Tuesday, January 27, 2026

2026లో లాంచ్ అయ్యే 7 సీటర్ కార్లు: వివరాలు

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో.. కొత్త కొత్త వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. 2025లో భారతదేశంలో అనేక కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది కూడా లెక్కకు మించిన వాహనాలు లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ కథనంలో ఇండియాలో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న బెస్ట్ 7 సీటర్ కార్లను గురించి తెలుసుకుందాం.

ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్

ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న పాపులర్ 7 సీటర్ కార్ల జాబితాలో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన టేరాన్ ఆర్-లైన్ ఒకటి. మూడు వరుసల సీటింగ్ ఆప్షన్ కలిగిన ఈ కారు.. ఆర్ లైన్ బ్యాడ్జ్ పొందుతుంది. ఇది మన దేశానికి దిగుమతి అవుతుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని.. ఇది 204 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం. ఇంజిన్ 7 స్పీడ్ డీసీటీ ద్వారా ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ పొందుతుంది.

ఎంజీ మెజెస్టర్

2025లో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎంజీ మోటార్ కంపెనీ తన మెజెస్టర్ కారును మొదటిసారి ప్రదర్శించింది. ఇప్పుడు సంస్థ దీనిని ఫిబ్రవరి 12న దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త కారు గ్లోస్టర్ స్థానంలో అమ్మకానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా.. 210 హార్స్ పవర్, 478 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

నిస్సాన్ టెక్టన్

గ్రావైట్ కారుతో పాటు.. నిస్సాన్ కంపెనీ టెక్టన్ కారును కూడా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. దీనిని సంస్థ సీఎంఎఫ్-బీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకోనుంది. ఈ ఏడాది చివరి నాటికి దేశీయ విఫణిలో ఈ కారు లాంచ్ అవుతుందని సమాచారం. మార్కెట్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇవ్వడానికి సంస్థ ఈ ప్రయత్నం చేస్తోంది.

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్

2022లో మహీంద్రా కంపెనీ తన స్కార్పియో ఎన్ కారును లాంచ్ చేసింది. అప్పటి నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న ఈ కారు.. త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కావడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సంస్థ దీనిని అనేక సార్లు టెస్టింగ్ చేసింది. ఇది దాదాపు స్టాండర్డ్ స్కార్పియో ఎన్ మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కొన్ని అప్డేటెడ్ మార్పులు ఉండటం కనిపిస్తుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్థాయి.

రెనాల్ట్ బోరియల్

డస్టర్ కారును మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత.. రెనాల్ట్ కంపెనీ తన 7 సీట్ల వెర్షన్‌ను బోరియల్ పేరుతో భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ కారు డస్టర్ మాదిరిగానే.. అదే ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుంది. పవర్‌ట్రెయిన్‌లో కూడా ఎటువంటి మార్పులు లేవని సమాచారం. అయితే అప్డేటెడ్ ఫీచర్లలో భాగంగా ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా వంటివి ఉండనున్నాయని తెలుస్తోంది. ధరలు మాత్రం తెలియాల్సి ఉంది.

Sourya Vardan
Sourya Vardan
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.

Related Articles