
నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనే.. 2016 నవంబర్ 8న రూ. 2000 నోట్లు పరిచయం చేశారు. ఇవి కొన్ని రోజులు చెలామనిలో ఉన్నాయి. ఆ తరువాత 2023 మే 19న వీటిని (రెండు వేలరూపాయల నోట్లు) ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఇప్పటి వరకు 98 శాతం నోట్లు (సుమారు రూ. 6200 కోట్లు విలువైన నోట్లు) వెనక్కి వచ్చాయి. కాగా ఈ నోట్లను మార్పిడి చేసుకోవటానికి ఆర్బీఐ అవకాశం కల్పించింది.
నోట్ల రద్దు వల్ల లాభమా?
నిజానికి నోట్ల రద్దు చేసిన ప్రతిసారీ ఏదో ఒక లక్ష్యంతోనే చేయడం జరుగుతోంది. దీనివల్ల కొంతమంది సాధారణ ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒక మంచి పని చేయడం కోసం.. కొన్ని సమస్యలు కూడా ఎదురైనప్పుడు, తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన తరువాత డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల డిజిటల్ భారత్ సాధ్యమైంది. నేడు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర నుంచి.. చిన్న బట్టి కొట్టు దగ్గర వరకు అన్ని డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.






