అనేక టీజర్ల తరువాత దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ తన సియెర్రా కారును అధికారికంగా.. భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది 2003లో నిలిపివేయబడిన ఐకానిక్ సియెర్రాను గుర్తు చేసింది. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు ధరలను సంస్థ నవంబర్ 25న ప్రకటించనుంది.
డిజైన్ ఎలా ఉందంటే
బాక్సీ డిజైన్ కలిగిన టాటా సియెర్రా కారు.. ముందు భాగంలో కాంట్రాస్టింగ్ గ్లాస్ బ్లాక్ ప్యానెల్, దానికి కనెక్ట్ అయిన ఎల్ఈడీ డీఆర్ఎల్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్.. బ్రాండ్ లోగోను అనుసంధానించబడి ఉంటాయి. బంపర్ రెండువైపులా.. పిక్సెల్ ఆకారంలో ఉండే ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా పొందుతుంది. 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చెస్, డోర్స్ మీద బ్లాక్ బాడీ క్లాడింగ్, బ్లాక్ రూఫ్ రైల్ మొదలైనవన్నీ ఇందులో చూడవచ్చు. వెనుక భాగంలో వెడల్పు అంతటా విస్తరించి ఉన్న ఎల్ఈడీ టెయిల్‌లైట్ బార్ ఉంది. మొత్తం మీద డిజైన్ అద్భుతంగా ఉందనే చెప్పాలి.
ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్
సియెర్రా లోపల భాగం విశాలంగా, విలాసవంతంగా ఉంది. లోపల మూడు స్క్రీన్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి డ్రైవర్ డిస్ప్లే కాగా.. రెండు ఇన్ఫోటైన్మెంట్ కోసం ఉపయోగిస్తారు. టాటా కర్వ్ మాదిరిగా.. సియెర్రా కూడా ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ పొందుతుంది. ప్రకాశవంతమైన బ్రాండ్ లోగో ఇక్కడ కనిపిస్తుంది.
క్యాబిన్ నలుపు, బూడిద రంగు థీమ్ పొందుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్ కూడా విశాలంగా ఉంది. సియెర్రా కారులోని ఐదు సీట్లు అడ్జస్టబుల్ చేయగల హెడ్‌రెస్ట్‌లు పొందుతుంది. 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు కనిపిస్తాయి. ఇవి మాత్రమే కాకుండా.. ఇందులో డ్యూయెల్ జోన్ ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉన్నాయి.
ఇంజిన్ గురించి వివరాలు
కొత్త టాటా సియెర్రా.. రెండు ఇంజిన్ ఎంపికలతో రానుంది. ఇందులో ఒకటి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 170 హార్స్ పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభిస్తుంది. రెండోది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.. ఇది కూడా అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.
అంచనా ధర
టాటా సియెర్రా ధరను కంపెనీ వెల్లడించలేదు. కానీ దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. కంపెనీ దీని ధరలను నవంబర్ 25న అధికారికంగా వెల్లడించనుంది. కాగా కంపెనీ బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నాము.
సియెర్రా మంచి అమ్మకాలను పొందనుందా?
నిజానికి భారతదేశంలో లాంచ్ అయిన దాదాపు అన్ని టాటా కార్లు గొప్ప అమ్మకాలను పొందుతున్నాయి. ఇప్పుడు కొత్తగా లాంచ్ కావడానికి సిద్దమవుతున్న సియెర్రా కూడా తప్పకుండా ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నాము. ఇది సరికొత్త డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటం మాత్రమే కాకుండా.. కొంత తక్కువ ధరలో విడుదలయ్యే అవకాశం ఉండటం వల్ల దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని ఆశిస్తున్నాము.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.