ఓ వ్యక్తి కారు కొంటున్నాడు అంటే.. డిజైన్, ఫీచర్స్, మైలేజ్ ఇలా సవాలక్ష చూస్తుంటాడు. డిజైన్, ఫీచర్స్ విషయంలో ఎలాంటి తేడా లేకపోయినా.. మైలేజ్ విషయంలో కంపెనీలు చెప్పినంత వాస్తవ ప్రపంచంలో ఉండదు. దీనికి పులుస్టాప్ పెట్టడానికి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ” కీలక ప్రకటన చేసింది. మైలేజ్ గణాంకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడటానికి ఓ కొత్త విధానం అమలులోకి తెచ్చింది.
మైలేజ్ టెస్టింగ్ ఇలా..
వాహన తయారీదారు.. కారు మైలేజ్ చెక్ చేసేటప్పుడు, ఒకసారి ఏసీ ఆన్ చేసి టెస్ట్ చేయాలి. మరోసారి ఏసీ ఆన్ చేయకుండా లేదా ఏసీ ఆఫ్ చేసి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా టెస్ట్ చేసిన తరువాత రెండు మైలేజ్ వివరాలు స్పష్టంగా వెల్లడించాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అక్టోబర్ 1 నుంచి
2026 అక్టోబర్ 1 తరువాత భారతదేశంలో తయారు చేసిన లేదా దిగుమతి చేసుకున్న వాహనాలు ఈ విధానం ద్వారానే మైలేజ్ గణాంకాలను కచ్చితంగా వెల్లడించాలి. ఇందులో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా సీఎన్జీ కార్లు ఉంటాయి. మైలేజ్ వివరాలను సంస్థలే.. యూజర్ మాన్యువల్ / అధికారిక వెబ్సైట్లో నమోదు చేయాలి.
ఇప్పటి వరకు కార్ల తయారీదారులంతా.. యూరోపియన్ నిబంధనల ప్రకారం, ఏసీ ఆన్ చేయకుండా టెస్ట్ చేసిన మైలేజ్ వెల్లడించేవారు. కానీ కారును కొనుగోలు చేసిన వ్యక్తి.. ఎప్పుడూ కారును ఏసీ ఆన్ చేయకుండా ఉపయోగించడం కుదరని పని. ఏసీ ఆన్ చేసి కారును ఉపయోగించడం వల్ల మైలేజిలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇది ఒకరకంగా చెప్పాలంటే మైలేజ్ విషయంలో దాగుడుమూతలనే చెప్పాలి.
లేటెస్ట్ నోటిఫికేషన్
ఇటీవల జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్లో.. 2026 అక్టోబర్ 1 తరువాత మైలేజ్ టెస్టింగ్ విషయంలో ఏసీ ఆన్ / ఏసీ ఆఫ్ పద్దతిలో వెల్లడించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కచ్చితమైన మైలేజ్ గణాంకాలను వెల్లడించడం వల్ల.. కొనుగోలుదారులతో కంపెనీపై నమ్మకం పెరుగుతుంది. ఇది అమ్మకాలను ప్రభావితం చేసే అవకాశం లేదు.
మైలేజిలో తేడా!
నిజానికి.. ఒక కంపెనీ ఓ కారును తయారు చేసి మార్కెట్లో విడుదల చేసేటప్పుడు దాని మైలేజ్ టెస్ట్ చేస్తుంది. ఆ సమయంలో నిర్ణీత వేగంతో ప్రయాణం చేయడం మాత్రమే కాకుండా.. ఏసీ వంటివి ఆఫ్ చేసి ఉంటాయి. దీనివల్ల మైలేజ్ కొంత ఎక్కువ వస్తుంది. అయితే ఇది రియల్ వరల్డ్ మైలేజ్ కాదు. అయితే మనం కారును కొనుగోలు చేసినప్పుడు.. వివిధ వాతావరణ పరిస్థితుల్లో, వివిధ రోడ్డు మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటాము. అలాంటి సమయంలో కంపెనీ చెప్పే మైలేజికి.. మనకు వచ్చే మైలేజికి చాలా తేడా కనిపిస్తుంది.
దీనిని దృష్టిలో ఉంచుకునే.. మంత్రిత్వ శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇది అమలులోకి వచ్చిన తరువాత సంస్థే.. రియల్ వరల్డ్ మైలేజ్ చెప్పేస్తుందన్నమాట. ఇది పారదర్శకం కూడా. ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల, కచ్చితమైన విషయాలు కొనుగోలుదారునికి తెలుస్తాయి. అప్పుడే కంపెనీపై, కంపెనీ ఉత్పత్తులపై నమ్మకం పెరుగుతుంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.






